టాప్ న్యూస్గృహిణి సేవలు వెలకట్టలేం..సుప్రీం కోర్టు

గృహిణి సేవలు వెలకట్టలేం..సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ:ఇంటిపని, వంటపని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని పేర్కొంది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 2006లో ఓ మహిళ కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె ప్రయాణించిన కారుకి ఇన్సూరెన్స్ లేకపోవడంతో..తనకు పరిహారం చెల్లించే బాధ్యత కారు ఓనర్ పై పడింది. దీంతో మృతురాలి భర్త, కుమారుడికి రూ. 2.5 లక్షల పరిహారం చెల్లించాలని మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఓనర్ ను ఆదేశించింది. అయితే, ఆ పరిహారం సరిపోదంటూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ కేసును వాదించిన కోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసింది. ఆమె గృహిణి కాబట్టి పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, ఆ నష్టపరిహారం సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.
తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టే ఆమె సేవలను ఆర్థిక కోణంలో తగదని, ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆమె ఏమీ తక్కువ కాదని పేర్కొంది. ఆమె సేవలను వెలకట్టలేమనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article