*ఏడు సంవత్సరాలు దాటినా …
*ఎక్కడ న్యాయం జరగక పోయే…
*ప్రభుత్వాలు మారినా ఫలితం లేకపోయే…
*రాజకీయ పార్టీలకు ఓ వరంలా మార్చుకుంటున్నారే తప్ప…
*అసలు సిషలు దోషులు మాత్రం దొరకక పోయే…
*రాష్ట్ర పోలీస్ చేతగానిది అయ్యిందా…
*అలా చేతగాని వ్యవస్థలా ముద్ర వేశారా..వేస్తున్నారా…
*సీబీఐలో ఉండేది కూడా ఐపీఎస్ లేగా…
*దేశంలో ఎన్ని కేసులు సీబీఐ పరిష్కరించింది…
*సిబిఐ అన్న పేరుతో కాలాన్ని వెళ్లబుచ్చడమేనా…
*దేశ ద్రోహులను పట్టుకుంటున్నారు…
*దేశ దిమ్మరులను పట్టులోలేరా…
*లిక్కర్ స్కామ్, ఐటి స్కామ్ లంటూ జైళ్ల పాలు చేస్తున్నారు…
*పాసిపాప ప్రాణం ఎలా పోయిందో పరిగట్టలేరా…
*నాలుగు గోడల మధ్య జరిగినదే తెలియపరచలేరా..
*అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుంటే…
*ఒక విద్యాలయం లో జరిగిన నేరం గుర్తించలేరా…
*పవనన్న పరామర్శ పనికిరానిది అయ్యిందా…
*ప్రభుత్వం లో ఆయనే కీలకం అయితే…
*ఈ కేసు పరిస్కారం ఇంకా కాలేదంటే…
*న్యాయం అంగడిలో సరుకయిందా లేక …
*అంగడిలో సరుకే న్యాయం అయిందా…
*ఓ న్యాయమా ఏమిటే ఈ అన్యాయం…
(రామమోహన్ రెడ్డి)

సుగాలి ప్రీతి పదవతరగతి చదువుతున్న ఒక పసిప్రాణం.తల్లి సుగాలి పార్వతి అంగవైకల్యం లెక్కచేయకుండా తన కూతురిని ఉన్నత చదువులు చదివించుకోవలనే ఆశ తో ఉన్నత విద్యాప్రమాణాలతో ఈ సమాజానికి ఆదర్శ పురుషుడిగా పేరు గాంచిన కట్టమంచి రామలింగారెడ్డి పేరుతో విద్యను అందిస్తున్న కర్నూలు శివారు ప్రాంతం లో ఉండే కట్టమంచి రామలింగారెడ్డి విద్యాసంస్థలో చేర్పించితే సరస్వతి కటాక్షం లభిస్తే గొప్ప ప్రయోజకురాలు అవుతుందన్న ఆశతో ఉన్న ఆ తల్లికి తన కుమార్తె హాస్టల్ గదిలో ఉన్న ఫ్యాన్ కు నిర్జీవంగా వ్రేలాడుతూ కనిపించింది. ఆ హృదయ విధారకరమైన ఘటన చూసిన ఆ తల్లి హృదయం అల్లాడి పోయింది. అది ఆత్మ హత్య కాదు తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారని తల్లడిల్లి న్యాయం కోసం గుండెలు బడ్డలయ్యేలా నలు దిక్కులు పిక్కటిల్లేలా అరచింది.అయినా న్యాయం అన్నది అంగడిలో సరుకు అన్న విషయం ఆలస్యం గా తెలుసుకుంది.అయినా ఆమె పోరాటం ఆపలేదు.ఇదంతా సరిగ్గా 2017 ఆగస్టు 19వతేదీన జరిగింది.అయితే మృతురాలి తల్లి పోరాటంతో పాఠశాల యాజమాని అతని కుమారులను అరెస్ట్ చేశారు కొన్ని రోజుల తరవాత బెయిల్ పై విడుదల చేసారు. కానీ మృతురాలి తల్లి నిజ నిర్దారణ కోసం సీబీఐ విచారణ కోరినప్పటి టిడిపి ప్రభుత్వం కేసు విచారణ దశలో ఉండడం ఆ తరువాత 2019 వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో కేసు స్థితిగతులు మారిపోయింది.2019లో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఆ తర్వాత 8 నెలలు గడిచినా సీబీఐ దర్యాప్తు ప్రారంభించకపోవడంతో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సమాధానం చెప్పాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.’సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తమ దగ్గర తగినన్ని వనరులు లేవు’ అంటూ ఈ కోర్టుకు తెలిపింది సీబీఐ.సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసిన సున్నితమైన కేసుల్లో తాము ఇప్పటికే తలమునకలై ఉన్నామనీ, సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయడానికి తగినన్ని వనరులు తమ దగ్గర లేకుండా పోయాయని, ఈ కేసు దర్యాప్తు చేయడం తమకు సాధ్యం కాదని కోర్టుకు సీబీఐ తెలిపింది.అయితే నాటి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కేసును ప్రధానంగా చేసుకుని 2020లో కర్నూలులో ర్యాలీ చేశారు. “మా ప్రభుత్వం వస్తే మొదటి కేసు ఇదే” అని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల సమయంలో కూడా గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరిలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రీతి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. సీబీఐకి అప్పగించేందుకు GO 37 జారీ చేశారు. అదే విదంగా సుగాలి ప్రీతి కుటుంబానికి నష్టపరిహారంగా ఐదు ఎకరాలవ్యవసాయ పొలము,ఐదు సెంట్ల ఇంటి స్థలము మృతురాలి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. కానీ సీబీఐ “GO చెల్లదు, లెటర్ రాలేదు” అని అంటూనే 2025 ఫిబ్రవరిలో “వనరులు లేవు, కేసు తీసుకోలేకపోతున్నాము” అని సీబీఐ హైకోర్టు కు తెలిపింది.