వీరేనా ప్రజలను రక్షించేది…
*ఖద్దర్ చొక్కాలకు గులాం గిరి చేయటానికా..
*ఖాకీలంటే క్యాండ్రించి అమ్మేస్తున్నారే…
*ఐపీఎస్ చదువులు అక్షరాలు రాని వాడిని అనగద్రోక్కడానికా
*వీరయితే విధులకు ఆటంకం కలిగించారని కేసులు పెట్టచ్చు…
*సామాన్యుడు ప్రాణం అంటే అంత చులకన గా ఉంటుందా…
*అదే మీకు నొప్పి కలిగితే నోరు పారేసుకొంటారే..
*వాడి ప్రాణం మీ ప్రాణం లాంటిది కాదా…
*ఒక సి ఐ కి అన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి..
*ఎవడబ్బ సొమ్మని దోచుకున్నారు…
*మీ విచారణ లోనే ఇంత అన్యాయం ఉందని తేలిందే..
*అసలు విచారణ జరిపితే ఇంకెన్ని దారుణాలు బైటికి వస్తాయోగా…
*ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందా…
*ఒక్క కాట్రాజు లాంటి నాగరాజు నే కారణమా..
*కాట్రాజు లాంటి నాగరాజు కు అండగా నిలిచిన అధికారులు లేరా…
*ఉన్నా వారేనేమి చేయలేరని ధీమానా…పొగరునా…
*పోలీసోడి పొగరుకు ఇంకెన్ని బ్రతుకులను బలిచేస్తారో…
*కూటమి ప్రభుత్వంకు ఇది కటిన పరీక్షేణా…
*ప్రతిపక్ష పార్టీ పంతం నెగ్గినట్లేనా…
*హైకోర్టు తీర్పును బట్టే తదుపరి చర్యలన్న సుప్రీం కోర్టు..
“అక్టోబర్ 26కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు…
(రామమోహన్ రెడ్డి)
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా, సంచలనం రేపిన విజయవాడ కృష్ణ లంక పోలీసుల చేతిలో అతి దారుణంగా చచ్చి పోయిన గాదె సాయి కృష్ణ ఉదంతం చూస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానీకం తో పాటు సభ్య సమాజం నివ్వెర పోతుంది. అసలు పోలీసులంటే ఎవరు ,వారు విధులు ఏమిటి,వారి పరిధి ఏమిటీ ,ప్రజలకు వారు చేయాల్సిన పనులు ఏమిటీ అనేవి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఒక సంఘటన ఎన్నో రకాల అనుమానాలకు దారితీస్తున్నాయి. అధికారం శాశ్వితం అని భావించే ఇలాంటి నీచ నికృష్టమైన కాట్రాజు లాంటి నాగరాజు లు పోలీస్ శాఖ లో ఉన్నప్పుడు అండ దండ ఇచ్చిన వారు ఎంతటి వారైనా సరే నిష్పాక్షికంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోక పోతే ఈ సమాజం తీవ్ర మైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే భావన సామాన్యుడి కి తట్టిందంటే ఇక ఈ సమాజం ఎంతో నష్ట పోవాల్సి వస్తుందని అనడం లో పెద్దగా ఆచ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్పచ్చు.
ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు అయ్యే రాజకీయ పార్టీలు, తద్వారా తీసుకునే నిర్ణయాలు, అధికారుల తీరు, పార్లమెంటరీ విధానాలతో విసిగి వేసారి పోయిన ప్రజలు ఒక నాటి ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చుకుంటారని దేశానికి స్వతంత్రం రాక మునుపే చెప్పిన భారతదేశ మొదటి చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి చెప్పిన విధంగా ఈనాటి పరిస్థితులు చూస్తుంటే ఒక నాటి ఆంగ్లేయుల ఈ దేశం మీద పగతో ధన, మాన ప్రాణాలను దోచుకుని తిన్నారంటే అర్ధం ఉంది.కానీ ఇదే ప్రజలు తమ రక్తాన్ని చెమటగా చిందించి పన్నుల రూపంలో చెల్లించిన రూపాయలతో లక్షల రూపాయలు ప్రజాధనాన్ని జీతాల రూపంలో తీసుకుంటూ ఏసీ గదులలో ఉంటూ కూడా ఎవడబ్బ సొమ్మని ప్రజల రక్త మాంసాలను మళ్ళీ దోచుకుని దాచుకుని తినడానికి వెనుకాడని కాట్రాజు లాంటి నాగరాజు కు అంత అవకాశం ఎలా ఇచ్చారనేది ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్న ప్రశ్న.మరి ఈ ప్రశ్న కు సమాధానం చెప్పే దమ్ము ధైర్యము ఉందా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవ్వక తప్పదేమో అని అనిపిస్తుంది.ఓసారి ఈ కేసులో మలుపు తిరుగుతున్న అంశాలను పరిశీలిస్తే ఈ ఖాకీల ముసుగులో కాసుల కోసం శవాలను పీక్కుతినే వారి విధానం ఏమిటో అర్ధం అవుతుంది.
