తాజా వార్తలువైసీపీ ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు

వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దు

ఫ్యాక్ట్ తో కౌంటర్ ఇవ్వండి

ఉగ్రవాదుల్లా హిట్ -రన్- హైడ్ విధానంతో గొడ్డలి పార్టీ రాజకీయం

ప్రజల ఓటే మనకు గీటు రాయి.. 2029లో మెరుగైన ఫలితాలు రావాలి

ప్రతి ఎకరాకూ నీటితో తెలుగుతల్లికి జలహారతి
సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణపై పనిచేయటమే సంతృప్తి

పొలిటికల్ గవర్నెన్సుకు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు

కష్ట కాలంలో నిలబడిన కార్యకర్తకే పార్టీలో పూర్తి గౌరవం

టీడీపీ లీడర్షిప్ కాన్ క్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సాగునీటి రంగంపై చేస్తున్న కృషికి సీఎంకు పార్టీ నేతల స్టాండింగ్ ఓవేషన్

అమరావతి:-* పోలవరం సహా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నీరు ఇచ్చి తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల లీడర్షిప్ కాన్ క్లేవ్ లో నేతల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ఫ్యాక్ట్ తో గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ ఉగ్రవాదుల తరహాలో హిట్ – రన్ -హైడ్ విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓ మంచి పనిపై విమర్శలు చేసేందుకు గొడ్డలి పార్టీ సిద్ధంగా ఉంటోదన్నారు. గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంగా ఉన్నప్పటికీ.. పనులు పూర్తి కాకపోయినా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అంటూ డ్రామాలాడారన్నారు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తే అది ఎప్పుడే పూర్తి చేసేశామని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీరసిస్తే గోదావరి జలాలు కావు పురుషోత్తపట్నం నుంచి వచ్చాయంటున్నారని.. కానీ ఆ ప్రాజెక్టుకు గొడ్డలి పార్టీ నాడు అడ్డుపడిందని గుర్తు చేశారు. ఆ పార్టీ చేస్తున్న వక్రీకరణలకు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాలన్నారు. ఏపీపీఎస్సీలో అడ్డగోలుగా అక్రమాలు చేశారని అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారన్నారు. అసెంబ్లీలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు చూస్తారనే భయం వారిలో ఉందని అన్నారు. బయట కూర్చుని అసత్యాలు అదే పనిగా చెబుతారని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మరింతగా ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తామని వారు కూడా అదేస్థాయిలో పనిచేయాలని అన్నారు. నాయకత్వాన్ని పెంచుకుని ప్రజలకు మరింత సేవ చేయాలని పార్టీకి బలం చేకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు కు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకు పూర్తి గౌరవం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన సామాన్య కార్యకర్త దళవాయి రమాదేవి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల ఓటే గీటు రాయిగా పనిచేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. 2029లో మరింత మెరుగ్గా ఫలితాలను సాధిద్దామని నేతల్లో ఉత్సాహం నింపారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాలను చూసి అక్కడి ప్రజల కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయని తెలిపారు. ఎల్ నినో విపత్తుపై అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ కార్యక్రమంలో ప్రజల్ని భాగస్వాములు చేయాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, వెలిగొండ, పోలవరం ఎడమ కాల్వ ప్రారంభోత్సవాల్లో ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. జిల్లాలు నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ ఇచ్చామని పరిపాలనా వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులు సమర్ధ నాయకత్వం వహించాలన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తున్నామని పొలిట్ బ్యూరో, చట్ట సభల్లోకి తీసుకు వచ్చామన్నారు. పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్త బలంగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీ బలపడటం ఎంత ముఖ్యమూ కూటమి ఐక్యత కూడా అంతే ముఖ్యమని సీఎం దిశానిర్దేశం చేశారు. ఫోటోల గురించి ఫ్లెక్సీల గురించి వివాదాలు వద్దని కూటమిగా కలిసి క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. 2024 కంటే ఎక్కువ ఓట్లు వచ్చేలా పనిచేయాలని అన్నారు. పనిచేయటంతో పాటు చేసిన పనిని సమర్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం కూడా ముఖ్యమన్నారు.
నాయకత్వానికి కేరాఫ్ ఆడ్రస్ తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి అన్నారు. పార్టీలో తొలిసారిగా లీడర్షిప్ కాన్ క్లేవ్ ను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం దొరుకుతుంది. వర్తమానాన్ని అర్ధం చేసుకుని భవిష్యత్తును అంచనా వేయాలి. గత పాలకులు రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై నిలబెట్టారు. వ్యవస్థలను విధ్వంసం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి కూటమిగా ప్రజల మద్దతు దక్కించుకున్నాం. పాలకుడు ఏ విధంగా ఉండకూడదో అనే దానికి గత పాలకుడే ఓ కేస్ స్టడీ. కేంద్ర సహకారంతో ఇచ్చిన హామీల అమలుకు అనునిత్యం పనిచేస్తున్నాం. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ పాలన చేపట్టాం. నెలకు నాలుగు రోజులు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో ఉంటున్నాను. పేదల సేవలో, మీ భూమి-మీ హక్కు, స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, సంజీవని కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నాను. విద్య-వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం…ప్రైవేట్ స్కూళ్లకు గుడ్ బై చెప్పి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర ఫించన్ ఇప్పటికే పంపిణీ చేశాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ల, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నల సేవలో, దీపం, మత్య్సకారుల సేవలో వంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్మెంట్ చేశాం.ఒక్క డీఎస్సీ కూడా పెట్టని వ్యక్తి మనపై విమర్శలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నిర్దేశిత గడువులోగా పోలవరం, అమరావతి పూర్తి అవుతాయి. 28 పాలసీలతో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు గ్రౌండ్ అవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయి. గుగుల్, ఆర్సెలార్ లాంటి పరిశ్రమలతో ఉత్తారాంధ్ర ఇప్పుడు అభివృద్ధికి కేంద్రం. అమరావతి క్వాంటం టెక్నాలజీతో పాటు నాలెడ్జి హబ్ గా మారుతుంది. రాయలసీమ రైజింగ్ నినాదంతో గోల్డ్ ఫీల్డ్, ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ వచ్చాయి. త్వరలో హార్టికల్చర్ హబ్ గా మారుతుంది. డేటా ఇంటిగ్రేషన్ ద్వారా పౌరసేవల్ని సులభతరం చేశాం. రెవెన్యూ సమస్యల పరిష్కారం తో పాటు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తాలు అందిస్తున్నాం. క్యూఆర్ కోడ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భూములకు భద్రత కల్పిస్తున్నాం. 22 ఏ భూముల వివాదాన్ని పరిష్కరిస్తున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరిస్తే ప్రజా ప్రతినిధులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

