*మేం విద్యాధికులను నిలబెట్టాం…
- వాళ్లు విధ్వంసకారులను ఎంపిక చేశారు
ట్రిబుల్ ఇంజన్ సర్కారుతో ట్రిబులింజన్ వేగంతో అభివృద్ధి
ప్రజాస్వామ్య పునాదులను మరింత బలపరిచేలా స్థానిక ఎన్నికల ఫలితాలు
అన్ని వర్గాలకూ చోటు కల్పిస్తూ అభ్యర్థుల ఎంపిక… బీసీలకు అత్యధిక ప్రాధాన్యత
నాడు పులివెందులలో నామినేషన్లు వేయనీయలేదు… నేడు కుప్పం, పిఠాపురంలో స్వేచ్ఛగా నామినేషన్లు
-మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో నాడు-నేడు వైసీపీ అరాచకాల వీడియోలను ప్రదర్శించిన ముఖ్యమంత్రి
ప్రజాభూమి ప్రతినిధి,అమరావతి:* స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుందని… స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలిస్తే అభివృద్ధి దూసుకెళ్తుందని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలకు అందించి… ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపికలో ఎన్నడూ లేనంత కసరత్తు చేస్తున్నామని తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు చేశామో… గ్రామీణ స్థానిక ఎన్నికల్లోనూ అదే స్థాయిలో కసరత్తు చేస్తామని తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో ఆయారాం… గయారాం సంస్కృతికి చెల్లు చీటీ పాడి మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం తెచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభీష్టానికి ప్రాధాన్యమిస్తూ సోషల్ రీ-ఇంజనీరింగ్ చేపట్టామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 63.6 శాతం స్థానాలు కేటాయించగా, ఒక్క బీసీలకే 35 శాతానికి పైగా సీట్లు ఇచ్చి పెద్దపీట వేశామన్నారు. విద్యావంతులు, యువత, మహిళలు, పార్టీకి సేవలందించిన వారికే టికెట్లు ఇచ్చామని, ఒక్కో మేయర్ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించామని వెల్లడించారు.
విద్యావంతులు వర్సెస్ గంజాయి బ్యాచ్
ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ గంజాయి బ్యాచ్ వర్సెస్ విద్యావంతులు అన్నట్టుగా ఉందని టీడీపీ అధినేత అన్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు ఒకే తాటిపై ఉంటేనే అభివృద్ధి ముమ్మరంగా సాగుతుందని, ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసేందుకు స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు. కూటమి పార్టీలది ప్రజాస్వామ్య అజెండా అయితే… గొడ్డలి పార్టీది హింసే విధానమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే.. దాన్ని అడ్డుకునేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గడిచిన ఎన్నికల్లో ఘోర ఓటమి చెందినా బుద్ది తెచ్చుకోని గొడ్డలి పార్టీ స్థానిక ఎన్నికల్లోనూ వినాశనానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గొడ్డలి సంస్కృతి, హింస, నేరప్రవృత్తి వంటివి నాటికీ నేటికీ ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెంగళూరు నుంచి వచ్చి, 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి, ఎస్ఈసీ వద్దకు వెళ్లి సొంత ఛానెళ్లతో లైవులు పెట్టించుకుని తిరిగి బెంగళూరు వెళ్లిపోయారన్నారు. ఎక్కడ ఉంటాడో తెలియకుండా మాఫియాను నడిపించిన దావూద్ ఇబ్రహీం తరహా మనస్తత్వంతో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంగళూరులో ఉంటూనే ఇక్కడ అరాచకాలు సృష్టిస్తూ, అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డిని చంపి తనపై నెపం నెట్టినట్లే, ఇప్పుడు కూడా తమ పార్టీ చేసిన హింసకు తనను బాధ్యుణ్ణి చేస్తూ ఆరోపణలు చేశారని… ఇప్పుడు గొడ్డలి పార్టీ అరాచకాలు చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని విమర్శించారు.
