టాప్ న్యూస్​సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం

​సామాన్య భక్తులకే ప్రథమ ప్రాధాన్యం

రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల రద్దుతో ఉచిత దర్శనం

*​శీఘ్ర దర్శనానికి రూ. 1,000 సదుపాయం – *కుమ్మరిపాలెం నుండి ప్రత్యేక ఉచిత రవాణా.

​18 వేల మంది సామర్థ్యంతో 3 భారీ హోల్డింగ్ కేంద్రాలు –

క్యూలైన్లలో 8,500 మందికి వేచి ఉండే వెసులుబాటు

​వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహామండపం ర్యాంపు ద్వారా ప్రత్యామ్నాయ క్యూ మార్గం

​ఫేషియల్ రికగ్నిషన్, క్యూఆర్ కోడ్ తనిఖీలతోనే కొండపైకి వాహనాలు, సిబ్బంది ప్రవేశం

​54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లుస్నానాలు, లడ్డూ ఏటీఎంలు

​మూడు షిఫ్టుల్లో 5,000 మందికి పైగా సిబ్బంది సేవలు.

నిరంతర అన్నప్రసాదం-
​నూతన పూజా మండపంలో ప్రత్యేక పూజలు –
తొలి రోజు ఉదయం 8:00 గంటల నుండి సర్వదర్శనం

ప్రజాభూమి ప్రతినిధి,​ఇంద్రకీలాద్రి:
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుండి ప్రారంభం కానున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు దేవస్థానం అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేసి సర్వసన్నద్ధమైంది.“సామాన్యభక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత ” లక్ష్యంతో చేపట్టిన సమగ్ర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ గురువారం ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.

దర్శన విధానం – ఉచిత దర్శనమే ప్రధాన లక్ష్యం:​సామాన్య భక్తులకు ప్రాధాన్యం: ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ. 100, రూ. 300, రూ. 500 దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశాము. క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పించబడుతుంది.

*​రూ. 1,000 శీఘ్ర దర్శనం *ఎక్కువ సమయం క్యూలైన్లలో నిలబడలేని భక్తుల సౌకర్యార్థం రూ. 1,000 శీఘ్ర దర్శన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాము. అధికారిక పోర్టల్ మరియు ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్ వద్ద గల టిటిడి స్థలం నుండి దేవస్థాన వాహనాల ద్వారా ఓం టర్నింగ్ వద్దకు చేరవేసి, ప్రత్యేక క్యూ మార్గంలో దర్శనంకు అనుమతిస్తారు.
పూజ టిక్కెట్లు గల భక్తులు పూజ అయిన తరువాత రథం సెంటర్ ఫ్లైఓవర్ క్రింద గల ఫుట్ బ్రిడ్జి (Foot Bridge) మీదుగా కాలువ ఒడ్డుకు చేర్చి, అక్కడ సిద్ధంగా ఉండే వాహనాల్లో కుమ్మరిపాలెం కేంద్రానికి చేరుకోవచ్చు.

​ప్రోటోకాల్ వేళలు:వీఐపీ మరియు ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 06:00 నుండి 08:00 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం రద్దీ తీవ్రతను బట్టి రాత్రి 08:00 నుండి 10:00 గంటల మధ్య మరో విడత దర్శన ఏర్పాట్లు ఉంటాయి. ప్రోటోకాల్ ప్రముఖులు వారికి కేటాయించిన సమయాల్లోనే విచ్చేసి సహకరించాలి.

​తొలి రోజు దర్శనాలు:ఉత్సవాల తొలి రోజైన అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నాడు వేకువజామున శ్రీ కనకదుర్గ అమ్మవారికి శాస్త్రోక్తంగా విశేష స్నపనాభిషేకం, దివ్య అలంకార పూజలు నిర్వహించనున్నారు.అభిషేక క్రతువులు ముగిసిన అనంతరం ఉదయం 08:00 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

