*కుర్చీలాటలో అసలకే మోసం వస్తుందా…
*ఏడీ పోస్టు దేవుడికెరుక…
*ఉన్న సీఐఈ ఓ నుంచి డిమోషన్ తప్పదా..?
*డిమోషన్ అయితే ఆర్ ఐ ఈ కృష్ణారెడ్డి కి లైన్ క్లియర్ ఆయినట్లే నా…
*ఏది నిజం… ఏది అబద్దం..?
(రామమోహన్ రెడ్డి)
కొండనాలుకను నమ్ముకుని ఉన్న నాలుకని పోగొట్టుకున్న చందంగా అడిషనల్ డైరెక్టర్ సీటు కోసం పోటీల్లో పీఆర్ ఇంజనీరింగ్ శాఖల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం లో అసలుకే ఎసరు రానుందా అన్న అనేక రకాల ప్రశ్నలు సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో చర్చ నడుస్తోంది.అసలు ఏమిటీ వివాదం ముదురుతోంది దీనికి గల కారణాలను విశ్లేశిస్తే…

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ (CIE) పోస్టు చుట్టూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. 2008లో జరిగిన ప్రమోషన్, డిప్యుటేషన్ సర్వీసు, రాష్ట్ర విభజన తర్వాత పోస్టుల పరిస్థితి, హైకోర్టు తీర్పులు, జీఏడీ అభిప్రాయాల నేపథ్యంలో ఓ. మధుసూదన్ సేవల రెగ్యులరైజేషన్, సీనియారిటీ, ప్రమోషన్ చెల్లుబాటుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఒకే మంజూరు పోస్టుకు 2008లో ఇద్దరు అధికారులను ఎలా ప్రమోట్ చేశారు,రెగ్యులర్ పోస్టు లేకపోయినా 2008 నుంచే సేవలను రెగ్యులరైజ్ చేయవచ్చా,డిప్యుటేషన్లో గడిపిన కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించవచ్చా,హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి సీనియారిటీ జాబితా తయారైతే పరిస్థితి మారుతుందా అన్నవిఇప్పుడు సమాచార శాఖలో చర్చనీయాంశంగా మారాయి.2008లో జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.336 ప్రకారం ఎల్.ఎల్.ఆర్. కిశోర్ బాబు, ఓ. మధుసూదన్ ఇద్దరినీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లుగా ప్రమోట్ చేశారు. అయితే శాఖలో ఒకే రెగ్యులర్ పోస్టు ఉండగా, మధుసూదన్‌ను డిప్యుటేషన్లో కొనసాగించడం వల్ల ఆయన ప్రమోషన్ స్వభావంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1993 నాటి జీఓ(పి) నెం.10 ప్రకారం ప్రొబేషన్ పూర్తి కాకముందు డిప్యుటేషన్‌కు పంపకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా డిప్యుటేషన్లో గడిపిన సేవను ప్రొబేషన్ కోసం లెక్కించాలంటే ప్రత్యేక సడలింపు అవసరం. ఇదే అంశాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత అది కాస్త మరింత క్లిష్టంగా మారింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టు తెలంగాణకు కేటాయించబడగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోస్టు 31 అక్టోబర్ 2016న మాత్రమే సృష్టించబడింది. మధుసూదన్ 10 నవంబర్ 2016న ఆ పోస్టులో చేరారు.అయితే పోస్టు లేని కాలంలో 2008 నుంచి రెగ్యులర్ సర్వీసుగా ఎలా పరిగణించాలన్న ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.ఇదే సమయంలో హైకోర్టు చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పోస్టు అదనపు డైరెక్టర్ పోస్టుకు ఫీడర్ కేటగిరీ అని పేర్కొంటూ ఉమ్మడి సీనియారిటీ జాబితా రూపొందించాలని ఆదేశించింది. డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది.ఉమ్మడి సీనియారిటీని ఆశించిన మధుసూదన్‌కు అదే ఇప్పుడు ప్రతికూలంగా మారే అవకాశముందన్న చర్చ శాఖలో సాగుతోంది. డిప్యుటేషన్లో ఉన్న కారణంగా ఆయన ఏ ప్రమోషన్ కేడర్‌లోనూ ప్రొబేషన్ ప్రకటించబడలేదనే అంశం తాజాగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.మధుసూదన్‌కు సంబంధించిన పూర్తి సర్వీస్ రికార్డులను పరిశీలించిన లా డిపార్ట్మెంట్, గత సర్వీసును పూర్తిస్థాయిలో రెగ్యులర్ చేయడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదనే అభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి 2008 నుంచి కాకుండా 2016 నుంచి మాత్రమే సర్వీసును రెగ్యులర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లా డిపార్ట్మెంట్ అభిప్రాయం ప్రకారం, అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా వర్తింపజేస్తే 2008లో జరిగిన పదోన్నతిని పూర్తిస్థాయి రెగ్యులర్ ప్రమోషన్‌గా పరిగణించడం క్లిష్టమవుతుందని తెలుస్తోంది. 2016 వరకు సంబంధిత మంజూరైన పోస్టు అందుబాటులో లేకపోవడం, సీనియారిటీ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉండటం, గత సర్వీసును రెగ్యులరైజ్ చేయాలంటే ప్రత్యేక సడలింపు అవసరం కావడం వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఉమ్మడి సీనియారిటీ జాబితా ఆధారంగా ప్రమోషన్లను పునఃసమీక్షిస్తే ప్రస్తుతం ఉన్న హోదాలు, పదోన్నతి క్రమంపై ప్రభావం పడే అవకాశం ఉందని శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, 2016 నుంచే మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం నిర్ణయిస్తే, గతంలో పదోన్నతుల ద్వారా పొందిన వేతన వ్యత్యాసాలు, ఇతర సర్వీస్ ప్రయోజనాల అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత కాలంలో పొందిన ఆర్థిక లబ్ధిని తిరిగి ప్రభుత్వానికి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుందా అనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇన్ని పరిణామాల నేపథ్యంలో మధుసూదన్ ప్రస్తుత హోదాపై ప్రభావం పడుతుందా..? ఆయన ప్రమోషన్ ను రివర్స్ చేసే పరిస్థితి వస్తుందా..? తదుపరి సీనియర్ అధికారిగా ఉన్న కృష్ణారెడ్డికి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ పదవి దక్కే అవకాశముందా..? అనే అంశాలు ఇప్పుడు సమాచార శాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.చూడాలి మరి ముఖ్యమంత్రి ఏలాంటి నిర్ణయం తీసుకుంటారనేది.

