తాజా వార్తలుబాబు గారు మీరు సూపర్....

బాబు గారు మీరు సూపర్….

*మీ ఆలోచనలు అమోఘం…
మీ వినూత్న ఆలోచనల్ని మేము ఆలోచన చేస్తాం
జాతీయ స్థాయిలో సంజీవని అమలును పరిశీలిస్తాం

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం

సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతాం

సీఎం చంద్రబాబు సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా

సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి

ప్రజాభూమి ప్రతినిధి,విజయవాడ: అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సానుకూలంగా స్పందించారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం నుంచి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం నుంచి సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపనున్నట్లు తెలిపారు. క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన బాగుందని, ఆయన చేసిన వివిధ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. శనివారం విజయవాడలో వైద్యారోగ్య శాఖకు చెందిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్న కేంద్రమంత్రి నడ్డా ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంజీవని కార్యక్రమంపైనా నడ్డా ప్రశంసలు కురిపించారు. సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని పేర్కొంటూ, దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులను గుర్తించడం, నివారణ, మెరుగైన చికిత్సతో పాటు అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు విజన్‌పై నడ్డా ప్రశంసలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సురక్షితమైన చేతుల్లో ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. చంద్రబాబు విజన్‌, నిబద్ధత కలిగిన నాయకుడని ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్రను మరువలేమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. వైద్యారోగ్య రంగానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నడ్డా తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వంటిల్లే ఫార్మసీ–ఆహారమే ఔషధం అనే విషయాన్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తన ప్రసంగంలో వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇదే మూల సూత్రమని పేర్కొన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానం ద్వారా వ్యాధులను నివారించుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు చిత్తశుద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపుతున్న చిత్తశుద్ధిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాగునీరు కీలకమని, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా చేపడుతున్న ప్రాజెక్టులు రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article