తాజా వార్తలువాన నీటిలో కొట్టుకుపోయిన పేదవాడి ఆశలు..

వాన నీటిలో కొట్టుకుపోయిన పేదవాడి ఆశలు..

రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు..

వినాయక చవితి వ్యాపారంపై వర్షం దెబ్బ..

పండుగ కోసం తెచ్చిన పూజా సామాగ్రి నీటిలో కొట్టుకుపోయినా.. ఎవరినీ నిందించని పేదవాడు..


మచిలీపట్నం

వినాయక చవితి అంటే నగరాల్లో సందడి మాత్రమే కాదు.. ఆ సందడి వెనుక గ్రామీణ పేద, మధ్యతరగతి కి చెందిన వారి శ్రమ, చెమట కూడా ఉంటుంది. పూర్వ కాలం నుంచి కొనసాగుతున్న ఆనవాయితీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలు పండుగకు అవసరమైన పూజా సామాగ్రి, పత్రి, పండ్లు, పువ్వులు,వినాయక ప్రతిమల తయారీకి ఉపయోగించే మట్టి తదితరాలను నగరానికి తీసుకువచ్చి విక్రయించడం పరిపాటిగా వస్తోంది.నగర ప్రజలకు పండుగ సామాగ్రిని అందిస్తూ వచ్చే కొద్దిపాటి లాభంతో తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని గ్రామీణ పేదలు ఆశపడతారు. డ్వాక్రా రుణ వాయిదా కట్టుకోవాలని.. అప్పు తీర్చాలని.. ఇంటిల్లపాదీ కడుపునిండా తినాలని.. పిల్లలకు కొత్త బట్టలు కొనాలని.. వినాయక చవితిని తమ ఇంట్లోనూ ఆనందంగా జరుపుకోవాలని ఎన్నో ఆశలతో నగరానికి చేరుకుంటారు.రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. చేతికి పని దొరికితేనే పొయ్యి వెలిగే కుటుంబాలు వారివి. అలాంటి కుటుంబాలు ఏడాది మొత్తం ఎదురుచూసే కొద్దిపాటి ఆదాయానికి వినాయక చవితి కూడా ఒక అవకాశమే. దీనిని పురస్కరించుకొని ఒక్కరోజు ముందే మచిలీపట్నం నగరానికి చేరుకొని రోడ్డు పక్కన వ్యాపారం కోసం బల్లలు ఏర్పాటు చేసుకొని తిని తినక దోమల్లో నిద్ర పోకుండా ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం అయ్యాక తమ తెచ్చిన పూజా సామాగ్రిని అమ్మి ఆనందంగా ఉండాలని చూస్తారు.అయితే ఈ ఏడాది వారి ఆశలపై వర్షం పిడుగులా పడింది. వినాయక చవితికి ఒకరోజు ముందే నగరానికి చేరుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రకృతి ఊహించని చేదు అనుభవాన్ని మిగిల్చింది.ఆదివారం సోమవారం కురిసిన వర్షాలకు రహదారులపైకి చేరిన వర్షపు నీరు చేరి వారి వ్యాపార సామాగ్రిని చుట్టుముట్టింది. కష్టపడి గ్రామాల నుంచి తలపై, బండ్లపై, వాహనాలపై తీసుకొచ్చిన పత్రి, పండ్లు, పూజా సామాగ్రి వర్షం నీటిలో తడిసి పాడైపోవడమే కాక.. కొంత సామాగ్రి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.అమ్మి నాలుగు రూపాయలు సంపాదించాలనుకున్న చోట.. చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడింది. లాభం కోసం తెచ్చిన సామాగ్రి చివరకు నష్టంగా మారింది. ఆశలతో వచ్చిన చేతులు.. తడిసిన సామాగ్రితో ఖాళీగా మారాయి.వినాయకుడి పండుగ తమ జీవితాల్లో కొంత సంతోషాన్ని నింపుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. ఒక్కరోజు వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్న ఆశలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.అయినా వారు దేవుడిని నిందించలేదు. తమను ఆదుకోవాల్సిన వారిని తప్పుపట్టలేదు. తమ కళ్ల ముందే తమ కష్టార్జితం వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నా.. నోటి నుంచి ఒక్క నింద మాట కూడా రాలేదు. ఇదే పేదవాడి సహనం.. ఇదే అతని నిబద్ధత.. ఇదే అతని కట్టుబాటు.హుస్సేన్‌పాలెం, పెడన, పామర్రు, అవనిగడ్డ, మంగళాపురం తదితర ప్రాంతాలతో పాటు వివిధ మండలాల గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు నగరానికి వచ్చారు. పండుగ సందర్భంగా నగర ప్రజలకు అవసరమైన సామాగ్రిని విక్రయించి తమ కుటుంబాలకు కొంత ఆదాయం సమకూర్చుకోవాలనుకున్నారు.కానీ ప్రకృతి వారి ప్రయత్నానికి అడ్డుపడింది. వర్షం వారి వస్తువులను తడిపింది.. నీరులో వారి సామాగ్రిని కొట్టుకుపోయింది.. కానీ వారి ఆత్మస్థైర్యాన్ని మాత్రం కొట్టుకుపోలేకపోయింది.జీవితాలు మారాలంటే ఒక్కరోజు వచ్చే లాభం సరిపోదని వారికి తెలుసు. ప్రతిరోజూ తమకు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తేనే కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. అయినా పండుగ రోజున ఎదురైన నష్టాన్ని ఎవరిపైనా నెట్టలేదు.పేదవాడి బతుకు ఎంత కష్టమైనదో.. అతని ఆశ ఎంత చిన్నదో.. ఆ చిన్న ఆశ కూడా వర్షం నీటిలో కొట్టుకుపోతే అతని గుండె ఎంత బరువెక్కుతుందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి.వినాయక చవితి కోసం నగర ప్రజలు పూజలు చేసుకుంటూ ఆనందంగా ఉండగా.. అదే పండుగ కోసం సామాగ్రి తీసుకొచ్చిన కొందరు పేద కుటుంబాలు మాత్రం తమ తడిసిన వస్తువులను చూస్తూ మౌనంగా వెనుదిరగాల్సి వచ్చింది.వారి చేతుల్లో మిగిలింది లాభం కాదు.. నష్టం. ఇంటికి తీసుకెళ్లింది డబ్బు కాదు.. నిరాశ. అయినా వినాయకుడిపై నమ్మకం మాత్రం వదల్లేదు.పేదవాడి ఆశలను వర్షం చిదిమేసినా.. అతని నమ్మకాన్ని మాత్రం చిదిమేయలేకపోయింది. పండుగ కోసం వచ్చి నష్టపోయిన వారు చివరకు తమ సామాగ్రిని అక్కడే వదిలి పల్లెబాట పట్టారు.రెక్కాడితే గాని డొక్కాడని ఆ బతుకులు మళ్లీ రేపటి పనికోసం ఎదురుచూస్తాయి. ఈరోజు వర్షం కొట్టుకుపోయిన ఆశలు.. రేపు ఎండలో మళ్లీ చిగురిస్తాయనే నమ్మకంతో ప్రతిరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తూనే ఉంటాయి.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article