Uncategorizedస్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు... అది మన వారసత్వ సంపద

స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన వారసత్వ సంపద

స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన వారసత్వ సంపద

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం

వారు నడయాడిన ప్రదేశాలను సందర్శిస్తే దేశభక్తి పెరుగుతుంది

త్యాగధనుల జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

భారతీయం కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు

కాకినాడ రూరల్:- దేశ స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన భారతీయుల వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ… “ఒక తండ్రి తన జీవితాంతం కష్టపడి ఇల్లు, పొలం, డబ్బు, బంగారం, ఆస్తులు సంపాదిస్తాడు. తాను వాటిని తనతో తీసుకెళ్లలేనని తెలిసినా, తన పిల్లలు వాటిని సద్వినియోగం చేసుకుని తనకంటే గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటాడు. అదే సమయంలో, ఆ సంపద వెనుక ఉన్న తన కష్టం, శ్రమ, విలువలు పిల్లలకు తెలియాలని కూడా కోరుకుంటాడు. లేదంటే తాము సంపాదించినదంతా కోల్పోయి, పిల్లలు తిరిగి మొదటి స్థితికి చేరుకుంటారని భయపడతాడు. మన దేశ స్వాతంత్ర్య సంగ్రామం కూడా అలాంటిదే. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను అందించారు. ఆ సంపదను అనుభవించడం మాత్రమే కాదు… దాని విలువను తెలుసుకుని, కాపాడుకోవడం మన బాధ్యత. మన వంశం గురించి మనం తెలుసుకున్నట్లే, మన దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల గురించి కూడా తెలుసుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ జీవించాలి. దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం కాదు. “నేను భారతీయుడిని” అని గర్వంగా చెప్పుకోగలిగే స్వేచ్ఛ వెనుక ఎందరో చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడం అని తెలిపారు.

స్వాతంత్ర్య సమయంలో పుట్టిన పదం భారతీయం

“భారతీయం అనే మాట ఇప్పుడు పుట్టింది కాదు. భారతదేశం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పుట్టిన మాట భారతీయం. సైమన్ కమిషన్ వచ్చినప్పుడు “భారతదేశం గురించి నిర్ణయాలు భారతీయులే తీసుకోవాలి” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. “సైమన్ గో బ్యాక్” అంటూ నల్లజెండాలతో ప్రజలు ఉద్యమించారు. ఎందరో జైళ్లకు వెళ్లారు. “భారతీయం లేని సైమన్ మాకు వద్దు” అని నిరసనలు తెలిపారు. అప్పుడు పుట్టిందే “భారతీయం”. భారతీయం గురించి ఎప్పుడూ చర్చిస్తూ ఉండాలి. అప్పుడే పిల్లలకు స్వాతంత్ర్యం గురించి తెలుసుకొని దేశభక్తి పొంది ఉంటారు. లేదంటే దేశభక్తి, నైతిక విలువలు నశించిపోతాయి” అని అన్నారు.

త్యాగాల స్ఫూర్తితో దేశభక్తి భావనను పెంపొందిద్దాం

“అండమాన్‌లోని కాలాపాని జైలు గురించి చదివితే స్వాతంత్ర్య సమర యోధులు అనుభవించిన కష్టాలు మనసును కదిలిస్తాయి. ఇరుకైన గదులు, ఒంటరితనం, శారీరక హింస… అయినా వారి సంకల్పం మాత్రం చెదరలేదు. గాంధీజీ, నెహ్రూ, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి అనేకమంది మహనీయుల జీవితాలను చదివితే స్వాతంత్ర్యం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు బ్రిటిష్ పోలీసుల తుపాకీకి ఎదురు నిలిచి చూపిన ధైర్యం కారణంగానే ఆయనకు “ఆంధ్రకేసరి” అనే బిరుదు వచ్చింది. రైతులకు నీరు అందించాలనే ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన ప్రకాశం బ్యారేజీ కూడా ఆయన పేరును గుర్తుచేస్తుంది. ఘంటసాల వెంకటేశ్వర రావు గారు కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి అంతిమయాత్రలో పాల్గొని దేశభక్తి గీతాలు పాడుతూ చివరి వరకు వెంట ఉన్నారు. కళను కూడా దేశసేవకు ఉపయోగించిన మహనీయుడు ఆయన. బంకించంద్ర ఛటర్జీ రచించిన “ఆనందమఠం” వంటి రచనలు దేశభక్తి, క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యత వంటి భావాలను ప్రజల్లో బలపరిచాయి. “వందేమాతరం” కూడా అదే భావజాలానికి ప్రతీకగా నిలిచింది. మనకు దేవాలయాలు ఎంత పవిత్రమో, స్వాతంత్ర్య సమరయోధులు జీవించిన జైళ్లు, స్మారకాలు, పోరాట ప్రదేశాలు కూడా అంతే ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలు. వాటిని సందర్శించినప్పుడు ఆసక్తి పెరుగుతుంది. వాటి గురించి తెలుసు కున్నప్పుడు చరిత్ర అర్థమవుతుంది. చరిత్ర అర్థమైనప్పుడు దేశభక్తి మరింత బలపడుతుంది. అందుకే పిల్లలకు పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను చదివించండి. అండమాన్‌ వంటి చారిత్రక ప్రదేశాలకు తీసుకెళ్లండి. మనకు లభించిన స్వేచ్ఛ వెనుక ఉన్న త్యాగాలను వారికి తెలియజేయండి. ఎందుకంటే వారి త్యాగాలను తెలుసుకోవడమే మన వారసత్వాన్ని తెలుసుకోవడం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్యం మనకు సాధారణంగా రాలేదు, ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చింది, ఆ త్యాగాలకు మనమే వారసులమని పిల్లలకు అర్థమవుతుంది. భారతదేశం మనది. ఈ దేశాన్ని గౌరవించడం, కాపాడడం మన బాధ్యత. దేశ సంగ్రామం గత చరిత్ర కాదు… అది మన వర్తమానానికి పునాది, మన భవిష్యత్తుకు వారసత్వ సంపద” అని పేర్కొన్నారు.

దేశభక్తి ఉన్న లోకేష్ విద్యా శాఖ మంత్రి అవ్వడం విద్యార్ధుల అదృష్టం

“పిల్లల్లో దేశభక్తి, నైతిక విలువలు, చరిత్ర పట్ల గౌరవం పెంపొందించాలనే ఉద్దేశంతో “భారతీయం” కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనను మంత్రి నారా లోకేష్ గారి ఇంటికి వెళ్ళి చెప్పగానే, ఆయన వెంటనే స్పందించి కార్యక్రమానికి వస్తానని చెప్పారు. ఆయనతో మాట్లాడి తిరిగి వెళుతుంటే నా కారు వద్దకు వచ్చి పెద్దాయన జాగ్రత్త అని నా కారు డ్రైవర్‌కు చెప్పి మరీ వెళ్ళారు. కార్యక్రమం మొదలు సమయాన్ని చెప్పిన దానికంటే ముందుగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం ఆయన దేశం, చరిత్ర పట్ల చూపిన ఆసక్తికి నిదర్శనం. ఇటువంటి దేశభక్తి ఉన్న లోకేష్ వంటి నాయకుడు రాష్ట్ర విద్యామంత్రి కావడం విద్యార్థుల అదృష్టం” అని మంత్రి లోకేష్‌ను అభినందించారు చాగంటి కోటేశ్వరరావు గారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article