ఎన్నికల కుట్రల నుంచి డైవర్షన్ కోసమే యలహంక ఆస్తులపై విషప్రచారం
- చంద్రబాబు కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై షర్మిల తప్పుడు ప్రచారం
: మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ
మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్ని నాని
- రేపు మున్సిపల్ ఎన్నికలున్నాయనగా, బెంగళూరు ఆస్తి తనదే అంటూ ట్వీట్ దీంట్లో భాగమే
- యలహంక ఆస్తి జగన్‌గారి అత్తగారు డాక్టర్ సుగుణమ్మ గారిది
- దీనికి సంబంధించిన డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా ఉంది
- జగన్ గారి కంపెనీ 20ఏళ్ల కిందటే యలహంక స్థలాన్ని లీజుకు తీసుకుంది
- ఆ స్థలంలో ఉన్న ప్రతి నిర్మాణానికీ ఇప్పటికీ బిల్లులు కడుతున్నది జగన్‌గారి కంపెనీయే
: మీడియాకు వివరాలు వెల్లడించిన మాజీ మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం:
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేక ఒకవైపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలకు పాల్పడుతూ, మరోవైపు వైఎస్ జగన్ గారిపై విషప్రచారం చేయిస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బెంగళూరులోని యలహంక ఆస్తుల పేరుతో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు రాజకీయంగా అవసరం వస్తే అప్పుడు షర్మిలగారు తెరపైకి రావడం, జగన్‌గారిపై ఆరోపణలు చేయడం రివాజుగా మారిందన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు బెంగళూరు ఆస్తి తనదేనంటూ షర్మిలగారు ట్వీట్ చేయడం కూడా ఈ రాజకీయ పరిణామాల్లో భాగమేనని పేర్ని నాని స్పష్టం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే….
ప్రజలకు రెండున్నరేళ్లలో ఏం చేశాడో చెప్పుకోలేక..:
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు, ప్రజల మద్దతు కూడా లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే ఒకవైపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలకు పాల్పడుతూ, మరోవైపు వైఎస్ జగన్ గారిపై విషప్రచారం చేయిస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, పోలింగ్ కేంద్రాల్లో ప్రతిపక్ష ఏజెంట్లు కూడా లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. అసలు పోలీసుల నుంచి ఎన్నికల ఏజెంట్లు క్లియరెన్స్ తీసుకోవడం ఎప్పుడైనా విన్నామా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఉండకూడదు. ఈ ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బెంగళూరులోని యలహంక ఆస్తుల పేరుతో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు ఎప్పుడు రాజకీయంగా అవసరం వస్తే అప్పుడు షర్మిలగారు తెరపైకి రావడం, జగన్‌గారిపై ఆరోపణలు చేయడం జరుగుతోంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ ప్రచారం సాగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందు బెంగళూరు ఆస్తి తనదేనంటూ షర్మిలగారు ట్వీట్ చేయడం కూడా ఈ రాజకీయ పరిణామాల్లో భాగమే.
నామినేషన్ దశ నుంచే అక్రమాలు మొదలు:
నామినేషన్ల దశ నుంచే మొదలైన అక్రమాలు పోలింగ్ వరకు కొనసాగుతున్నాయి. టర్మ్ అయిపోయిన వెంటనే ఎన్నికలు పెట్టాల్సింది పోయి, ఈ చంద్రబాబు ప్రజలకు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా ఒకదాని మీద ఒకటి ఎన్నికలు పెడుతూ ఎన్ని పాపాలు, దుర్మార్గాలు చేసైనా గెలవాలని కుట్ర పన్నుతున్నాడు. కొంతమంది ఐపీఎస్‌ల నాయకత్వంలో కౌరవులు ద్రౌపదిని చెరబట్టినట్టుగా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని వివస్త్రను చేసి నడిబజారులో నిలబెట్టాడు. హోంగార్డులతో కలిపి 65 వేల మంది పోలీసులు ఉంటే, రేపటి ఎన్నికల కోసం కేవలం 25 వేల మందిని మాత్రమే కేటాయించి, వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో వేల మందిని మోహరించి ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నారు. వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు ఓటుకి రూ.2,000 చొప్పున పంచడానికి భారీఎత్తున రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల వివరాలు 5 రోజుల ముందే ఇవ్వాలని నిబంధన పెట్టడం దారుణం, హైకోర్టు ఆదేశాలంటే కూడా పోలీసులకు లెక్కలేకుండా పోయింది. అర్నబ్ తుపానులో ఈ చంద్రబాబు కేవలం పబ్లిసిటీ చేసుకుంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నాడు, బాధిత ప్రజలను, రైతులను గాలికి వదిలేశారు. అర్నబ్ తుపాన్‌ని అడ్డం పెట్టుకుని పోలింగ్ కేంద్రాలకు కరెంట్ ఇవ్వకుండా అరాచకాలకు ప్లాన్ చేస్తున్నాడు. నాడు కౌరవ సభలో నోరు మెదపని భీష్ముడు, ద్రోణాచార్యుల పరిస్థితి తర్వాతి కాలంలో ఏమైందో, రేపటి రోజున బీజేపీ మాధవ్, ఎస్ఈసీ పునేఠ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.
