గురుకుల పాఠశాలల కార్యదర్శి కృష్ణ మోహన్
లేపాక్షి :-మండల కేంద్రమైన లేపాక్షి లో వెలసిన మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యాభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిందని గురుకుల పాఠశాలల కార్యదర్శి కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పాఠశాల ప్రధానాచార్యులు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు పదవీ విరమణ పొందిన పలువురు గురువులను ఆత్మీయ పలకరింపులతో వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తమకు విద్యను క్రమశిక్షణను నేర్పిన గురువులకు, తాము చదువుకున్న ఈ పాఠశాలకు చాలా రుణపడి ఉన్నామన్నారు. పాఠశాల అభివృద్ధికి తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రధానా చార్యులు ప్రసాద్ మాట్లాడుతూ, పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారమన్దించాలని సూచించారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి కృష్ణ మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాలకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణకు ,విద్యకు విద్యాలయాలు మారుపేరుగా నిలిచాయని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాఠశాల 35 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు నాగేశ్వరరావు, శాంత లక్ష్మీ, రెడ్డప్ప నాయుడు, కేశవులు, పూర్వ విద్యార్థి సంఘం నాయకులు మునయ్య, రామాంజనేయులు, నటరాజ్ లతోపాటు అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.