- అమాయక ప్రజలను వంచించి దుబాయ్ వరకు లావాదేవీలు కల్గిన మోసగాళ్లు
- ఐదుగురు సైబర్ నేరగాళ్లు అరెస్టు…
- సైబర్ నేరాలలో ఆరితేరిన కింగ్ పిన్ (సూత్రదారి) కోసం అనంత పోలీసుల ముమ్మర గాలింపు
- గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఇటీవల నమోదైన సైబర్ నేరంతో తీగ లాగితే డొంక కదలిన వైనం
- జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్ కనుసన్నలలో మెరుగైన పనితీరు కనబరిచిన జిల్లా పోలీస్ సైబర్ విభాగం సిబ్బంది ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
అమాయక ప్రజలను వంచించి కాజేసిన సొమ్మును దేశ సరిహద్దులు దాటిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను అనంతపురం పోలీసులు ఆటకట్టించారు. మొత్తం ఐదుగురు సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. 16 ఫేక్ అకౌంట్ల ద్వారా రూ. 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించి రూ.14.72 లక్షలు జిల్లా పోలీసులు ఫ్రీజ్ చేయించారు. దేశ వ్యాప్తంగా ఎన్సిఆర్బి పోర్టల్ లో 1,550 ఫిర్యాదులు నమోదు కాగా, వీటిలో లావాదేవీలు అంచనా వేస్తే సుమారు రూ. 350 కోట్ల పైమాటే. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్కైబ్, రేటింగ్ లకు అధిక కమీషన్లు ఇస్తామంటూ మోసాలు, ఆన్లైన్ గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్, ఓటిపి, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ వంటి తరహా సైబర్ మోసాలతో అమాయకులను బురిడీ కొట్టించిన సొమ్మును ఈ ముఠా దుబాయ్ వరకు లావాదేవీలు జరిపినట్లు జిల్లా సైబర్ పోలీసుల విచారణలో వెల్లడైంది. సైబర్ నేరాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తర భారత దేశానికి చెందిన ఓ కింగ్ పిన్ (సూత్రధారి) కోసం జిల్లాకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు రూ.20 లక్షలు కమీషన్ రూపంలో చేరడం గమనార్హం. గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఇటీవల నమోదైన సైబర్ నేరంతో తీగ లాగితే డొంక కదలిన వైనంగా మారి ఈ సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టు చేసింది. శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు మీడియాకు వెల్లడించారు.
అరెస్టు నిందితుల వివరాలు
- మహమ్మద్ సమ్మద్, నాయుడుపేట, తిరుపతి జిల్లా
- వెంకటాచలం, వెంకటగిరి, తిరుపతి జిల్లా
- ఎ.సందీప్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
- అజయ్ రెడ్డి, శింగరాయకొండ, ప్రకాశం జిల్లా
- సంధ్యారాణి, అనంతపురం నగరం
గార్లదిన్నె పోలీసు స్టేషన్లో నమోదైన కేసు వివరాలు
గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈనెల 15వ తేదీన కేసు నమోదయ్యింది. అనిల్ కుమార్ ఐ టీ ఐ వరకు చదువుకున్నాడు. ఇతను అనంతపురం నగరంలో ప్రయివేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తన ఫోన్లో ఇతను టెలిగ్రాం మెసెంజర్ వాడుతున్నాడు. 21-09-23వ తేదీన ఇతని మొబైల్ కు మెసేజీ వచ్చింది. శ్వేతశర్మ పేరున లింక్ కూడా పంపించారు. నీకు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసే ఆసక్తి ఉందా? అని ఆ మెసేజీ సారాంశం. సదరు లింకు ద్వారా నిర్వాణ డిజిటల్ గ్రూపులో యాడ్ అయ్యాడు. ఇతనికి సపరేట్ యూజర్ ఐ.డి కూడా ఇచ్చారు. ఇతని ఉద్యోగం ఏమంటే… యూజర్ ఐ.డి. ద్వారా ఫేక్ పోర్టల్ లో యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ అవతలి వారు పంపిస్తుంటారు. వాటికి సబ్ స్క్రైబ్ చేసి రేటింగ్ ఇవ్వడం. దీనివల్ల అధికంగా కమీషన్ లు ఇస్తామని నమ్మబలికారు. ఆశపడి వారి వలలోకి చిక్కుకున్నాడు. ముందుగా రూ.10 వేలు డిపాజిట్ చేస్తే వీడియోలు పంపిస్తామని చెప్పారు. తన వద్ద డబ్బు లేదని చెప్పినా మేమే చెల్లిస్తామంటూ రూ.10 వేలు కట్టినట్లు భోగస్ ఆధారాలు చూపించారు. అనిల్ కుమార్ నిజమని భావించాడు. సైబర్ నేరగాళ్లు పంపిన వీడియోలను ఇతను సబ్ స్క్రైబ్ చేసి రేటింగ్ ఇచ్చాడు. ఇందుకుగాను రూ.800 కమీషన్ రూపంలో ఇస్తున్నామని అనిల్ కుమార్ అకౌంటులో జమ చేశారు. దీంతో ఇతనికి ఇంకా నమ్మకం ఏర్పడింది. మీకు ఇంకా బాగా కమీషన్ రావాలంటే రూ.10 వేలు కట్టమని సైబర్ నేరగాళ్లు మరొకసారి ఇతనికి సమాచారం పంపారు. అప్పటికే రూ.800 కమీషన్ తీసుకున్న ఇతనికి ఆశ కల్గింది. వారు చెప్పిన విధంగానే పేటిఎం ద్వారా వారు పంపిన యూజర్ ఐ.డి కు రూ.10 వేలు పంపాడు. ఆ తర్వాత వారు వీడియోలు పంపారు. కమీషన్ రూపంలో రూ.2,625 వచ్చింది. మళ్లీ సైబర్ నేరగాళ్లు ఇదే నేరమయ పద్ధతిలో రూ.10 వేలు డబ్బులు పంపమని అడుగుతూ వీడియోలు పంపారు. ఇంకా కమీషన్ ఎక్కువ కావాలనుకుంటే రూ. 