హిందూపురం టౌన్
హిందూపురం పట్టణంలో రహదారులు చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. పైగా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో పాటు ఆవుల సంచారం కూడా అధికమే. రహదారులపై ఆవుల సంచారంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో జనం అవస్థలకు గురవుతున్నారు. ఆవుల సంచారాన్ని అధికారులు నియంత్రించలేక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. వాహనాలూ అధికమే, వ్యాపారాలన్నీ రహదారులపై కొనసాగుతున్నాయి. ఎవరినీ ఏమి అనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన వాహనాల రాకపోకలతో రహదారులన్నీ జామ్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆవుల సంచారం అధికమైరహ దారిపై అడ్డంగా నిలబడటంతో ట్రాఫిక్ కూడా ఆగిపోవాల్సి వస్తోంది. రోడ్లపై పడుకున్న పశువులు ఒక్కోసారి పోట్లాడి వాహనదారుల పైకి వస్తున్నాడంట ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. పలుమార్లు దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోలేదు అన్న ఆరోపణలు
వ్యక్తమవుతున్నాయి. కౌన్సిల్ సమావేశంలోనూ పలుమార్లు కౌన్సిలర్లు ఆవులతో జరిగే
నష్టం ఇబృందులను లేవనెత్తినా గోశాల కడుతున్నామని, అక్కడకు ఆవులన్నీ చేర్చుతామని చెప్పడమే తప్ప ఆచరణలో చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆవుల యజమానులకు నోటీసులు ఇచ్చి కనీసం హెచ్చరించినా కొంత సమస్య తగ్గేది. అయితే ఆ పని కూడా ఇక్కడి అధికారులు చేయక పోవడంతో ఆవుల సమస్య జఠిలంగా మారుతోంది. రహదారులపైకి వదిలే ఆవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని హెచ్చరికలు జారీ చేస్తే ఏ ఒక్క ఆవు కూడా రహదారిపైకి రాదని కొందరి వాదన. ఈ దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని పశువుల బారి నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.