ప్రజాభూమి, కృష్ణా బ్యూరో: మచిలీపట్నం నగర పాలక సంస్థకు నవంబరు ఒకటవ తేదీన జరగబోయే మేయర్ పదవికోసం ఐదుగురు మహిళలు పోటీ పడుతున్నారు. మేయర్ పదవిని ఎన్నికల సంఘం బీసీ మహిళకు కేటాయించింది. మేయర్ పదవికోసం 12 మంది నామినేషన్లు వేయగా అందులో ఏడుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, పోటీలో ఐదుగురు ఉన్నారు.
కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఒక్కటై చివరకు తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అబీదాను మేయర్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎంపిక చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా లంకా జ్యోతి, కాంగ్రెసు అభ్యర్థినిగా షేక్ రహీమున్నీసా, స్వతంత్ర అభ్యర్థినులుగా అక్తర్ జమానీబేగం, షేక్ ఫాయిజున్నీసా పోటీ చేస్తున్నారు. జనసేన, బీజేపీ పార్టీలు తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిని బలపరుస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇతర ఏ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే ప్రచారం చేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది.
అర్దబలం, అంగబలం వున్న కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నగరంలో వున్న 60 డివిజన్లలో పోటీ చేస్తున్న డివిజన్ అభ్యర్థులతో కలసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అరవై డివిజన్లలో వందలాది మంది జెండాలు చేబూని ప్రచారం చేస్తున్నారు. మైకుల హోరు ఒక పక్కన, మరో పక్కన ప్రచార నినాదాలతో నగరం మారుమ్రోగుతోంది. ఒక విధంగా ప్రచారంలో కూటమి ముందు వుంది. వాహనాలు, ఆటోలు, రిక్షాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లను అలంకరించినవి ఇంటింటికీ తిరుగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి అయిన అబ్దుల్ అబీదాతోపాటు మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల జగన్నాధరావు, బండి రామకృష్ణ, ఎంపీ బాలశౌరి, పంతం వెంకట గజేంద్రరావులతోపాటు గోపు సత్యనారాయణ, కుంచే నానితోపాటు నగరానికి చెందిన నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ ప్రచారంలో ఏ డివిజన్‌కు వెడితే ఆ డివిజన్‌కు చెందిన పోటీ చేసే తమ అభ్యర్థితోపాటు ప్రచారం చేస్తున్నారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మేయర్ అభ్యర్థి అయిన లంకా జ్యోతి సూరిబాబుతోపాటు ఆమె భర్త సూరిబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)తోపాటు పలువురు మాజీ నాయకులు కూటమి ప్రచారానికి ఏ మాత్రం తగ్గకుండా నగరంలోని అన్ని డివిజన్లలో తమ డివిజన్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓట్లు తమకు వేసి ఆశీర్వదించవలసిందిగా ముకుళిత హస్తాలతో కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థినిగా షేక్ రహిమున్నీసా పోటీ చేస్తున్నా ఆమె ప్రచారం అంతంత మాత్రంగానే వుంది. ఆమె పోటీలో వున్నా ఎన్ని ఓట్లు రాబట్టుకుంటుందో చూడాలి? వాస్తవంగా మచిలీపట్నం నగరంలో కాంగ్రెస్ పార్టీకి బలం వుంది. కార్యకర్తలు, అభిమానులు వున్నారు. జిల్లాలో ఆ పార్టీని బలోపేతం చేసే నాయకత్వం అంతగా లేదు. ముఖ్యంగా ఆ పార్టీకి నిధుల కొరత వుంది. ఎన్నికల ఖర్చును భరించగలిగే స్తోమత వున్నట్లయితే గట్టి పోటీనే ఇవ్వగలదు.
మేయర్ అభ్యర్థులుగా మరో ఇద్దరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. అక్తర్ జమానీబేగం, షేక్ ఫాయిజున్నీసా కూడా ముస్లింలు కావటం విశేషం. ఈ ఎన్నికలకు మేయర్‌గా నలుగురు ముస్లిం మహిళలు పోటీ చేస్తున్నారు. గనుక, కూటమి మేయర్ అభ్యర్థిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అబీదాకు ముస్లింలు ఏ మేరకు ఓటు వేస్తారో చూడాలి. ముస్లీం ఓట్లలో కొంత మేర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వున్నట్లు తెలుస్తున్నది!
మచిలీపట్నం నగర పాలక సంస్థకు 60 డివిజన్లు వున్నాయి. ఆ డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది పోటీ చేస్తున్నారు. కూటమిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కార్పొరేటర్లుగా 40 మంది, జనసేనకు చెందిన వారు 18 మంది, బీజేపీకి చెందిన వారు ఇద్దరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 8 మంది, స్వతంత్రులు 13 మంది పోటీ చేస్తున్నారు. పోటీలో కూటమికి చెందిన వారు 7గురు రెబల్స్‌గా పోటీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.



