పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం ప్రజాభూమి, కృష్ణా బ్యూరో: నవంబర్ 1వ తేదీన మచిలీపట్నం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో కూటమి మేయర్ అభ్యర్థినిగా తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అబీదా బేగం పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థినిగా లంకా జ్యోతి, కాంగ్రెస్ అభ్యర్థినిగా షేక్ రహీమున్నీసాతోపాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. ఈ సారి నగరంలో పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీనితోపాటు కార్పొరేటర్లుగా కూటమి చెందిన అభ్యర్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా తమ గెలుపుకోసం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. 60 డివిజన్లలో ఉన్న ఓటర్ల లిస్టులను ఆయా డివిజన్లలో ఉన్న ఓటర్లు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. అయితే పలువురు ఓటర్లు నగరంలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నారని తెలుసుకుంటూ వారి చిరునామాలను, సెల్‌ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని పోటీ చేస్తున్న అభ్యర్థులు స్వయంగా ఫోన్లు చేసి తమని తాము పరిచయం చేసుకొని తాము ఫలానా డివిజన్ నుంచి పోటీ చేస్తున్నామని, ఆయా డివిజన్లలోని ఓటర్ల లిస్టులో మీ పేరు ఉంది కనుక ఎన్ని పనులు ఉన్నా ఎన్నికల రోజున అనగా నవంబర్ 1వ తేదీనాటికి మచిలీపట్నం వచ్చి తప్పక ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. అలా వచ్చినట్లయితే మీరు రైలు లేదా బస్సు టిక్కెట్లను రాను పోను బుక్‌చేసి రవాణా ఖర్చులతోపాటు ఇతర ఖర్చులు కూడా చెల్లిస్తామని లేదా ముందుగానే ఫోన్ పే ద్వారా పంపుతామని హామీ ఇస్తున్నారు. నగరంలో ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయా పార్టీలకు చెందిన పలువురు ప్రచారకర్తలు తమకు ఓటు వేస్తే ఇంత మొత్తం ఇస్తామని ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఎలా వున్నా ఈ నగర పాలక సంస్థ ఎన్నికలలో ఒక్కొక్క డివిజన్లో 2,000 నుంచి 2,500 మంది వరకూ ఓటర్లు ఉన్నారు. గెలుపుపై దృష్టిపెట్టుకున్న పలువురు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఓటుకు ఇంత అని ఘనంగా తాంబూలాలు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. అదే జరిగితే ఒక్కొక్క డివిజన్‌కి పోటీ చేస్తున్న ఆయా పార్టీల అభ్యర్థులకు ప్రచార ఖర్చులతోను, ఇతర ఖర్చులతోను ‘అమ్యామ్యా’ ఖర్చులు కలిపి దాదాపు 20 లక్షల రూపాయల పై వరకూ ఖర్చు అవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారు ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు నిమిత్తం కనీసం 10 లక్షల రూపాయల వరకూ సాయం అందిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ సామాజిక వర్గంలో ఆర్థికంగా స్థిరపడిన వారిదగ్గర నుంచే కాక తమకు అత్యంత సన్నిహితుల దగ్గర కూడా విరాళాల రూపంలో వసూలు చేస్తున్నారని వినికిడి. ఏది ఏమైనా పోటా పోటీగా జరుగుతున్న మచిలీపట్నం నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమికి చెందిన, వైఎస్సార్సీసీకి చెందిన పార్టీలు ఎవరు అధికారంలోకి వస్తారో వేచి చూడాలి.!