తాజా వార్తలుస్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదు

స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదు

సూపర్ సిక్స్‌, సూపర్ సెవెన్‌ హామీలు అట్టర్‌ ఫ్లాప్‌

యలహంక ఆస్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు

మచిలీపట్నం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమీ లేదని, ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారానికి దిగుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలకు పాల్పడుతూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వివాదాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. శనివారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్‌ ఏజెంట్లు పోలీసుల నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాలనే నిబంధన ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే యలహంక ఆస్తుల వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

యలహంక ఆస్తి జగన్‌ అత్తగారిదే

యలహంకలోని ఆస్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్తగారు డాక్టర్‌ సుగుణమ్మకు చెందినదని పేర్ని నాని స్పష్టం చేశారు. భారతిగారి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణమ్మ ఇద్దరూ వైద్యులని, కడప, అనంతపురం జిల్లాల్లో వైద్యులుగా మంచి పేరు సంపాదించడంతో పాటు ఆర్థికంగా స్థిరపడ్డారని తెలిపారు. తమ పిల్లలను బెంగళూరులో చదివించిన నేపథ్యంలో అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని వివరించారు. ఇందుకు సంబంధించిన పత్రాల్లో పూర్తి వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.సుమారు 20 ఏళ్ల క్రితమే జగన్‌కు చెందిన కంపెనీ యలహంకలోని స్థలాన్ని లీజుకు తీసుకుని రెండు గెస్ట్‌హౌస్‌లు నిర్మించిందని తెలిపారు. బెంగళూరుకు వెళ్లినప్పుడు షర్మిల ఒక గెస్ట్‌హౌస్‌లో ఉండాలని సూచించారని, అక్కడి నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు, ఇతర ఖర్చులను ఇప్పటికీ జగన్‌ కంపెనీనే భరిస్తోందని చెప్పారు. అలాంటప్పుడు ఆ ఆస్తి తనదేనని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్‌ షర్మిలకు రాశారని చెబుతున్న ఎంవోయూలో కూడా యలహంక ఆస్తి ప్రస్తావన లేదన్నారు.

చెల్లెలికి రూ.230 కోట్లు ఇచ్చిన జగన్‌

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా జగన్‌ తన చెల్లెలు షర్మిలకు సుమారు రూ.230 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చారని పేర్ని నాని పేర్కొన్నారు. వివాహమై పాతికేళ్లు గడిచిన తర్వాత కూడా చెల్లెలికి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఇచ్చే అన్న ఎక్కడైనా ఉంటాడా? అని ప్రశ్నించారు.భద్రతా కారణాల దృష్ట్యా యలహంకలో పెళ్లి వేడుక నిర్వహించవద్దని ముందుగానే చెప్పినట్లు తెలిపారు. తన కుమార్తెల వివాహాల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంటానని జగన్‌ స్పష్టం చేశారని అన్నారు. అయినప్పటికీ యలహంకలోనే పెళ్లి అంటూ షర్మిల వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసాన్ని ఉపయోగించుకోవాలని జగన్‌ లేఖ రాసినా షర్మిల ఎందుకు వినియోగించుకోలేదని నిలదీశారు.

చంద్రబాబు తన కుటుంబానికి ఏం చేశారు?

చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు చేసిన మేలు గురించి ముందుగా ఆలోచించుకోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించారు. తన తల్లిదండ్రులను ఆదుకున్నారా? తన ఇద్దరు చెల్లెళ్లకు ఆస్తుల్లో వాటా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తనకు లక్ష కోట్ల ఆస్తి ఉందని చంద్రబాబు చెప్పుకున్నారని, మరి తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సుమారు ఏడు ఎకరాల భూమిని చంద్రబాబు తల్లి ఆస్తి లోకేష్‌కు మాత్రమే బహుమతిగా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కూడా ఉండగా అందరికీ సమానంగా ఎందుకు పంచలేదు అని గుర్తుచేశారు.

సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు విఫలం

చంద్రబాబు పాలన పూర్తిగా విఫలమైందని పేర్ని నాని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు అమలులో విఫలమయ్యాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ వర్గం కూడా ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేదని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలను గమనించి, విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article