టాప్ న్యూస్సామాన్యుడికే అన్ని చట్టాలు పనిచేస్తాయా..!

సామాన్యుడికే అన్ని చట్టాలు పనిచేస్తాయా..!

*ఐఏఎస్ అయితే ఆ చట్టాలు వర్తించవా…
*సామాన్యుడు పబ్ కు వెళ్తే సంకెళ్ళు వేయొచ్చు..
*ఐఏఎస్ అధికారులు వెళ్తే అసంకెళ్ళు చతికిలబడి పోతాయా…
*బీఎన్ఎస్ చట్టం రాష్ట్రానికి సంబంధించిన అంశమా… దేశానికి సంబంధించిన అంశమా…
*ఖాకీలంటే అందరూ ఒకటే కదా….
*బెంగుళూరు,మంగుళూరు,అమరావతి, హైదరాబాద్ లో వేరు వేరు కాదుగా…
*పేదోడు ప్రశ్నిస్తే కేసులు పెట్టి,రిమాండ్ కు పంపుతారే..
*పెద్దోడు ఏమి చేసినా పర్వలేదన్న మాట…
*అందుకే అందరూ ఐఎఎస్ చదివితే సరిపోతుందేమో..
*పరాయి రాష్ట్రం లో ఏమి చేసినా పర్వలేదన్న మాట…
*స్వరాష్ట్రం లో సచివాలయం లో ఉండచ్చన్నమాట…
*ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం…
*ఇలాంటి వారితోనే కదా పేద ప్రజలకు మంచి జరిగేది…
*అహో ప్రజాస్వామ్యమా నీకు జోహార్…
(రామమోహన్ రెడ్డి)


ప్రజాస్వామ్యం అంటే ప్రజలే సర్వాధికారులుగా ఉండే ప్రభుత్వ విధానం.అబ్రహం లింకన్ నిర్వచనం ప్రకారం: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం”.చట్టం ముందు అందరూ సమానులే అన్నది భారత దేశ ప్రజాస్వామ్యం.భారతదేశం జనాభా పరంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. దేశ పరిపాలన అంతా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగం ప్రకారం జరుగుతుందని నేడు అందరూ చెబుతున్న మాట.
పేద అంటే ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి తగినంత సంపద లేదా డబ్బు లేని స్థితి, ధనిక అంటే అవసరానికి మించి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి సరిపడా ఆధిక ధనం లేదా ఆస్తులు ఉన్న స్థితి. ఈ రెండు పదాలు సమాజంలో ఒకరి ఆర్థిక పరిస్థితిని మరియు జీవన ప్రమాణాలను సూచిస్తాయి.కేవలం ప్రస్తుత అవసరాల గురించే ఆలోచించడం, సంపాదన మొత్తాన్ని ఖర్చులకు లేదా అప్పులు తీర్చడానికే ఉపయోగించడం మాత్రమే తెలిసిన వారు పేదవాడు.డబ్బుతో మరింత డబ్బును ఎలా సంపాదించాలో ఆలోచించడం, కొత్త ఆస్తులను సృష్టించడం మరియు పెట్టుబడులు పెట్టడం పెద్దోడి ఆలోచనా ,జీవన శైలి.కేవలం డబ్బు లేనంత మాత్రాన మనిషి పేదవాడు కాడు. మంచి గుణాలు, సాయం చేసే గుణం ఉన్నవారు ఆర్థికంగా పేదవారైనా మానసికంగా ధనవంతులేనని ఎంత డబ్బు ఉన్నా ఎదుటివారిని గౌరవించని వాడు, తృప్తి లేని వాడు ఎంత సంపద ఉన్నా పేదవాడితో సమానమేనని పురాణాల కాలం నుండి ఉత్తుత్తి పురాణాలు వింటూనే ఉండడం సహజంగా చూస్తునే ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో.భారతీయ న్యాయ సంహిత 2023 అనేది భారతదేశంలో క్రిమినల్ నేరాలను, వాటికి విధించే శిక్షలను నిర్ణయించే అధికారిక శిక్షాస్మృతి.పబ్ అనేది ‘పబ్లిక్ హౌస్’ దీని అర్థం ప్రజలందరూ వచ్చి కూర్చోవడానికి, సమయం గడపడానికి అనుమతి ఉన్న ఒక బహిరంగ ప్రదేశం.ఇక్కడ వివిధ రకాల మద్యం (ముఖ్యంగా బీర్, వైన్ వంటివి), ఇతర పానీయాలతో పాటు లఘు ఆహారం (స్నాక్స్) లేదా భోజనం లభిస్తాయి.ఈ పబ్ సంస్కృతి ముఖ్యంగా బ్రిటన్, ఐర్లాండ్ వంటి దేశాల సంప్రదాయం నుండి పుట్టింది. ప్రస్తుతం భారతదేశంలోని మెట్రో నగరాల్లో కూడా యువతకు ఇది ఒక ప్రముఖ వినోద కేంద్రంగా మారింది.ఇక పబ్‌లలో గబ్బు చేయడం (అల్లరి, గొడవలు లేదా అసభ్యంగా ప్రవర్తించడం) చట్టబద్ధంగా మరియు సామాజికంగా అస్సలు మంచిది కాదు. పబ్‌లు అనేవి ప్రజలు ప్రశాంతంగా సమయం గడపడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్రదేశాలు.పబ్‌కు వెళ్లినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం చాలా ముఖ్యం.పబ్‌లలో పోలీసు అధికారుల తనిఖీలనేవి ప్రధానంగా శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ మరియు నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లోని పలు పబ్‌లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

