తాజా వార్తలువస్తున్నా...విశాఖ నగరానికి...

వస్తున్నా…విశాఖ నగరానికి…

విశాఖలో ఆవిష్కృతం కానున్న చారిత్రక ఘట్టం*

రూ.8,874 కోట్ల విలువైన భూమిపై సంపూర్ణ హక్కులతో పట్టాలివ్వనున్న సీఎం

28,445 కుటుంబాలకు ఇంటి హక్కు

399 ఎకరాల్లో 19,33,853 చదరపు గజాల క్రమబద్ధీకరణ

40 ఏళ్ల పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వం

విశాఖలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలన్న కలను సాకారం చేసేందుకు విశాఖ వస్తున్నా అంటూ సీఎం ట్వీట్

ప్రజాభూమి ప్రతినిధి, అమరావతి* 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖపట్నం వేదికగా శనివారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీని విలువ రూ.8,874 కోట్లు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19,33,853 చదరపు గజాలను పేద కుటుంబాలకు హక్కులు కల్పించనున్నారు. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణ చేపట్టి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఇల్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అందులో నివసిస్తున్నా.. ఆ ఇంటి స్థలంపై పూర్తి హక్కు లేకపోవడం అనేక కుటుంబాలను వేధిస్తోన్న సమస్య. పట్టా లేకపోవడంతో ఆస్తిని పూర్తిస్థాయిలో అనుభవించలేని పరిస్థితి.. బదలాయించుకోక… భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వంటి సమస్యలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. శనివారం సీఎం చంద్రబాబు చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీతో ఇన్నాళ్లూ పడిన కష్టాలు గట్టెక్కనున్నాయి. విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపద, ఆత్మగౌరవం, భరోసా కల్పించేలా అంగరంగ వైభవంగా విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది.

ఇల్లే కాదు… ఇంటిపై హక్కూ ఉండాలి

పేదవాడికి ఇల్లు ఉండడమే కాదు… ఆ ఇంటిపై పూర్తి హక్కు ఉండాలన్నది ప్రభుత్వ విధానం. దానికి అనుగుణంగానే 2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది.. కొన్ని జీవోలను కూడా జారీ చేసింది.. కొంత మందికి పట్టాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం మారడంతో ఆ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం దక్కలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్లీ ఈ సమస్యపై దృష్టి సారించింది. సీఎం చేపట్టిన జిల్లా సమీక్షల్లో కూడా ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణ ద్వారా హక్కులు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపుతూ విశాఖలో భారీ స్థాయిలో పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది.

మండలాల వారీగా లబ్దిదారుల కుటుంబాలు

ప్రస్తుతం విశాఖలో చేపడుతున్న క్రమబద్ధీకరణలో గాజువాక నుంచి భీమిలి వరకు పలు ప్రాంతాల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. విశాఖ రూరల్‌లో అత్యధికంగా 9,261 కుటుంబాలు లబ్ధి పొందనుండగా.. ములగాడలో 4,213, గాజువాకలో 4,353, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910, మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభంలో 17 కుటుంబాలకు హక్కులు కల్పించనున్నారు.

విశాఖ అభివృద్ధిలో పేదలకు భాగస్వామ్యం

ప్రపంచస్థాయి నగరంగా విశాఖను అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో వేగం పెంచుతూ.. ఆ అభివృద్ధిలో సామాన్య కుటుంబాలను భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్లోబల్ సంస్థలను విశాఖకు తీసుకురావడం, పెట్టుబడులు–ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. పేద కుటుంబాలకు ఆస్తిపై హక్కు, భవిష్యత్తుపై భరోసా కల్పించడం ద్వారా అభివృద్ధి ఫలాలు సామాన్యుడి ఇంటి గడపకు చేరేలా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు విశాఖ వస్తున్నా అంటూ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదని… 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుందని… భవిష్యత్తుకు భద్రత కలుగుతుందని…. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుందని… ఆత్మగౌరవం, భరోసా దక్కుతుందని సీఎం వెల్లడించారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని ముఖ్యమంత్రి చెప్పారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article