క్రిమినలైజేషన్, లిటిగేషన్, ఫాల్స్ ప్రాపగేషన్ వారి సిద్ధాంతం
వైసీపీ హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలి
ట్రిపుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధిలో వేగం
కూటమి ఉమ్మడి నిర్ణయంతోనే స్థానిక సీట్ల సర్దుబాటు
కూటమి అగ్రనేతల మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
ప్రజాభూమి ప్రతినిధి,అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గొడ్డలి పార్టీ సహించలేకపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకోవటం ద్వారా రాష్ట్రాభివృద్ధిని నిరోధించటమే ఆ పార్టీ వైఖరి అని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెడులను విశ్లేషించి ఓటు వేయాలని… గడచిన రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ లతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దీనిపై సీఎం మాట్లాడుతూ..”గత పాలకులు విధ్వంసంతోనే పాలన చేశారు. కూటమిగా ఏర్పడి గత ప్రజా కంటక పాలనను అంతమొందించాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. ఎల్ నినో కరువు పరిస్థితుల్లోనూ ఎక్కడా అభివృద్ధి ఆగిపోకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు అర్నబ్ తుఫాను లాంటి ప్రకృతి విపత్తు వచ్చింది. సమర్ధంగా ఎదుర్కోనేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశాం. రాష్ట్ర అభివృద్ధి కోసమే నిరంతరం తపన పడుతున్నాం. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బటన్ నొక్కుతున్నాం గుంతలు పూడ్చలేమని గత పాలకులు చెప్పారు. ఇప్పుడు మేం సంక్షేమం అందిస్తున్నాం… అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల నుంచి డేటా సెంటర్ల వరకూ అభివృద్ధి కనిపిస్తోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లుగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద రూ.27 వేల కోట్లతో మరో ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చింది. గత పాలకులు గోదావరిలో ముంచేసిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం. రెండేళ్లలో ప్రతీ రంగంలోనూ మార్పు తీసుకువచ్చాం. ప్రతీ కుటుంబానికీ న్యాయం చేస్తున్నాం.”అని ముఖ్యమంత్రి అన్నారు.
లిటిగేషన్లే ఆ పార్టీ రాజకీయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయి విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ నేతలు హింసా విధానాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. సీఎం మాట్లాడుతూ..” రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. రాజకీయ పార్టీకి ఉండాల్సిన తీరుగా వైసీపీ వ్యవహరించటం లేదు. ఆ పార్టీ మంచిని చూడలేక పోతోంది. అభివృద్ధిని సహించలేకపోతోంది. ఎన్నికలు జరగటం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరగనీయకుండా చూడాలనేది గొడ్డలి పార్టీ ఆలోచన. ఎన్నికలు ఆపడానికి 62 పిటిషన్లు దాఖలు చేశారు. సర్ పైనా, డీలిమిటేషన్, బీసీ రిజర్వేషన్లపైనా కోర్టులకు ఎక్కారు. ఇప్పుడు ఎన్నికలు జరగకపోతే ఆర్ధిక సంఘం నిధులు ఆగిపోతాయి. స్థానిక సంస్థలు అభివృద్ధి కావటం ఆ పార్టీకి ఇష్టం లేదు. హింసాత్మక ఘటనలు సృష్టించారు. బెంగుళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారు. తీవ్రవాదుల తరహాలో హిట్ అండ్ రన్ చేస్తున్నారు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం క్రిమినలైజేషన్, లిటిగేషన్, ఫేక్ ప్రాపగాండా. మా సిద్ధాంతం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, సేవా భావం. మా ప్రభుత్వ సహనాన్ని, సంయమనాన్ని కూడా గొడ్డలి పార్టీ దుర్వినియోగం చేస్తోంది. వాళ్ల కుటుంబంలోనూ సంక్షోభాన్ని సృష్టించుకున్నారు. ఆస్తుల కోసం సొంత చెల్లెల్ని, తల్లిని మోసం చేస్తున్నారు. అతని ఆలోచన ప్యాలస్ కోసం, మా ఆలోచన, మా తపన ప్రజలు పేదల కోసం. గొడ్డలి పార్టీ సృష్టించే అడ్డంకులు సమర్ధంగా దాటుకుని ముందుకెళ్తాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించి గెలిపించండి
“రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీటీసీలకు 46 వేల పైచిలుకు నామినేషన్లు, జెడ్పీటీసీలకు 4,700 పైచిలుకు నామినేషన్లు వచ్చాయి. కూటమిగా ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తున్నాం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో మేం ఎక్కడా రాజీ పడటం లేదు. అన్ని ప్రాంతాలు, ప్రజలందరికీ న్యాయం జరగాలన్నదే మా మూడు పార్టీల లక్ష్యం. 2024లో చారిత్రాత్మక మద్దతు ఇచ్చినట్టే… మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నాను. ప్రజల ఓటు మాకు నూతన శక్తిని, సంకల్పాన్ని ఇస్తుంది. స్థానిక సంస్థల్లో ప్రతీ అంశాన్ని బేరీజు వేసుకుని కూటమి సంకీర్ణ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకునే సీట్లు ఇచ్చాం. బీఫాం ఇచ్చిన అభ్యర్ధులకే కూటమి నేతలు సహకరించాలని అందరినీ కోరుతున్నాం. ఈ స్థాయిలో ఎన్నికల కసరత్తు గతంలో ఎప్పుడూ చేయలేదు. మూడు పార్టీలు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఇది. జనాభా దామాషా ప్రకారం సోషల్ రీ ఇంజనీరింగ్ ఆధారంగానే సీట్ల కేటాయింపు జరిగింది. సవాళ్లు, అడ్డంకులు దాటుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సీట్ల సర్దుబాటుపై తాను, పవన్ కళ్యాణ్ ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం. ఎంపీటీసీల స్థాయిలో సీట్ల సర్దుబాటు… అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాం. ఇక స్థానిక సంస్థల్లోనూ కూటమి గెలుపు ద్వారా ట్రిపుల్ ఇంజన్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికి ట్రెండ్ సెట్ చేయాలని ప్రజలను కోరుతున్నాను. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో సీట్లు ఇవ్వలేని వాళ్లకు న్యాయం చేస్తాం. బీ-ఫాం ఇచ్చిన అభ్యర్థులనే గెలిపించాలి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు.”అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈవీఎంలపై ద్వంద్వ వైఖరి
“రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా ఎన్నికల కమిషన్ ది ఎప్పుడూ ఒకే విధానం. సీఈసీ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరులు అనుసరిస్తున్నాయి. సర్ పై ఒకచోట ఒక వైఖరి, మరో చోట మరోవైఖరి అవలంభిస్తారా..? ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న పార్టీలు… ఇదే ఈవీఎంలతోనే గెలిచాయి. కేంద్రంపైనా, రాష్ట్రాలపైనా బురద చల్లే ప్రయత్నం చేస్తారా..? దేశాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ నిరంతరం కృషి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్… ఓడినప్పుడు అవి రాంగ్ అనడం… సరైనదేనా..? ఇదెక్కడి వైఖరి..? జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నట్టే… గొడ్డలి పార్టీ నేత తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు. ఒక వ్యక్తి వైఖరి వల్ల రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి. రప్పరప్పా రాజకీయాలు చేసి ప్రజల్ని ఇబ్బందులు పెడతారా..? గతంలో రాజకీయాల్లోకి రౌడీలు వస్తే ప్రజలు గమనించే వారు. ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నిర్మించాలంటే మంచి సమర్ధ నాయకత్వమే కావాలి. గత పాలకులు చేసిన అవకతవకల్ని సరిదిద్దటానికి మూడేళ్ల సమయం పట్టింది. ప్రజల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల మాది భయం కాదు బాధ్యత.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

