(నందం రామారావు)
మచిలీపట్నం నగర పాలక సంస్థకు ఊహించినట్లుగానే కూటమి అధికారంలోకొచ్చింది. మేయర్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అబీద అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు 48 మంది గెలిచారు. టీడీపీకి చెందినవారు 34 మంది, జనసేనకు చెందిన వారు 13 మంది, బీజేపీకి చెందిన వారు ఒక్కరు గెలిచారు.
నగర పాలక సంస్థకు 60 మంది కార్పొరేటర్లలో కూటమికి చెందిన వారు 48 మంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 9 మంది, స్వతంత్రులు ముగ్గురు మొత్తం 60 మంది కార్పొరేటర్లు మచిలీపట్నం నగర పాలక సంస్థ అభివృద్ధికి మేయర్ కూడ పూర్తిగా పనిచేయవలసి వుంటుంది. ఈ నేపథ్యంలో మేయర్‌తోపాటు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవలసివుంది.
ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవికోసం కూటమిలోని పలువురు సీనియర్ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభంజనాన్ని ఎదిరించి గెలిచిన వారిలో కూటమికి చెందిన వారు పినిశెట్టి ఛాయాదేవి, అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, సమతా కీర్తి వున్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా వారు విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవికోసం సీనియర్లు అయిన కొట్టే వెంకట్రావు (జనసేన), పినిశెట్టి ఛాయాదేవి (జనసేన), గీత్‌చరణ్ (జనసేన – మొదటిసారి ఎన్నిక), తెలుగుదేశం పార్టీకి చెందిన అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, సమతా కీర్తి, బీజేపీకి చెందిన ఏకైక మహిళ పంతం వెంకట మహాలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
తెలుగుదేశం పార్టీకి చెందిన అబ్దుల్ అబీద మేయర్‌గా ఎన్నికయ్యారు గనుక, డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు చెందినవారు 17 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన అబీద మేయర్‌గా వున్నారు గనుక జనసేనకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆ రీత్యా తమ పార్టీకి చెందిన వారిలో ఒకరికి తప్పనిసరిగా డిప్యూటీ మేయర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ జనసేన శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్, డిసిఎం చైర్మన్ బండి రామకృష్ణలు తమ పలుకుబడిని ఉపయోగించి డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇప్పించాలని కోరుతున్నారు.
ఇక బీజేపీకి చెందిన పంతం వెంకట మహాలక్ష్మికి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని ఆ పార్టీలోని జిల్లా నాయకులు పట్టుబడుతున్నారు. కూటమిలో తమ భాగస్వామ్యం వున్నా తమ పార్టీకి తగిన గుర్తింపు ఇవ్వటంలేదని, ఇప్పుడు అవకాశం వచ్చింది గనుక ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురుకయినా కేంద్ర ప్రభుత్వంలో చిన్న పదవి కూడా ఇవ్వలేదని, పార్టీని నమ్ముకుని సంవత్సరాల తరబడి నిస్వార్థంగా పని చేస్తున్న సీనియర్లను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అసంతృప్తి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుల్లో వుంది.
మచిలీపట్నం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీకే దక్కేవిధంగా ఆ పార్టీలోని సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళకు కేటాయించినట్లయితే సమతా కీర్తికి ఇవ్వాలని, మగవారికిచ్చే పక్షంలో దింటకుర్తి సుధాకర్ లేదా అన్నం ఆనంద్ కు ఇవ్వాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన దింటకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్‌కు ఆ పదవి ఇవ్వాలని తన ప్రయత్నాల్లో వున్నట్లు తెలుస్తున్నది.
ఒకే పార్టీకి (తెలుగుదేశం) చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో వుంటే పరిపాలన, నగర అభివృద్ధి త్వరితంగా జరుగుతుందన్న వాదన ఆ పార్టీలోని వారు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదే గనుక నిజమయితే ఇది వితండవాదనే!
భాగస్వామ్య పార్టీగా జనసేన వుంది గనుక, ఆ పార్టీని గౌరవించుకోవలసిన అవసరం వుందన్న అభిప్రాయం ఆ పార్టీలోని వారికి వుంది. ఏది ఎలా వున్నా మేయర్ పదవి మైనార్టీకి దక్కింది గనుక డిప్యూటీ మేయర్ పదవి ఓ.సికి గానీ ఎస్సీలకు గానీ కేటాయించాలని పలువురు కోరుతున్నారు.