50,500 పంపమన్నారు. ఇతను వారిని నమ్మి సదరు డబ్బు పంపాడు. అయితే ఎక్స్క్లుసివ్ డేటా అని చూపించి హోల్డ్ లో పెట్టారు. మరొకసారి రూ.1.50 లక్షలు పంపమని అడుగగా, ఇతను సరే అని సదరు డబ్బును మూడు దఫాలుగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో వేశాడు. అయినప్పటికీ ఎక్స్ క్లూజివ్ డేటా అని చూపించి హోల్డ్ లో పెట్టారు. మళ్లీ ఎందుకు హోల్డ్ లో పెట్టారని ఇతను అడుగగా, మరొకసారి రూ.4.99 లక్షలు పంపాలని, ఇప్పటి వరకు డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి పంపుతామని చెప్పారు. అంత డబ్బు కట్టలేనని తెలియజెప్పడంతో ఇతని ఐ.డి.ను బ్లాక్ చేశారు. ఇతనికి అనుమానం వచ్చి సైబర్ క్రైం పోర్టల్ 1930కు ఫిర్యాదు చేశాడు. ఇదే ఫిర్యాదు ఆధారంగా గార్లదిన్నె పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సీరియస్ గా పరిగణింపు…రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు
ఈ సైబర్ మోసాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ గా పరిగణించి ఈ కేసును వెంటనే ఛేదించాలని ఆదేశించారు. అంతేకాకుండా… తన కనుసన్నలలో ఇద్దరు సి.ఐ. లు అస్రార్ బాషా, షేక్ జాకీర్ (సైబర్)ల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు.
ప్రస్తుత అరెస్టయిన ముఠా నేపథ్యం
ఈ ఐదుగురు కూడా ఉత్తర భారతదేశానికి చెందిన సైబర్ నేరాలకు ఒడిగట్టడంలో కింగ్ పిన్ (సూత్రదారి) అయిన ఓ వ్యక్తి ముఠాలో పని చేస్తున్నారు. వీరు వివిధ బ్యాంకులలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం వీరి పని. అంతేకాకుండా… అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని యూట్యూబ్ యాడ్స్ సబ్ స్కైబ్, రేటింగ్ లకు అధిక కమీషన్లు ఇస్తామంటూ మోసాలు… ఆన్లైన్ గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్, ఓటిపి అండ్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ … తదితర సైబర్ మోసాలకు పాల్పడినప్పుడు వచ్చే డబ్బును ఫేక్ అకౌంట్లలోకి మళ్లించిన సమయంలో 1 శాతం కమీషన్ పొందుతున్నారు. మిగతా మోసం చేసిన సొమ్ము సదరు పిన్ కింగ్ అండ్ కో ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఈ లావాదేవీలు దుబాయ్ వరకు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీ కింద మారుతున్నాయి. ఈ 16 ఫేక్ అకౌంట్లలో 11 నకిలీ కంపెనీల పేరున …మిగతా ఐదు కరెంటు అకౌంట్లు ఉన్నాయి. 16 ఫేక్ అకౌంట్ల ద్వారా రూ. 35.59 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించి రూ.14.72 లక్షలు జిల్లా పోలీసులు ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుండీ మరో 172 ఫెక్ అకౌంట్లలోకి వంచన సొమ్మును మళ్లించారు. వీటిలో జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే సుమారు రూ.350 కోట్లు పైమాటే. ఈ 16 ఫేక్ అకౌంట్లతో పాటు మరో 4 షేవింగ్ అకౌంట్సు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్.సి.ఆర్.బి. పోర్టల్ లో మొత్తం 1550 ఫిర్యాదులు అందాయి. సదరు కింగ్ పిన్ నుండీ ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కమీషన్ రూపంలో రూ.20 లక్షలు అందడం గమనార్హం.
జిల్లా ఎస్పీ కనుసన్నలలో అనంతపురం సైబర్ పోలీసు విభాగం టెక్నికల్ గా డాటా సేకరించి బ్యాంకుల నుండీ, పేటిఎం, వెబ్ సైట్స్ నుండీ కూలంకషంగా సమాచారాన్ని అతి తక్కువ కాలంలో రాబట్టి ఈ ముఠాను అరెస్టు చేయడం విశేషం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారంపై ఈ ముఠాకు సంబంధించిన 16 భోగస్ అకౌంట్లను గుర్తించి ఫ్రీజ్ చేయించారు. నిరుద్యోగ యువత, అమాయక ప్రజల కష్టార్జితాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో సైబర్ నేరగాళ్లు దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఫేక్ అకౌంట్ల ద్వారా వంచించిన సొమ్మును దుబాయ్ లో అమౌంటు విత్ డ్రా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. “సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను, అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలు చేస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్, ఓటిపి అండ్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్ … ఇలా ఎన్నో రకాల సైబర్ మోసాలకు దిగుతున్నారు. అనవసరమైన లింకులను, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించకుండా ఉండాలి. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ ఫోర్టల్ 1930 కు స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి” ఎస్పీ గారు సూచించారు.