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ సమర్పించిన నివేదికలు మరియు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ద్వారా అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక విచారణ జరిపింది.ఈ కేసుపై ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టులోని అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది.పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి ఆచూకీ లేకుండా మాయమవడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టే నేరుగా పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను సెప్టెంబర్ 30, 2026 లోపు సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 12, 2026 కి వాయిదా వేసింది.ఐజీ ఎం. రవిప్రకాష్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన చార్జిషీట్ మరియు రిమాండ్ నివేదిక ప్రకారం పోలీసుల క్రూరత్వం బయటపడింది.25 ఏళ్ల ఫుడ్ డెలివరీ బాయ్ గాదె సాయికృష్ణను మే నెలలో కృష్ణలంక పోలీసులు అక్రమంగా స్టేషన్‌కు తరలించి, థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బల తాలూకు గాయాల వల్లే సాయికృష్ణ మరణించాడని సిట్ నిర్ధారించింది.సాయికృష్ణ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు గ్రహించిన నాటి కృష్ణలంక సీఐ ఎస్.ఎస్.వి.వి. నాగరాజు, తన సిబ్బందితో కలిసి మృతదేహాన్ని ఒక పాడుబడిన భవనంలోకి మార్చారు. ఆ తర్వాత నేరం బయటపడకుండా ఉండేందుకు ఒక శ్మశానవాటికలో రహస్యంగా శవాన్ని దహనం చేయించి ఆధారాలు లేకుండా చేశారు.సాయికృష్ణను స్టేషన్‌లో నిర్బంధించినట్లు సాక్ష్యాలు దొరకకుండా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని మరియు హార్డ్‌డిస్క్‌లను నిందితులైన పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, మరియు పరారీలో ఉండి ఇటీవల దొరికిన నాలుగో నిందితుడు గులివిందల సురేష్‌తో సహా మొత్తం ఆరుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది. అయితే, నిందితులు పోలీసు శాఖకు చెందినవారే కావడంతో, స్థానిక పోలీసుల దర్యాప్తు సక్రమంగా సాగకపోవచ్చని, ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని బాధితుడి తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసు మలుపు తిరిగింది.
..అసలు పోలీసులంటే సమాజంలో అల్లర్లు జరగకుండా, ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూడటం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడం మరియు నేరస్తులను పట్టుకోవడం. నేరాలు జరిగినప్పుడు వాటిపై విచారణ జరిపి సాక్ష్యాలు సేకరించడం. ఆపదలో ఉన్న ప్రజలకు మరియు వారి ఆస్తులకు రక్షణ కల్పించడం.కానీ ఇక్కడ జరిగింది ఏమిటీ సహజ సిద్ధమైన విధానాలకు విరుద్ధంగా క్రూర మృగాలకంటే హీనంగా కండ కావరం పట్టి సమాజాన్ని దోచుకుని తినడానికి వెనుకాడని కాట్రాజు లాంటి నాగరాజు అతి భయంకరంగా దారుణాతి దారుణంగా ఒక ముద్దాయిని హింసించి చచ్చేలా కొట్టి మళ్ళీ వైద్యం కోసం చూసి ఈ నర రూప రాక్షసుల దెబ్బలకు చావు తప్పక పోతే ఆ శవాన్ని దుప్పటిలో చుట్టుకుని శ్మశాన వాటికలో అర్ధరాత్రి పూట పూర్తిగా కాలిపోయేంత వరకు కాపలా ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గులు ఇంకొకరు ఉన్నారా అన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి తలెత్తున్నాయి .దీనికి తోడు ఈ దుర్మార్గపు పనులకు కూడా సానుభూతి పరులు ముసుగులో నాగరాజు కు అండగా శాంతి ర్యాలీలు, నిరసనలు,పెద్ద ఎత్తున సంఘీభావాలు.అది కూడా రేషన్ బియ్యం కొట్టేసే సింగ్ నగర చిన్నోడు ఆధ్వర్యంలో మందు విందు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయడం.అంటే ఈ సమాజం లో డబ్బు ఉంటే ఏమి చేసినా చెల్లుబడి అవుతుందనేది నిరూపితం అయినట్లే.