వాటర్ మాన్ కు లీడర్షిప్ కాన్ క్లేవ్ అభినందన
అంతకు ముందు కాన్ క్లేవ్ లో సీఈఓ సీఎం టూ వాటర్ మాన్ అంటూ ఎకనామిక్ టైమ్స్ రాసిన కథనంపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రికి అభినందన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి తెలుగు యువతను ఐటీ నిపుణులుగా మార్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, జల సంరక్షణతో వాటర్ మ్యాన్ గా మారారని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా వివిధ ప్రాంతాలకు జల వనరులు అందించేలా డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారని మంత్రి వెల్లడించారు. జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే అభివృద్ధి, ప్రగతి అన్న నినాదంతో 2014 రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలవరం, వెలిగొండ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన సీఎంకు ఎకనామిక్ టైమ్స్ ప్రశంసలు తెలిపిందని స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్టా డెల్టాకు నీరు తేవటంతో పాటు రాయలసీమ ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా నీరిచ్చారని అన్నారు. ఏపీలో ఉన్న 4 కోట్ల ఎకరాల భూమిలో 2 కోట్ల ఎకరాలు మాత్రమే సాగు చేసేందుకు ఆస్కారం ఉందని గుర్తించి నీరిచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో భూమి సాగుకిందకు రావాలంటే ప్రాజెక్టులు పూర్తి చేయటం ఒక్కటే మార్గమని సీఎం పాలసీగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువను వేగంగా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లటంలో సీఎం కృషిని ఇటి కథనంలో ప్రస్తావించిందన్నారు. 2027 పుష్కరాలకంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారన్న లక్ష్యాన్ని కూడా ఈటీ తన కథనంలో పేర్కొంది. వచ్చే 3 ఏళ్లలో రూ.35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసే అంశాన్ని కూడా ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో ప్రశంసించిందన్నారు. జల ధార కార్యక్రమం ద్వారా భూగర్భజలాలను పెంచటంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారని ఈటీ కథనంలో వెల్లడించినట్టు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఏపీకి సీఈఓగా మారిన సీఎం.. ప్రస్తుతం నీటి విలువను గుర్తించి వాటర్ మాన్ గా రూపాంతరం చెందారని ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. సాగునీటి రంగంపై చేస్తున్న కృషికి గానూ తెలుగుదేశం పార్టీ నేతలంతా స్టాండింగ్ ఓవేషన్ తో ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article