దీంతో సుగాలి ప్రీతి కేసు ఎనిమిది సంవత్సరాల తరువాత మళ్ళీ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే కేవలము కొంతమంది హత్యలు,కొన్ని ముఖ్యమైన కేసులు మాత్రమే అపరిష్కృతంగా మిగిలిపోతూ ఉన్నాయి.”ignorance of law is no excuse”చట్టం తెలియకపోవడం ఒక సాకు కాదన్న తీరున ఈ సమాజం లో జరుగుతున్న అత్యంత దారుణమైన సంఘటనలకు సంబంధించి నమోదు కాబడిన కాబడుతున్న కేసుల్లో దర్యాప్తులో పురోగతి కేవలం మీడియా ప్రసారాల కు వ్యక్తిగత దూషణలు రాజకీయ పరమైన ప్రయోజనాల కోసమే అన్న రీతిన మారిపోతుండడం నిజంగా అత్యంత దయనీయమనే చెప్పాలి.ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ, అధికార వ్యవస్థ లతో విసిగి వేసరిపోయిన ప్రజలు ఒకనాటి ఆంగ్లేయులు పాలనను గుర్తుకు తెచ్చుకుంటారని ఆనాడే చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన విదంగా నేటి మన పాలకులు తీరు ఉందని నిస్సంకోచంగా చెప్పచ్చుమ్.అది ఏ ప్రభుత్వం అయిన సరే.కారణం ఈ దేశం మొత్తం అట్టడగుకి పోయిన నిర్భయ కేసు కావచ్చు..సినీ నటీ ప్రత్యూష కేసు లో న్యాయం ఆలస్యంగా జరిగితే మిగిలిన వేలాది కేసులు ఇప్పటికి పెండింగులో ఉన్నాయి. రాజకీయ పరమైన కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, చంద్రబాబు ప్రతిపక్ష నేత గా ఉన్నప్పుడు ఆయన మీద బనాయించిన కేసులు ప్రస్తుతం లిక్కర్ కేసు,ఈడీ విచారణ ఇలా ఇవన్నీ కూడా ఆఘమేఘాల మీద నమోదు కావడం అరెస్ట్ చేయడం బెయిల్ పై రావడం ఇలా కళ్లు మూసి తెరిచే లోవు జరిగి పోతున్నాయి. కానీ మాజీమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య కేసు సుగాలి ప్రీతి ,అయేషా మీరా ఇలా కొన్ని కేసులు కంటి తుడుపు చర్యగా సంవత్సరాల గడుస్తున్నా కూడా న్యాయం అన్న దానికోసం వేచిచూడక తప్పడం లేదు.మరి ఇదే రాష్ట్రం ఇదే ఐపీఎస్, ఇదే రాష్ట్ర, జిల్లా ,డివిజన్, సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసులు అంత నిక్కచ్చిగా అంతెందుకు సామజిక మద్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసాడని పోసాని కృష్ణ మురళి, ప్రస్తుత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ల కోసం వందలాది మంది పోలీసులు నిద్రాహారాలు మానేసి బాధితులను ఎక్కని కోర్టు ,తొక్కని పోలీస్ స్టేషన్ లేకుండా చేసిన అంత సమర్ధత ఉన్న పోలీసులకు ఒక విద్యార్థి మరణం సహజం కాదని ఆ తల్లి అంగవైకల్యం కూడా లెక్క చేయక అన్ని ఆధారాలు ఉన్నాయని అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల చుట్టు తిరుగుతూ ఉందంటే చట్టం ధర్మం,న్యాయం అనేవి చెప్పుకోవడానికి వినడానికి, గోడల మీద రాసుకోవడానికా అన్న మీమాంసకు ప్రజలు రాక తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదే నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఎందరో ఐపీఎస్,ఐఏఎస్ లు జైలు పాలు అయ్యారు,సస్పెన్షన్ గురయ్యారు.కానీ అజ్ఞానం నుండి ఙ్ఞానం వైపు నడిపించే గురువుల సంరక్షణ లో ఉంటూ దేవాలయం లాంటి విద్యాలయం లో ఒక ముక్కుపచ్చలారని చిన్నారి అసువులు బాసితే అందులో అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విచారణ పేరుతో జరుగుతున్న కాలయాపన పై రాజకీయ పార్టీల నేతలను ఆశ్రయిస్తుంటే ఒక పార్టీ వారు ఇంకోక పార్టీ పై విమర్శలు ప్రతి విమర్శలతోనే కాలం సరిపోవడం తప్ప ఇంకొకటి లేదన్న వాదం వినిపిస్తోంది.నాడు టిడిపి ఆ తరువాత వైసీపీ నేడు కూటమి ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇలాంటివి తమ ప్రచార ఆర్భాటాలకు బాగా సరిపోతున్నాయే తప్ప బాధిత కుటుంబాలకు భరోసా ఎక్కడ లభిస్తుందన్న భావన ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుగాలి ప్రీతి కేసు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచిచూడక తప్పదు.