ఇక పోతే (IPS)ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇది భారతదేశంలోని అత్యున్నతమైన, గౌరవప్రదమైన అఖిల భారత సేవలలో ఒకటి.ఐపీఎస్ లది సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత కీలకం. అయితే, ఇటీవల కాలంలో కొన్ని చోట్ల పోలీసు వ్యవస్థలోని ఉన్నతాధికారుల తీరు, రాజకీయ జోక్యం, మరియు వివాదాస్పద నిర్ణయాల వల్ల ఐపీఎస్ అధికారుల ప్రతిష్ఠ మరియు విధులు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అది ఏ పార్టీ అయినా సరే వారి ప్రయోజనాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తరచూ వస్తున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కంటే, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల నిష్పాక్షికంగా పనిచేయాల్సిన ఐపీఎస్ విధులు అభాసు పాలవుతున్నాయి.
ఇటీవలి కాలంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు తీవ్రమైన ఆరోపణలు, కోర్టు ధిక్కరణ కేసులు లేదా వివాదాస్పద కేసులలో చిక్కుకోవడం పోలీసు ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. ఉదాహరణకు, ముంబై ప్రముఖ నటి కాదంబరి. జైత్వానికేసు విషయంలో విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, మరియు పి. సీతారామాంజనేయులు వంటి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం వారి సస్పెన్షన్‌ను ఉపసంహరించి, లూప్ లైన్ పోస్టింగులు ఇచ్చినప్పటికీ, వారిపై విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఉన్నతాధికారుల నైతిక విలువలను ప్రశ్నించేలా చేస్తున్నాయి.
చట్టాన్ని రక్షించాల్సిన అధికారులే చట్ట పరిధులను దాటి ప్రవర్తించడం, ముందస్తు బెయిల్ పొందిన వారిపై కూడా రౌడీ షీట్లు తెరవడం లేదా అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి చర్యలు కోర్టుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. కోర్టులు పోలీసు అధికారుల తీరును తప్పుబడుతూ మొట్టికాయలు వేయడం ఐపీఎస్ విధులను సమాజంలో చులకన చేస్తోంది.
ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో రాజకీయ అనుకూలత కలిగిన అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు నిజాయితీ గల అధికారులను పక్కన పెట్టడం వల్ల క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం ఉందని తద్వారా బాధితులకు న్యాయం జరగదనే భావన ప్రజల్లో పెరగడం వల్ల అభాసు పాలయ్యేది కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, మొత్తం పోలీసు వ్యవస్థే అన్నది కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పరిగణలోకి తీసుకోలేక పోతున్నారనే విమర్శలు లేకపోలేదు.
.ఐపీఎస్ అధికారులు ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, కేవలం రాజ్యాంగానికి మరియు చట్టానికి మాత్రమే లోబడి పనిచేసి తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా సరే, చట్టపరమైన విచారణలు వేగంగా జరిపి కఠిన చర్యలు తీసుకోగలిగితే నాలుగో సింహం నవ్వుల పాలవ్వకుండా ఉంటుందనేది మేధావి వర్గాలు చెబుతున్నాయి.
కాగా గురువారం మరో సారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇప్పటివరకు జరిగిన విచారణ, సేకరించిన ఆధారాలు, సిట్ (SIT) నివేదికలతో కూడిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 30, 2026 లోపు సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తు ఉన్నతాధికారుల పాత్రపై లోతైన దర్యాప్తు జరగాలన్న పిటిషనర్ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తిఅభ్యర్థన మేరకు, ఈ కేసు వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ని కూడా ఒక ప్రతివాదిగా సుప్రీంకోర్టు చేర్చింది. ఒకవేళ రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేదని భావిస్తే, కేసును పూర్తిగా సీబీఐకి అప్పగించే అవకాశం ఉంది.అందులో బాగంగా సెప్టెంబర్ 30 లోపు సమర్పించే సీల్డ్ కవర్ నివేదికను పరిశీలించడానికి మరియు తదుపరి సమగ్ర విచారణ కోసం ఈ కేసును అక్టోబర్ 26, 2026 కి వాయిదా వేసింది.
చూడాలి మరి గాదె సాయి కృష్ణ ఉదంతం సుప్రీం కోర్టు జోక్యం తో ఎటు వైపు అడుగులు వేస్తుందనేది.


