పారిన నోట్ల ప్రవాహం..
ఓటుకు రెండు వేలు?
ప్రజాభూమి, కృష్ణా బ్యూరో:
నవంబర్ ఒకటవ తేదీ ఆదివారం మచిలీపట్నం నగర పాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. గత పది రోజుల నుంచి నగరంలో వినిపించిన మైకుల హోరు సద్దుమణిగింది. ప్రశాంతం.. ప్రశాంతం.. శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగియడంతో అదిగో అప్ప్పుడు మొదలయింది నగరంలో డబ్బులు పంపకాలు.. ఆయా పార్టీలకు నమ్మకమైన పలువురు వ్యక్తులు నగరంలో వున్న 60 డివిజన్లలోని ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్ల లిస్టులతోపాటు ఒక్కో ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసుకున్నారు. మేయర్ అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు, కార్పొరేటర్ గా పోటీ చేసే అభ్యర్థి ఓటుకు ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తం ఒక్కో పార్టీ తరఫున పదిహేను వందల రూపాయలు ఇచ్చేలా ప్లాన్ చేశారని తెలిసింది. అయితే ఒక్కో డివిజన్లో రెండువేలకు పైగా ఓటర్లు వుంటే దాదాపు పదిహేను వందల మందిలో ఒక్కో ఓటరుకు మేయర్ అభ్యర్థి ఇచ్చిన వెయ్యి రూపాయలు పంచినట్లు గుసగుసలు. బలమైన కూటమికి చెందిన వారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా డబ్బులు భారీగా పంచినట్లు తెలిసింది. రెండు పార్టీలకు చెందిన వారు ప్రతి ఓటరు వున్న ఒక్కో ఇంటికి డబ్బు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
శనివారం మధ్యాహ్నం నుంచి పోటీలో వున్న అభ్యర్థుల అనుచరులు పంధాను మార్చినట్లు తెలిసింది. మేయర్ అభ్యర్థి ఇచ్చిన వెయ్యి రూపాయలు, కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఐదువందలు, లేదా వెయ్యి రూపాయలు చొప్ప్పున ఒక్కో ఓటరుకు పదిహేను వందలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది.
నగరంలోని పలు డివిజన్లలో విజయం సాధించవలసిన ముఖ్యమైన అభ్యర్థులు ఇటు కూటమిలోనూ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ వున్నందున, అటువంటి డివిజన్లో రెండువేల రూపాయలు కూడా పంచినట్లు తెలిసింది.
రెండు పార్టీల దగ్గర నుంచి డబ్బు తీసుకున్న వారు తమ ఓట్లును ఎవరికి వేస్తారోనన్నది దేవరహస్యం! ఓట్ల కోసం డబ్బు పంపకాలు శనివారం అర్థరాత్రి వరకూ జరుగుతుందని తెలుస్తున్నది.
ఓట్ల కొనుగోలును ఎవరూ ఆపలేకపోయారు. అందుకు తగిన యంత్రాంగం లేకపోవడంవల్ల పోటీ చేసిన వారు ఎటువంటి భయం లేకుండా ఓట్లకు నోట్లు పంచారు! జయహో ప్రజాస్వామ్యం!

