తాజా వార్తలుకరువు కన్నీళ్ల మధ్య అన్నదాత ఆక్రందన

కరువు కన్నీళ్ల మధ్య అన్నదాత ఆక్రందన

-వర్షం కోసం ప్రార్థనలు -పంటల కోసం రైతుల పోరాటాలు
-బోర్లలో నీరున్నా.. తక్కువ వోల్టేజీతో పంటలకు అందని సాగునీరు
-తొమ్మిది గంటలు కాదు.. రెండు షిఫ్టులు కావాలి
ప్రజాభూమి, హిందూపురం టౌన్
ఒక వైపు వాన కోసం చెరువుల్లో ప్రార్థనలు.. మరోవైపు పంటను బతికించుకునేందుకు కరెంటు కోసం రైతుల పోరాటం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు తీవ్రతకు ఇవే నిదర్శనాలు. ఆకాశం కరుణించక.. భూగర్భ జలాలు ఆదుకోక.. విద్యుత్‌ కూడా నాణ్యతగా అందకపోతే అన్నదాత పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైతు కళ్లలో మళ్లీ ఆశ చిగురించాలంటే వాన కురవాలి. వాన వచ్చేంత వరకు పంటను నిలబెట్టాలంటే నాణ్యమైన కరెంటు అందాలి. ప్రభుత్వం కరువు పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి స్పందించాలని, విద్యుత్‌ శాఖ అధికారులు తక్కువ వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, రైతుల డిమాండ్‌ మేరకు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో 10 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతకు అడుగడుగునా నిరాశే ఎదురవుతోంది. ఒకవైపు వర్షాలు ముఖం చాటేయడంతో పొలాలు ఎండిపోతూ, భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా మరోవైపు ఉన్న కొద్దిపాటి నీటితో పంటలను కాపాడుకుందామంటే విద్యుత్‌ సమస్య వెంటాడుతోంది. వాన కోసం ముస్లింలు చెరువుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసే దుస్థితి నెలకొంటే బోరుబావుల నీటితో పంటలను బతికించుకునేందుకు రైతులు విద్యుత్‌ శాఖ అధికారుల వద్ద మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కరువు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పంటలు కళ్లముందే ఎండిపోతుంటే ప్రకృతి కరుణ కోసం ప్రార్థనలు, అందుబాటులో ఉన్న నీటిని పంటలకు అందించేందుకు రైతుల పోరాటాలు సాగుతున్నాయి.

వాన కోసం ప్రార్థనలు..
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. చెరువులు, కుంటలు నిండక పోవడం, భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ హిందూపురం మండలం చౌలూరు గ్రామంలోని జామియా మసీదు ఆధ్వర్యంలో, అనంతపురం జిల్లా నార్పల లో ముస్లిం సోదరులు ముతవల్లి ఇక్బాల్ భాషా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు చెరువులో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లా దయదలచి వర్షాలు కురిపించాలని, చెరువులు, కుంటలు నిండాలని, ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోయాలని ప్రార్థించారు. వర్షాభావ ప్రభావం పంటలకే పరిమితం కాలేదని, నీరు, మేత అందక పశువులు, పక్షులు, ఇతర మూగజీవాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయని మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మంచి వర్షం కురిస్తే పొలాల్లో పచ్చదనం పరుచుకుని రైతు కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తాయని ఆకాంక్షించారు.

