Wednesday, December 31, 2025

Creating liberating content

రాజకీయాలుఒకనాడు కాం..గ్రేస్..నేడు కామ్..గ్రెస్..!

ఒకనాడు కాం..గ్రేస్..నేడు కామ్..గ్రెస్..!

(నాడు ఉప్పు సత్యాగ్రహం..
నేడు జనాగ్రహం..!)

(కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం)

1885..డిసెంబర్ 28..
అంటే సరిగ్గా 140 ఏళ్ల క్రితం..

ఒక చారిత్రక ఘట్టం..
బానిసత్వంలో మగ్గుతున్న
భారతజాతి పాలిట
గొప్ప ఆశాజ్యోతి..
మహనీయులు..గొప్పగొప్ప
పోరాట యోధులకు
అనువైన వేదిక..

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం..
ఎవరు ఔనన్నా..కాదన్నా..
కాంగ్రెస్ భారత దేశ నాగరికతలో..సంస్కృతిలో..
అభివృద్ధిలో అత్యంత కీలకమైన వ్యవస్థ..
స్వతంత్ర సాధనకు
బహువిధ వేదిక..
మన రక్తం..మన జీవనాడి..!

భారతదేశం స్వరాజ్యం సాధించిన తర్వాత కాంగ్రెస్ ప్రతినిధిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్య బాధ్యతలు చేపట్టి దేశాన్ని
అభివృద్ధి పథం వైపు నడిపారన్నది నిస్సందేహం.
ఆనాడు పడిన మొదటి అడుగులనే అనుసరిస్తూ
తర్వాత ప్రధానులు దేశాభివృద్ధిని పరుగులు పెట్టించారు.ఆ అందరి కృషి ఫలితమే నేడు మనం ప్రయంచంలోనే అగ్రగామి దేశంగా అవతరించాం..

నెహ్రూ జమానా తర్వాత కొన్ని పరిణామాల కారణంగా
కాంగ్రెస్ పార్టీ చీలిపోయి
ఇందిరా గాంధీ నాయకత్వంలో
ఇందిరా కాంగ్రెస్ ఆవిర్భావం జరిగిన పరిణామం మనందరికీ తెలిసిందే..దాంతో ముందు నుంచి మనకి తెలిసిన కాంగ్రెస్
నిద్ర పోయింది..అయితే జనం మాత్రం ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీనే అసలు సిసలు కాంగ్రెస్ గా గుర్తిస్తూ వచ్చారు..
ఇదంతా చరిత్ర..!.

ఇప్పుడు ఆ కాంగ్రెస్
పరిస్థితి ఏంటి..

దేశంలో నెహ్రూ/గాంధీ కుటుంబం ఆధిపత్య శకం పూర్తి కానుందా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..స్వతంత్రం భారత దేశంలో ఆరుగురు ప్రధానులను ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడిక అధికారికంగా
అవసానదశకు
చేరుకుంటున్నట్టేనా..

గత రెండున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మహారాజ్నిగా వెలిగిపోయిన
సోనియా గాంధీ త్వరలో రాజకీయాలకు అల్విదా చెప్పనున్నారు.కొందరి దృష్టిలో ఇప్పుడు కాంగ్రెస్ చేవ చచ్చిన సంస్థే కావచ్చు ..
మళ్లీ తేరుకుని పూర్వ వైభవం తెచ్చుకునే సత్తా కోల్పోయిన పార్టీ అయి ఉండవచ్చు..కానీ కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ..
ఇందిర..రాజీవ్ తర్వాత
అంతటి అపూర్వ వైభోగాన్ని
అనుభవించి భర్త రాజీవ్ మరణానంతరం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఇంటా బయటా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని కాంగ్రెస్ అనే ఒక మహాసంస్థ ఊపిరి ఆగిపోకుండా కాపాడుతూ వచ్చిన నేతగా సోనియా గాంధీని అభివర్ణించక తప్పదు.

రాజీవ్ అకాల మరణం తర్వాత ఇక నెహ్రూ/గాంధీ శకం ముగిసిపోవడం తధ్యం అనే ఊహాగానాలు బలంగా వినిపించిన దశలో..అప్పటికే
అత్త ఇందిర ..మరిది సంజయ్..భర్త రాజీవ్ అనూహ్య పరిస్థితుల్లో మరణించిన నేపథ్యంలో
ఇక సోనియా ఎంతమాత్రం
తన కుటుంబంలో మిగిలి ఉన్న తను..కొడుకు రాహుల్..కుమార్తె ప్రియాంక ప్రాణాలను ఫణంగా పెట్టి
రాజకీయాల్లో కొనసాగే అవకాశం తక్కువని
చాలా మంది భావించారు.
అయితే అలాంటి ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ పివి నరసింహారావు..
సీతారాం కేసరి తర్వాత
సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి 2004లో
అనూహ్య రీతిలో పార్టీని అధికారంలోకి తెచ్చిన
నాయకి..అంతేకాదు..పేరుకి మన్మోహన్ను ప్రధాని చేసినా
ఏలుబడి మొత్తం తన
కనుసన్నల్లోనే జరుగుతోందనే అపప్రద మోస్తూ కూడా 2009 లో మరోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు సోనియా గాంధీ.

ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ చెలాయించినంత ఆధిపత్యం అత్త ఇందిర.. భర్త రాజీవ్ గాంధీకి కూడా
సాధ్యపడలేదన్నది తిరుగులేని నిజం.
ఎందుకంటే ఇందిర..రాజీవ్ హయాంలో ఏదో ఒక దశలో ఎంతో కొంత శ్రేణుల్లో కాని..నాయకుల్లో కాని అసంతృప్తి ఉండేది.కాని సోనియా హయాంలో అలా లేదు.ఆమె పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మొన్న 2014 లో అధికారం కోల్పోయిన వరకు ఆమె సర్వం సహా సామ్రాజ్ఞి..
తిరుగులేని నాయిక..!

సరే..ఈ కోణాలన్నీ పక్కనబెడితే..
సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఎదిగింది
అదే సోనియా నేతృత్వంలో ఇక కోలుకోలేనంత స్థాయిలో పతనాన్ని కూడా చవిచూసింది.గతంలో కూడా కాంగ్రెస్ ఎన్నోసార్లు ప్రాభవాన్ని కోల్పోయిన సందర్బాలు ఉన్నాయి.అయితే ఉక్కు మహిళ ఇందిరా గాంధీ
తన అసాధారణ నాయకత్వ పటిమతో పార్టీకి మునుపటికి మించి వైభవాన్ని తెచ్చిపెట్టారు.
అయితే 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి కోలుకోలేదు..పైగా అంతకంతకూ ప్రతిష్ట కోల్పోతూ వస్తోంది.జాతీయ స్థాయిలో ప్రాభవాన్ని మునుపెన్నడూ లేనంతగా కోల్పోవడమే గాక రాష్ట్రాల్లో ఉనికే మిగలని దుస్థితికి దిగజారిపోయింది.

ఈ పరిస్థితి రావడానికి కూడా ప్రధానకారణం సోనియా నేతృత్వమే.2004-2014 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ ఏలుబడిలో ఆయన్నో దిష్టిబొమ్మగా మార్చి మొత్తం పాలనను తన కనుసన్నల్లో సాగించడం కాంగ్రెస్ పతనానికి..అదే సమయంలో బిజెపి బలోపేతం కావడానికి దారితీసింది.
పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా అద్భుతాలు చేసిన మన్మోహన్ పదేళ్ళ పాలనలో ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయారు.
అదే సమయంలో వరస కుంభకోణాలు..రాష్ట్రాల్లో పాలన అదుపు తప్పి
పార్టీ ఎక్కడికక్కడ బలహీనం అయిపోయింది.

మరో పక్క రాహుల్ గాంధీ
పార్టీ అవసరాలకు..కుటుంబ ప్రతిష్టకు తగినట్టుగా ఎదగలేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది.
ఆయన గమనం ఇంతవరకు దశ దిశ లేనట్టే సాగింది..సాగుతోంది కూడా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం సోనియా రాజకీయ జీవితంలో తీసుకున్న అతి పెద్ద తప్పుడు నిర్ణయంగా మిగిలిపోయింది.
సరే..ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీరిందనుకున్నా ఆ రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని
ఆదరించింది లేదు.ఇక ఆంధ్ర ప్రజలు ఇక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని గాని..సోనియాను గాని క్షమించే పరిస్థితి లేదు.
అలా కంచుకోట వంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నామరూపాలు మిగలనంత భయంకరంగా
మారిపోయింది.

ఏది ఏమైనా వయసు పైబడడం..ఆరోగ్యం సహకరించక పోవడం అన్నవి నిజాలే కనుక సోనియా ఆట
ఇక ముగిసినట్టేనని భావించక తప్పదు.

మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..
వరసగా మూడు ఓటములతో
పార్టీ కుదేలైపోయింది..
సోనియా హవా ముగిసిపోతుండగా రాహుల్ సమర్థంగా అందుకోలేకపోయారు..
ఇన్నాళ్లు..ఇన్నేళ్లు ఒకే కుటుంబాన్ని నమ్ముకుని ఉండిపోయిన పార్టీ మరో నాయకున్ని తయారు చేసుకోలేకపోయింది.
రాహుల్ ఏదీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించరు..

మరి కిం కర్తవ్యం..
అధికారం సరే..సభల్లో కనీసం సమర్ధవంతమైన
ప్రతిపక్షంగా కూడా వ్యవహరించలేకపోతున్న
కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిపోతుందని కాదు గాని..మరి తేరుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదన్నది
నిపుణుల అభిప్రాయం..

నూట నలభై చూసింది..
నూట యాభై నాటికి
ఉనికిని నిలబెట్టుకోవడం
నాయకత్వం ముందున్న పెద్ద సవాలు..

వినిపిస్తుందా రాహుల్ జీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286
7995666286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article