Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుకాకినాడలో కుండపోత వర్షం

కాకినాడలో కుండపోత వర్షం

విశాఖపట్నం, కాకినాడలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విశాఖ ఆర్కేబీచ్, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. శుక్రవారం కూడా కాకినాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. బార్జీల నుంచి నౌకలకు బియ్యం రవాణా నిలిపివేశారు అధికారులు.అటు ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో వేకువజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. మార్కాపురం మండలం బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తర్లుపాడు – మార్కాపురం మధ్య కొండ వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మరోవైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. తుంగభద్ర జలాశయం, శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టం1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1631.93 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 50,593 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 36,799 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 101.500 టీఎంసీలుగా నమోదు అయ్యింది.ఇటు నంద్యాలలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 79,536 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 67,626 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 212.9198 టీఎంసీలుగా కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article