Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలునదులకు మొక్కుతాం.. అందులోనే చెత్తగుమ్మరిస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నదులకు మొక్కుతాం.. అందులోనే చెత్తగుమ్మరిస్తాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం, గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈమేరకు శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ.. చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వపరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోజుకు రెండుసార్లు ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించి, ప్రాసెసింగ్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్ నెస్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. పంట కాలువలు, నదులను డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్నచోటును కూడా చెత్తతో నింపేశారని అన్నారు. నదులకు మొక్కుతూ, దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పారేయడం వల్ల గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. లేదంటే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టు..
పనికిరాని వస్తువులతోనూ సంపద సృష్టించవచ్చని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. ఊడ్చి పడేసిన చెత్త నుంచి కొత్త సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇంటింటికీ తిరిగి రోజుకు రెండుసార్లు చెత్తను కలెక్ట్ చేసే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆపై దానిని ప్లాంట్ లో ప్రాసెస్ చేసి సంపద సృష్టిస్తామని వివరించారు. తొలుత దీనిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిస్తామని, ఫలితాలు చూసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా దీనిని బాధ్యతగా తీసుకుని సహకరించాలని కోరారు.మాస్టర్ ట్రైనర్స్‌ను ముందు రెడీ చేసి..‌ వాళ్ల ద్వారా రాష్ట్రం మొత్తం శిక్షణ ఇస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలోని 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్ల ఆదాయం సమకూరిందని పవన్ కల్యాణ్ చెప్పారు. రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొన్నారు. గ్రామాల్లో రోడ్ల వెంబడి కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article