తాజా వార్తలుప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు

ప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు

ప్రకృతితో మమేకమైన అభివృద్ధికే భవిష్యత్తు

గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు పడాలి

ప్రతి భవనం వనరులను సృష్టించేలా ఉండాలి

అభివృద్ధి ఆగకూడదు… పర్యావరణానికి గాయం చేయకూడదు

-బెంగళూరులో ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ది ఎర్త్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

బెంగళూరు: ప్రకృతికి ప్రాధాన్యమిస్తూ, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నిర్మించిన ది ఎర్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి సీఎం చంద్రబాబు ది ఎర్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక పని వాతావరణాన్ని సమన్వయం చేస్తూ ది ఎర్త్ సెంటర్‌ను రూపొందించారు. సుస్థిర నిర్మాణం, ప్రకృతి అనుసంధానం, రీ-సైకిల్ చేసిన పదార్థాల వినియోగం వంటి అంశాలకు ఈ భవనంలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కాంక్రీట్ జంగిల్స్ నుంచి పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వనరులను అధికంగా వినియోగించే భవనాలు కాకుండా.. వనరులను తెలివిగా వినియోగించేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి సాగాలని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి ఆగకుండా… పర్యావరణానికి గాయం చేయకుండా వినూత్న ఆలోచనలతో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

పర్యావరణ సమస్యలను ఇప్పటికే ఎదుర్కొంటున్నాం

వాతావరణ మార్పులతో కలిగే దుష్పరిణామాలు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్య కాదని.. ఇప్పటికే మన ముందున్న సవాలని సీఎం అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని సూచించారు. భవన నిర్మాణాల్లో నెట్‌జీరో విధానాన్ని అవలంభించాలని, సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. చెత్తను కంపోస్టుగా మార్చడంతో పాటు రీ-యూజ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు. వీటితోనే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కర్ణాటక, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధించగలమన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ది ఎర్త్ సెంటర్ నిర్మాణం జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి పర్యావరణ హిత భవనాలకే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చే క్రమంలో ప్రకృతి పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు నిర్మించే భవనాలే రాబోయే దశాబ్దాల్లో నగరాల వాతావరణాన్ని నిర్దేశిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. దశాబ్దాలుగా నగరాల అభివృద్ధి గ్రే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా సాగిందని సీఎం పేర్కొన్నారు. ఇకపై గ్రీన్ గ్రోత్, సర్క్యులర్ గ్రోత్, రీజెనరేటివ్ గ్రోత్ విధానాలు అవసరమన్నారు. స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా భవనాలను రూపొందించాలని సూచించారు. ప్రతి పైకప్పు ఒక పవర్ ప్లాంట్‌గా మారవచ్చు.. ప్రతి నీటి చుక్కను తిరిగి వినియోగించవచ్చు.. ప్రతి వ్యర్థ ప్రవాహాన్ని ఒక వనరుగా మార్చవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు. నీటిని, నేలను కాపాడటం అంటే సంపదను సృష్టించడమేనని చెప్పారు.

వ్యవసాయంలోనే కాదు… అభివృద్ధిలోనూ ప్రకృతికే ప్రాధాన్యతివ్వాలి

వ్యవసాయంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని, అదే స్ఫూర్తి పట్టణాభివృద్ధిలోనూ అవసరమని సీఎం అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల నాన్‌-ఫాసిల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే జాతీయ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 165 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు సైబరాబాద్‌ను అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు మరో చక్కటి నగరాన్ని నిర్మించే అవకాశం తనకు దేవుడు ఇచ్చారని చెప్పారు. ప్రకృతి, సాంకేతికత, ఆధునిక మౌలిక వసతులతో అమరావతిని భవిష్యత్ తరాలకు అనువైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను గుర్తిస్తూ… పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ ప్రాజెక్టును రూపొందించిన రఘువీర్ వీరమాచనేని, ప్రవీణ్ కుమార్, విస్టా స్పేసెస్ బృందం, వెంకటరమణన్ అసోసియేట్స్ ప్రతినిధుల్ని ముఖ్యమంత్రి అభినందించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article