​* రద్దీ నియంత్రణ – క్యూలైన్లు, హోల్డింగ్ కేంద్రాలు & ప్రత్యామ్నాయ ప్రణాళిక*​క్యూ మార్గం: ఉత్సవాల ప్రారంభం నుండి వినాయక టెంపుల్, కెనాల్ రోడ్డు, టోల్‌గేట్ మీదుగా భక్తులను అనుమతిస్తారు. రద్దీ పెరిగిన తర్వాత వన్ టౌన్ వినాయక గుడి నుంచే ప్రవేశం ఉంటుంది. వినాయక మందిరం నుండి సుమారు 1,650 మీటర్ల పొడవున క్యూలైన్లు నిర్మించారు. ఈ మార్గంలో ఒకేసారి 8,500 మంది వేచి ఉండవచ్చు.​వర్షాలు వస్తే ప్రత్యామ్నాయం: వర్షాలు లేదా అత్యవసర పరిస్థితులతో టోల్‌గేట్ మార్గాన్ని మూసివేయాల్సి వస్తే, భక్తులను కనకదుర్గానగర్ మీదుగా మహామండపం ర్యాంపునకు మళ్లించే ప్రత్యామ్నాయ ప్రణాళిక దేవస్థానం వద్ద సిద్ధంగా ఉంది. దీని ద్వారా అదనంగా మరో 500 మందితో కలిపి మొత్తం 9,000 మందిని నిలిపి ఉంచవచ్చు.

​మూడు భారీ హోల్డింగ్ ప్రాంతాలు:దూరప్రాంతాల నుండి రైళ్లు, బస్సుల్లో వచ్చే భక్తుల కోసం సీతమ్మవారి పాదాల వద్ద, విద్యుత్ శాఖ–నగరపాలక సంస్థ కార్యాలయాల పరిసరాల్లో, పాత పూల మార్కెట్ ఖాళీ చేసిన రైల్వే స్థలంలో 3 హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని 70 కంపార్ట్‌మెంట్లుగా విభజించి, ఒకేసారి 18,000 మంది వేచి ఉండేలా తీర్చిదిద్దారు. ఇక్కడ 70 సీసీ కెమెరాలు, పెద్ద తెరలు, మైకులు ఏర్పాటు చేశారు. పోలీసులు, దేవస్థాన సిబ్బంది సమన్వయంతో భక్తులను విడతలవారీగా క్యూ మార్గంలోకి అనుమతిస్తారు.నిరీక్షిస్తున్న భక్తులకు తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు, అల్పాహారం నిరంతరం అందిస్తారు.

​భద్రతకు సాంకేతిక బలం – రవాణా వ్యవస్థ:​బూమ్ బారియర్లు & తనిఖీలు: కొండపైకి అనుమతి లేని ప్రైవేటు వాహనాలు రాకుండా బూమ్ బారియర్లు ఏర్పాటు చేశారు. ఓం టర్నింగ్ వద్ద ముఖ గుర్తింపు (Facial Recognition), క్యూఆర్ కోడ్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థ ద్వారా సిబ్బంది గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

​రవాణా సౌకర్యం:భక్తుల కోసం 8 దేవస్థాన బస్సులతో పాటు మినీ బస్సులు, టెంపోలు నిరంతరం రాకపోకలు సాగిస్తాయి. దివ్యాంగులకు ఉచిత రవాణా వాహనాలు అందుబాటులో ఉంటాయి.

నిత్య నివేదనల సమయాలు (ఆలయ ఆచారం ప్రకారం):​

అమ్మవారికి నివేదనలు సమర్పించే క్రింది సమయాలలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలపబడతాయి:

​ఉదయం 03:00 నుండి 03:15 గంటల వరకు – బాలభోగ నివేదన
​ఉదయం 06:00 నుండి 06:15 గంటల వరకు – ప్రాతఃకాల నివేదన
​ఉదయం 10:30 నుండి 10:45 గంటల వరకు – రాజభోగ నివేదన
​మధ్యాహ్నం 12:00 నుండి 12:15 గంటల వరకు – పంచ హారతి నివేదన
​సాయంత్రం 04:00 నుండి 04:15 గంటల వరకు – విశేష భోగ నివేదన
​సాయంత్రం 06:00 నుండి 07:00 గంటల వరకు – మహా నివేదన మరియు పంచహారతులు