నా డిక్షనరీలో హింస అనేదే లేదు…
కార్లతో మనుషులను గుద్దించడం, తొక్కించడం వంటి అరాచకాలకు తెగబడుతూ నేరస్తులను తయారు చేసే ఫ్యాక్టరీలా గొడ్డలి పార్టీ మారిందని ముఖ్యమంత్రి అన్నారు. రప్పా రప్పా రాజకీయాలు చేస్తూ కరుడుగట్టిన నేరాలను ప్రోత్సహిస్తున్నారని… మంచి వారిని కూడా నేరస్తులుగా మార్చడమే ఆ పార్టీకి అలవాటని ధ్వజమెత్తారు. జెన్-జీ యువతకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన లేకుండా, వారిని పావులుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన అవినీతి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జెన్-జీ అంటున్నారని విమర్శించారు. గొడ్డలి పార్టీ చేసిన అకృత్యాల నుంచి జెన్-జీ కాపాడాలా..? అని ప్రశ్నించారు. జెన్-జీలకు మేలు చేసే ఆలోచనలు చేయడం లేదని… కానీ వారిని పావులుగా ఉపయోగించుకునేలా గొడ్డలి పార్టీ ఆలోచన చేస్తోందన్నారు. హింస అనేది తన జీవితంలోనే లేదని, అయితే రౌడీలను చూసి భయపడేది లేదని, దాడులు బెదిరింపులను ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రానికి చాలా ముఖ్యమని, హింసను అరికట్టి నేరస్థులను దూరంగా పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
నాడు అధికార దుర్వినియోగం… నేడు దాడులు
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ ఏకగ్రీవాలతో పాటు ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు సంబంధించిన వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. రాజకీయాలే ప్రజల తలరాతలను మారుస్తాయని, మంచి నేతలను ఎన్నుకుని మంచి ప్రభుత్వాలను కొనసాగించుకోవాలని సీఎం ఆకాంక్షించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేయించుకుందని గణాంకాలతో సహా వివరించారు. 2014లో ఎంపీటీసీ ఏకగ్రీవాలు కేవలం 2 శాతం, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు 0.09 శాతంగా ఉంటే… గత వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగంతో ఎంపీటీసీ స్థానాల్లో 24 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 19 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడానికి నాడు ఓ చట్టాన్ని తెచ్చారని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల ఇళ్లల్లో దొంగతనంగా మద్యం బాటిళ్లు పెట్టించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పులివెందుల వంటి చోట్ల నామినేషన్లను వేయనీయలేదని, నాటి అక్రమాలపై అప్పటి ఎస్ఈసీ ప్రశ్నిస్తే ఆయన్నే తప్పుపట్టారని గుర్తుచేశారు. ఆఖరికి అప్పటి ఎస్ఈసీ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. అదే నేడు కూటమి పాలనలో కుప్పం, పిఠాపురం, పులివెందుల సహా అన్ని ప్రాంతాల్లో వైసీపీ సహా వివిధ పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని, వైసీపీ హయాంలో ఇన్ని నామినేషన్లు పడిన దాఖలాలు లేవన్నారు.
చెప్పాం… చేస్తున్నాం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్‌తో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తాను కలిసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, ఇది అతిపెద్ద డిబిటి ప్రోగ్రామ్ అని కొనియాడారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’తో పాటు అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చామని, రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో భూములను దోపిడీ చేయాలని చూశారని, ప్రజల ఆస్తులపై నాటి సీఎం తన బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. దేవుళ్లను, దేవాలయాలను నాటి పాలకులు అపవిత్రం చేసి ప్రసాదాన్ని కల్తీ పదార్థాలతో తయారు చేయిస్తే, ప్రస్తుతం ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చంద్రబాబు వివరించారు. డేటా సెంటర్ల నుంచి డిఫెన్స్ ప్రాజెక్టుల వరకు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. 2029 నాటికి 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల నీటి వివాదాలకు చెక్ పడుతుందని స్పష్టం చేశారు. గతంలో పట్టణాలు, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను క్లియర్ చేసి స్వచ్ఛాంధ్ర ద్వారా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామన్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

