కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణస్వామి ఆకాంక్ష
అనంతపురము
నొళంబుల చరిత్రను రికార్డు చేయడం అన్నది సిద్ధగిరి శ్రీనివాస్ చేసిన ఒక సాహసోపేతమైన ప్రయత్నం అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ బండి నారాయణస్వామి కొడియాడారు. ఇలాంటి స్థానిక చరిత్రలు రికార్డు చేయబడాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో నిర్వహించిన “నొళంబ వాడి” పుస్తక పరిచయసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మడకశిర ప్రాంతానికి చెందిన రచయిత సిద్ధగిరి శ్రీనివాస్ తన స్థానిక చరిత్రను రికార్డు చేయాలన్న ఒక తలంపులోంచి ఈ గొప్ప చరిత్ర రచన పుట్టుకు వచ్చిందని, అది చరిత్రకు కొత్త చేర్పు అయిందని రచయితను ఆయన అభినందించారు. జిల్లా రచయితల సంఘం అనంతపురం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిచయ సభకు ఆ సంఘం అధ్యక్షులు డా.జెన్నే ఆనంద్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండి నారాయణస్వామి మాట్లాడుతూ, చరిత్ర అధ్యయనం నానాటికి కుంటుపడుతోందని, ప్రతి ఒక్కరూ చరిత్ర అధ్యయనంపై దృష్టి పెట్టాలని అన్నారు. గౌరవ అతిధిగా హాజరైన సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ భాషా మాట్లాడుతూ, సిద్ధగిరి శ్రీనివాసులు సునిసితమైన పరిశీలనా జ్ఞానం ఈ పుస్తక రూపకల్పనకు దారితీసిందని, ఇలాంటి మరెన్నో పుస్తకాల రూపకల్పనకు ఆయన శ్రీకారం చుట్టాలని అన్నారు. ఆత్మీయ అతిథి “ఫర్ ద సొసైటీ చారిటబుల్ ట్రస్ట్” వ్యవస్థాపక అధ్యక్షులు పోతుల రాధాకృష్ణ మాట్లాడుతూ, కవులు తమ రచనలతో ఈ సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారని, యువత ఈ రచనల అధ్యయనం వైపు దృష్టి సారించాలని అన్నారు. మరో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న “అనంత విద్యావంతుల వేదిక” అధ్యక్షులు బండి నాగరాజు మాట్లాడుతూ, మరుగున పడిన చరిత్రను ఎంతో కృషి చేసి వెలుగుపరిచిన సిద్ధగిరి శ్రీనివాస్ ఎందరికో ఆదర్శప్రాయుడైనాడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా పాల్గొన్న అడవాళ శేషగిరి రాయుడు మాట్లాడుతూ, నేడు చరిత్ర కాషాయీకరణలో భాగంగా చరిత్ర అంతా వక్రీకరించబడుతోందని నిక్కచ్చిగా చరిత్రను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని, ఆ పని ఇటీవల కాలంలో సిద్ధగిరి శ్రీనివాస్ చేయగలిగారని కొనియాడారు.
పుస్తక పరిచయ సభకు సమీక్షకుడిగా హాజరైన డాక్టర్ అంకె శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ, సిద్ధగిరి ఈ పుస్తక రూపకల్పనలో పడిన కష్టాన్ని, శ్రమని, ఆయన వెచ్చించిన సమయాన్ని, ఈ క్రమంలో వారి ఓర్పుని వెలకట్టలేమని అన్నారు. ఈ పుస్తకం స్థానిక చరిత్రల రూపకల్పనలో మిగతా ప్రాంతాల ఔత్సాహిక రచయితలకు ఒక ప్రోత్సాహంగా నిలబడుతుందన్నారు. సమీక్ష ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ముగింపు సందర్భంగా రచయిత స్పందనగా సిద్దిగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ “నా ప్రాంతపు చరిత్ర ఆనవాళ్ళను వెతుకుతున్న క్రమంలో నేను రాసుకున్న పుట్ నోట్సే ఈ పుస్తకం. అంతే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదని” వినయంగా ప్రకటిస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చివర్లో అతిధులు పుస్తక రచయితను సత్కరించారు. ఆ తర్వాత రచయిత మిత్రులు, సాహితీ సభల నిర్వాహకులు, శాలువాలు, పూలహారాలతో రచయితను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లలిత కళా పరిషత్ అధ్యక్షులు గాజుల వెంకటసుబ్బయ్య, జిల్లా రచయితల సంఘం గౌరవ సలహాదారులు కంబదూరి షేక్ నబి రసూల్, మధుర శ్రీ, కొత్తపల్లి సురేష్ , కోటిగారి వన్నప్ప, తరిమెల అమర్నాథ్ రెడ్డి గోవిందరాజులు చేగువేరా హరి, జీ.విశ్వనాథ్ రెడ్డి,వలస రమేష్, తలారి రామాంజనేయులు, అడ్వకేట్ చంద్రాచెర్ల హరి, జూటూరు షరీఫ్, షేక్ రియాజుద్దీన్, అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