​ప్రత్యేక పూజా సేవల సమయాలు

​ప్రత్యేక ఖడ్గమాలార్చన: కొండపై గల నూతన పూజా మండపంలో ప్రతిరోజూ తెల్లవారుజామున 04:00 నుండి 05:00 గంటల వరకు జరుగుతుంది.
​ప్రత్యేక కుంకుమార్చన: ప్రతిరోజూ రెండు విడతల్లో జరుగుతుంది (మొదటి విడత: ఉదయం 06:00 – 08:00, రెండవ విడత: ఉదయం 09:00 – 11:00). (తొలి రోజు అక్టోబర్ 11న స్నపనాభిషేకం దృష్ట్యా ఒక విడత మాత్రమే నిర్వహించబడుతుంది).
​ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన: నూతన పూజా మండపంలో ప్రతిరోజూ ఉదయం 08:00 నుండి 11:00 గంటల వరకు శాస్త్రోక్తంగా జరుగుతుంది.
​ప్రత్యేక చండీ హోమం: ఆలయ యాగశాలలో ప్రతిరోజూ ఉదయం 09:00 నుండి 11:00 గంటల వరకు వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతుంది. పూజల అనంతరం కనక దుర్గా నగర్, రధం సెంటర్ ఫ్లై ఓవర్ క్రింద ఏర్పాటు చేసిన ఫుట్ బ్రిడ్జి నుండి కెనాల్ గోడ వద్ద ఏర్పాటు చేసిన వాహనాల్లో పూజా భక్తులు కుమ్మరి పాలెం సెంటర్ చేరుకునే ఏర్పాటు ఉంది.

  • దాహం, ఆకలి తీర్చేలా ఏర్పాట్లు – పారిశుద్ధ్యం

​అన్నప్రసాదం: నూతన అన్నదాన భవనంలో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సౌకర్యం ఉంది. రోజుకు 10 వేల నుండి 15 వేల మందికి పైగా ఉదయం అల్పాహారం (ఉప్మా, పొంగలి, దద్దోజనం), మధ్యాహ్నం మరియు రాత్రి వేళల్లో నిరంతరం శుచికరమైన అన్నప్రసాదం వడ్డిస్తారు.

​లడ్డూ ప్రసాదం:

మొత్తం 18 కౌంటర్లు ఏర్పాటు చేయగా, అందులో 4 కౌంటర్లలో ఆన్‌లైన్ బుకింగ్/క్యూఆర్ కోడ్ విధానం ద్వారా, 14 కౌంటర్లలో నేరుగా ప్రసాదం అందజేస్తారు. ప్రస్తుతం ఉన్న ఒక లడ్డూ ఏటీఎంకు అదనంగా మరో మూడు యంత్రాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నారు.

​తాగునీరు & పారిశుద్ధ్యం:

క్యూ మార్గాలు, హోల్డింగ్ కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, కొండపై కలిపి 54 ప్రాంతాల్లో తాగునీటి ఏర్పాట్లు చేశారు. వాటర్ క్యాన్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తారు. వివిధ ప్రాంతాల్లో 370 మరుగుదొడ్లు, 600 జల్లుస్నానాలు (షవర్లు), దుస్తులు మార్చుకునే గదులు, కేశఖండనశాలలు ఏర్పాటు చేశారు.

​ధర్మ ప్రచారం:
ప్రతిరోజూ ఉదయం నుండి రాత్రి వరకు కళావేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు, సాయంత్రం 04:00 గంటలకు పురవీధులలో శ్రీ మల్లేశ్వర స్వామి వారి దివ్య నగరోత్సవం వైభవంగా జరుగుతాయి.

​* నిరంతర సేవల్లో వేలాది మంది సిబ్బంది:*

​దేవస్థానం, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కలిపి 5,000 మందికి పైగా సిబ్బంది మూడు షిఫ్టుల్లో 24 గంటలు నిరంతరాయంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.​భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ, క్రమశిక్షణతో నిర్దేశిత మార్గాల్లో మాత్రమే రాకపోకలు సాగించి ప్రశాంత వాతావరణంలో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article