యలహంక ఆస్తి భారతి గారి తల్లి డాక్టర్ సుగుణమ్మ గారిది:
యలహంకలోని ఆస్తి జగన్‌గారి అత్తగారు డాక్టర్ సుగుణమ్మగారిది. భారతిగారి తల్లిదండ్రులైన డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మగారు కడప, అనంతపురం జిల్లాల్లో మంచి పేరున్న వైద్యులు, అప్పట్లోనే మంచి ప్రాక్టీసుతో స్థితిమంతులుగా ఉన్నారు. తమ పిల్లలను అప్పట్లోనే బెంగళూరులో చదివించడంతో అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాల్లో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. జగన్‌గారి కంపెనీ సుమారు 20 ఏళ్ల క్రితమే ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని రెండు గెస్ట్‌హౌస్‌లు నిర్మించింది. షర్మిలగారు బెంగళూరుకు వచ్చినప్పుడు అందులో ఒక గెస్ట్‌హౌస్‌లో ఉండాలని చెప్పారు. ఆ స్థలంలోని నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు, ఇతర ఛార్జీలను ఇప్పటికీ జగన్‌గారి కంపెనీనే చెల్లిస్తోంది. అలాంటప్పుడు ఆ ఆస్తి తనదేనని ఇప్పుడు చెప్పడం ఎంతవరకు సమంజసం? జగన్‌గారు షర్మిలగారికి రాశారని చెబుతున్న ఎంవోయూలో కూడా యలహంక ఆస్తి ప్రస్తావనే లేదు. వైఎస్సార్‌గారు మరణించిన తర్వాత కూడా జగన్‌గారు తన చెల్లెలికి దాదాపు రూ.230 కోట్లు ఇచ్చారు. పెళ్లై పాతికేళ్లు దాటిన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో సోదరికి ఆర్థికంగా అండగా నిలిచే అన్నలు ఎక్కడైనా ఉంటారా? భద్రతా కారణాల దృష్ట్యా యలహంకలో కుమార్తె పెళ్లి వేడుక నిర్వహించవద్దని జగన్‌గారు ముందుగానే చెప్పారు. తన కుమార్తెల పెళ్లిళ్ల విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అయినా అక్కడే పెళ్లి అంటూ షర్మిలగారు పెళ్లి కార్డులు ముద్రించడం వెనుక ఉద్దేశం ఏమిటి? కుమార్తె పెళ్లిని కూడా రాజకీయ వివాదాలకు వేదికగా మార్చడం ఎంతవరకు సమంజసం? ఆ తర్వాత కూడా జగన్‌గారు లేఖ రాసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఇంటిని వినియోగించుకోవాలని చెప్పారు కదా? ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు తన తోబుట్టువులకు ఏమిచ్చాడో చెప్పాలి:
చెల్లి, యలహంక ఇళ్లు, మేనకోడలి పెళ్లి అంటూ వైఎస్ కుటుంబ వ్యవహారాలను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నాడు. ఒక కుటుంబంలో చిచ్చుపెట్టి, ఆడపిల్లలను రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు బజారుకు లాగడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా గమనిస్తున్నారు. జగన్‌గారు తన చెల్లికి రూ.230 కోట్లు ఇచ్చారు, లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? చంద్రబాబు తన తోబుట్టువులకు ఏనాడైనా కనీసం రూ.2 లక్షలైనా ఇచ్చారా? సొంత చెల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని ఆమె అల్లుడే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిన విషయాన్ని చంద్రబాబు మరిచిపోతే ఎలా? అత్తింటి వారిని వెంట తిప్పుకునే చంద్రబాబు తన తమ్ముడిని, ఇద్దరు చెల్లెళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు, తమ్ముడి కొడుకు పెళ్లికి తన హైదరాబాద్ ప్యాలెస్‌ను ఇచ్చారా? తన ప్రమాణ స్వీకారానికి ఏనాడైనా తోబుట్టువులను పిలిచారా, అమరావతిలో ఐదెకరాల్లో నిర్మిస్తున్న ప్యాలెస్ భూమిపూజకు చెల్లెళ్లను ఆహ్వానించారా? చంద్రబాబు కనీసం తల్లిదండ్రులకు కూడా బాధ్యతగా తిండిపెట్టలేదు. మాదాపూర్‌లోని సుమారు ఏడు ఎకరాల భూమిని తన తల్లి లోకేష్‌కు మాత్రమే ఎందుకు బహుమతిగా ఇచ్చారు, మిగిలిన వారసులకు వాటా ఎందుకు ఇవ్వలేదు? ముందు తన కుటుంబ ఆస్తుల పంపకాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి, ఆ తర్వాతే ఇతరుల కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడాలి. తన పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్‌గారిపై విషప్రచారాలు చేయడం, కుటుంబ వివాదాలను రాజకీయాలకు వాడుకోవడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని పేర్ని నాని హితవు పలికారు.