బోర్లలో నీరున్నా.. కరెంటు కష్టమే
వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్న సమయంలో బోరుబావులపై ఆధారపడిఖ సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ సరఫరా మరో పెద్ద సమస్యగా మారింది. తూమకుంట చెరువు కింద పంటలు సాగు చేస్తున్న రైతులు తక్కువ వోల్టేజీ సమస్యతో పంటలకు సక్రమంగా నీరు అందడం లేదని విద్యుత్‌ శాఖ డీఈ చంద్రనాయక్‌ దృష్టికిఖ తీసుకెళ్లారు. విద్యుత్‌ సరఫరా ఉన్నప్పటికీ తక్కువ వోల్టేజీ కారణంగా మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని తెలిపారు. మోటార్లు తిరుగుతున్నా నీరు మాత్రం సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పొలాల్లో తేమ పూర్తిగాఖ తగ్గిపోతోందని, పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని రైతులు తెలిపారు. ఇప్పటికే బోర్లలో నీటిమట్టం పడిపోవడంతో పరిమితంగా లభిస్తున్న నీటిని కూడా సక్రమంగా పంటలకు అందించుకోలేకపోతున్నామని వాపోయారు. ఇలాంటి కీలక సమయంలో విద్యుత్‌ సరఫరా నాణ్యతగా లేకపోతే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు.

తొమ్మిది గంటల కరెంటు.. రైతుకు ఎంత ఉపయోగం…
అధికారులు తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు పేర్కొన్నారు. సుమారు నాలుగు గంటలపాటు మాత్రమే విద్యుత్‌ కొంతమేర ఉపయోగపడుతోందని, మిగిలిన సమయంలో తక్కువ వోల్టేజీ కారణంగా మోటార్లు తిరిగినా నీరు సరిగా రావడం లేదన్నారు. దీంతో గంటల తరబడి విద్యుత్‌ కోసం ఎదురుచూసినా పంటలకు అవసరమైన సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఒకేసారి తొమ్మిది గంటలు విద్యుత్‌ సరఫరా చేయడం కంటే ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టులుగా నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే రైతులకు మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఉదయం ఒక షిఫ్టు, సాయంత్రం మరో షిఫ్టుగా మొత్తం 10 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా చేస్తే బోర్లలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా సమర్థవంతంగా వినియోగించుకుని పంటలను కాపాడుకునే అవకాశం ఉంది.

పంటలు ఎండుతుంటే.. తక్షణ చర్యలేవీ….
తక్కువ వోల్టేజీ సమస్యను తక్షణమే పరిష్కరించి మోటార్లు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిని పరిశీలించి సమస్య ఎక్కడ ఉందో గుర్తించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు లేకపోవడం ఒక సమస్య అయితే.. ఉన్న నీటిని పంటలకు అందించుకునే సమయంలో విద్యుత్‌ నాణ్యత లేకపోవడం మరో సమస్యగా మారిందన్నారు. దీనిని కేవలం సాంకేతిక సమస్యగా కాకుండా రైతుల జీవనోపాధికి సంబంధించిన అత్యవసర సమస్యగా అధికారులు పరిగణించాలని కోరారు. పంటలు ఎండిపోయిన తర్వాత పరిహారం కోసం ఎదురుచూడటం కంటే.. ప్రస్తుతం పంటలను కాపాడే చర్యలే అవసరమని పేర్కొన్నారు.
వాన కోసం ప్రార్థనలు, పంట కోసం పోరాటాలు
ఒకవైపు వాన కురవాలి, చెరువులు నిండాలి, పంటలు బతకాలి అంటూ ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ఉన్న నీటితో నైనా పంటలను కాపాడుకునేందుకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి అంటూ రైతులు అధికారులను కోరుతున్నారు. ఆకాశం వైపు రైతు చూపులు,
చెరువు వైపు ప్రార్థనలు, బోరుబావుల వైపు ఆశలు, విద్యుత్‌ శాఖ వైపు వేడుకోళ్లు, ఇలా అన్నదాతకు కరువు కాలం కన్నీళ్లనే మిగులుస్తోంది. ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను తీవ్రంగా పరిగణించి పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. తక్కువ వోల్టేజీ సమస్యను పరిష్కరించి, ఉదయం, సాయంత్రం విడతలుగా 10 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాలు కురిసి చెరువులు నిండి, భూగర్భ జలాలు పెరిగి, పంటలు పచ్చగా కళకళలాడే రోజులు రావాలని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article