పబ్‌లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు వినియోగదారులు తమ గుర్తింపు కార్డును చూపించాలి. పబ్‌లలో మైనర్లకు మద్యం సరఫరా కాకుండా నిరోధించడానికి మరియు వయోపరిమితిని నిర్ధారించడానికి పోలీసులకు ఈ తనిఖీలు చేసే చట్టపరమైన అధికారం ఉంది.ఐఏఎస్ అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రధానమైన సివిల్ సర్వీస్.ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం, జిల్లా స్థాయిలో కలెక్టర్‌గా లేదా ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో ఉంటూ పాలనను పర్యవేక్షించడం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నడపడం వీరి ప్రధాన వృత్తి ధర్మం.ఐఏఎస్ అధికారులు సాధారణ పౌరులలాగే పబ్‌లకు వెళ్లవచ్చు, కానీ వారు అక్కడ ప్రవర్తించే విధానంపై కఠినమైన నియమాలు ఉంటాయి. వారు ఆఫ్-డ్యూటీలో (విధులు లేని సమయంలో) ఉన్నప్పుడు తమకు నచ్చిన దుస్తులు ధరించి, పార్టీలకు లేదా పబ్‌లకు వెళ్లడానికి చట్టపరంగా ఎలాంటి నిషేధం లేదు.అయితే, ఆల్ ఇండియా సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1968 ప్రకారం వారు కొన్ని ముఖ్యమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.రూల్ 20 అనుసరించి ఐఏఎస్ అధికారులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మైకంలో తూలడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం చేయకూడదు. పబ్ అనేది మద్యం సర్వ్ చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశం అయినప్పటికీ, అక్కడ పరిమితికి మించి తాగి గొడవలు సృష్టించకూడదని చట్టం లో చెప్పబడుతుంది.ప్రజా ప్రవర్తన రూల్ 3 ప్రకారం ఒక ప్రభుత్వ అధికారిగా ఎల్లప్పుడూ సమాజంలో గౌరవప్రదంగా నడుచుకోవాలి. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదని రాజ్యాంగ నిబంధనులలో చెప్పబడి ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే ఐఏఎస్ అధికారులు పబ్‌లకు వెళ్లడం తప్పు కాదు, కానీ అక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదా ప్రభుత్వ అధికారి హోదాను దుర్వినియోగం చేస్తూ రచ్చ చేయడం నిబంధనల ప్రకారం నేరమని రాజ్యాంగ సూత్రాలు చెబుతున్నాయి.ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1969 వర్తిస్తాయి.విధుల్లో అలసత్వం లేదా చిన్నపాటి ప్రవర్తనా లోపాలు ఉంటే సదరు అధికారి సేవా రికార్డులో తప్పును నమోదు చేస్తూ ఇచ్చే రాతపూర్వక హెచ్చరిక,నిర్ణీత కాలం వరకు పదోన్నతి రాకుండా చేయడం, అధికారి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లితే, ఆ మొత్తాన్ని వారి జీతం నుండి రికవరీ చేయడం,వార్షిక జీతపు పెంపును (ఇంక్రిమెంట్లను) తాత్కాలికంగా ఆపివేయడం ఒక విధానం.తీవ్రమైన అవినీతి, బహిరంగ ప్రదేశాల్లో తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తించడం, నేరపూరిత చర్యలు లేదా క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు ఆ అధికారిని ప్రస్తుత పదవి/జీతపు స్థాయి నుండి కింది స్థాయికి తగ్గించడం. సర్వీస్ కాలం పూర్తికాకముందే బలవంతంగా ఉద్యోగం నుండి విరమింపజేయడం, ఉద్యోగం నుండి తీసివేయడం. అయితే, వీరు భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు.ఇంకా ప్రభుత్వాలు అనుకుంటేఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించడమే కాకుండా, వీరు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అర్హులు కాకుండా చేయొచ్చు.అయితే వీటన్నింటికి ముందునిబంధనలు ఉల్లంఘించిన అధికారికి మొదట చార్జ్ షీట్ (మెమో) జారీ చేసి వివరణ కోరతారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే, విచారణ అధికారి ఆధ్వర్యంలో అంతర్గత విచారణ జరుగుతుంది. విచారణ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శిక్షను ఖరారు చేస్తుంది. తీవ్రమైన శిక్షల విషయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహా కూడా తీసుకుంటారు.ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి తన అధికార దుర్వినియోగం కు పాల్పడినప్పుడు.
ఎందుకయ్యా ఈ ఉపోద్ఘాతం అని అనుకోవచ్చు.మరి జరిగిన సంఘటన లో ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి కూడా ఇలా ఇన్ని చట్టాలు తెలిసి బెంగుళూరు పబ్ లో గబ్బు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న సామాన్యుడు నుండి ఉత్పన్నం అవుతోంది.
ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరు పబ్ వివాదానికి సంబంధించిన వివరాలలోకి వెళితే అక్టోబర్ 10, 2026 అర్ధరాత్రి దాటాక (సుమారు 1:30 గంటల ప్రాంతంలో) బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఎంక్వయిరీ వింగ్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే తన సిబ్బందితో కలిసి రెసిడెన్సీ రోడ్‌లోని ‘క్యావోర్’ (Cavore) పబ్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు.పబ్‌లోని కొందరు యువతుల వయస్సును నిర్ధారించుకోవడానికి పోలీసులు ఐడీ కార్డులు చూపించమని అడిగారు.ఈ తనిఖీ వికాస్ మర్మత్ మరియు అతని స్నేహితులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. తాను ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ పోలీసులపై తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా, ఇన్‌స్పెక్టర్‌ను నెట్టివేసి (కొన్ని నివేదికల ప్రకారం చెంపదెబ్బ కొట్టి) దాడికి యత్నించినట్లు ఆరోపణల నేపధ్యం లో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో వికాస్ మర్మత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.అభయ్ ఉదయ్ సింగ్ – రియల్ ఎస్టేట్ వ్యాపారి.నితీశ్ – బిహార్‌లో ఒక పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు. రోషన్ – బౌన్సర్.
బాధిత పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే చికిత్స పొందిన అనంతరం కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS) కింద క్రింది సెక్షన్లతో క్రిమినల్ కేసు నమోదైంది.ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం , స్వచ్ఛందంగా గాయపరచడం ,క్రిమినల్ బెదిరింపులు,బూతులు తిట్టడం / అనుచిత ప్రవర్తన చేసినట్లు సదరు ఇన్స్పెక్టర్ పిర్యాదు చేసిన కారణంగా కేసులు నమోదు అయినట్లు అక్కడి పోలీసుల ద్వారా తెలుస్తుంది.తాజా నివేదికల ప్రకారం బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, అయితే నిందితులపై ఇంకా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు (అరెస్ట్ వంటివి) తీసుకోవాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు. ప్రస్తుతం వికాస్ మర్మత్‌ను లూప్ లైన్ లో ఉంచారు.
వికాస్ మర్మత్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2019 బ్యాచ్‌ IAS అధికారి కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ బాధ్యతలు నిర్వర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. వికాస్ మర్మత్‌ను KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ, సాధారణ పరిపాలన శాఖలో (GAD) రిపోర్ట్ చేయాలని అక్టోబర్ 15, 2026న ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈ ఐఏఎస్ అధికారి వ్యవహారం లో రాష్ట్ర ప్రజల నుండి భిన్నమైన ప్రశ్నలు తలెత్తున్నాయి. హైద్రాబాద్,బెంగుళూరు లో గతంలో జరిగిన అనేక పబ్ ల వ్యవహారం లో సినీ ప్రముఖులు,పలువురు రాజకీయ నాయకులపై , యువతపై అనేక కేసులు నమోదు కావడం చూసాము.కానీ ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి పబ్బుకు వెళ్ళడమే కాకుండా అక్కడ తనిఖీ కి వచ్చిన పోలీసులపై దురుసు ప్రవర్తన ఇంకా అనేక ఆరోపణలు వెల్లువెత్తున్న నేపధ్యం లో కేవలం ఆ అధికారిని బాధ్యతలను నుండి తప్పించి సచివాలయ ఏసీ గదుల్లో కూర్చోబెట్టడం అనేదే ఇక్కడ అసలైన సమస్య.
సాధారణంగా ఒక పేద మధ్య తరగతి వాడు మద్యం తాగితే నేరం,మద్యం మత్తులో ఏదైనా మాటలు మాట్లాడితే చట్టాలు అన్ని అప్పటికప్పుడే బైటికి వచ్చి బేడీలు వేసి వాడి బెండు తీస్తారు ఈ ఖాకీలు.ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తమ విధులకు ఆటంకం కలిగించారని,అవసరమైతే దేశ ద్రోహం కేసులు కూడా బనాయించడానికి వెనుకాడని ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఉన్న ప్రజలకు దేశం మొత్తం గర్వించదగ్గ సివిల్ సర్వీస్ ఉద్యోగి అయి ఉండి తాగి వాగడమే తప్పయితే మళ్ళీ అధికార జులుం ప్రదర్శించే పని చేసి ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారిపై చేయి చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు వింటుంటే ఒక సామాన్యుడికే చట్టం,ధర్మం,న్యాయం, తోటకూర పప్పు వంటివి వర్తిస్తాయా అన్న విమర్శలు ఈ ప్రభుత్వధి నేతలపై లేకపోలేదు.దేశం మొత్తం ఒకే చట్టం,ఒకే న్యాయం ఉన్నపుడు ఐఏఎస్ అధికారి కి ఒక చట్టం,సామాన్యుడు కి ఒక చట్టం అమలు చేయాలని ఎక్కడైనా ఉందా లేక బెంగుళూరు మంగుళూరు,అమరావతి,బ్రమరావతి , హైదరాబాద్,సైబరాబాద్ పోలీసులకు వేరు వేరు చట్టాలు ఉన్నాయా అన్న ప్రశ్న సామాన్యుడు నుండి ఉత్పన్నం అవుతోంది.లేదా ముఖ్యమంత్రి నియోజ వర్గ అధికారి కాబట్టి,అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇలాంటి నేరమయ సంఘటనలు ఎన్ని చేసినా పర్వలేదన్న మాట నిజం చేస్తారా అన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.లేదంటే అందరూ కూడా ఐఏఎస్ లు,ఐపీఎస్ లు చదివి అడ్డగోలు వ్యవహారాలు ,తాగి తందనాలు చేస్తే ఏమి తప్పుకాదనేది నిజం అవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడిపుడే వినిపిస్తోంది.బలవంతుడు ఏమి చేసినా పర్వలేదన్న రోజులు ఉన్నంత వరకు బలహీనుడు ఈ సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న వాదం వినిపిస్తోంది.ఇలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలు ఇంకా కొంత వరకు జీవించగలుగు తున్నారంటే ఈ ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకునే అప్రజాస్వామ్య వాదులకు వంగి వంగి దండాలు పెట్టినా తప్పేమి కాదంటూ ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్యానికి జోహార్లు చెప్పకుంటే అంత కంటే పెద్ద తప్పు కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article