హిందూపురం టౌన్:పర్యాటకానికి పేరెన్నిక గా ఉంటున్న చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం పంచాయతీలు ప్రస్తుతం వలస పక్షులకు నిలువ నీడ లేకుండా పోయింది. సంతాన ఉత్పత్తి కోసం ప్రతి ఏటా సైబీరియా నుండి ఈ ప్రాంతానికి పక్షులు వలస రావడం ఎన్నో ఏళ్లుగా జరుగుతుంది. ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తే విదేశీ అతిథులు తమ ప్రాంతానికి వచ్చాయని స్థానికులు ఎంతో సంబరపడిపోయేవారు. వలస పక్షులకు అవసరమైన ఆహారం నీరు రక్షణ వంటి సౌకర్యాలను కూడా స్థానికులు ఏర్పాటు చేస్తుండేవారు. అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కారణంగా విదేశీ పక్షులకు నిలువ నీడ లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. సైబీరియన్ పక్షులను రాకుండా చేయాలన్న దురుద్దేశంతో ఏ పుగా పెరిగిన పెద్దపాడు వృక్షాలను అడ్డంగా నరికివేస్తున్నారు. కళ్ళెదుటే ఇంత ఘోరం జరుగుతున్నా అటు పాలకులు ఇటు అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రావ్యక్తమవుతున్నాయి.ప్రతిరోజు వేల టన్నులు జిల్లా నుండి అక్రమ కలప తరలి పోతున్న ఫ్లయింగ్ స్క్వాడ్ జిల్లా అటవీ అధికారులు, రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.

సామిల్లులు, ఇటుక బట్టీలు పరిశ్రమలలో కళ్ళముందే వేల టన్నులు అక్రమ కలప భారీగా నిలువ ఉంటున్న కనీస స్థాయిలో కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. సహజంగా వనరుల అందించే చెట్లను ఈ విధంగా ప్రతిరోజు వేల సంఖ్యలో నరికేస్తుంటే ఏమాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎంతో నమ్మకంగా ప్రజలు అధికారం కట్టబెడితే సహజ సిద్ధంగా ఆహారం, ఆక్సిజన్ , వర్షం, పర్యావరణ సమతుల్యత చేసి సమస్త జీవరాసులకు ఆలవాలమైన చెట్లను అడవులను కళ్ళ ఎదుటే నాశనం చేస్తున్నా పరిపాలకులు చూస్తూ ఉండడమే కాకుండా వారితో కుమ్మక్కై సొమ్ము చేసుకోవడం ఎంతో దారుణమని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర నాయుడు వాపోయారు. అంతేకాకుండా జిల్లా నుండి ప్రతిరోజు కర్ణాటక, గోవా ప్రాంతాలకు పెనుకొండ, కదిరి, గోరంట్ల తదితర ప్రాంతాలలో అక్రమంగా రోడ్డు పక్కన డిపోలు తెరచి ట్రక్కులలో బహిరంగంగా కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలకు కలప అక్రమంగా తరలిస్తున్నా ఏమాత్రం చర్యలు చేపట్టలేదు సరికదా వారికి సహకరిస్తున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. వాల్టా చట్టం అంటూ పాటలు పాడే రెవెన్యూ అధికారులు ఇంత ఘోరం జరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పాపంలో వీరు కూడా భాగస్వాములే. ఏదిఏమైనా జిల్లా ప్రజలకు తీరనినష్టం, అవమానం జరిగింది. కరువు కాటకాలు అలుముకున్నాయి. ప్రకృతి అడవులు ధ్వంసం అయిపోయాయి. సమస్త జీవరాసుల జీవనవిధానం దెబ్బతింది. ఇందుకు కారణం ప్రజలు ప్రశ్నించకపోవడమే, అందుకే ఈ పర్యవసానాన్ని ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. వర్షాలులేక, నీరు దొరక్క పట్టణాలు సైతం ఖాళీచేసే పరిస్థితి. పంటలు పండక, కరువుజిల్లాలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ఇందుకు కారకులైన అవినీతి అధికారుల నుండి నష్ఠానికి సొంత నిధుల ద్వారా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తు కాలంలో ఈ జిల్లాకు మరింత తీరని నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరచి కరువు జిల్లా ప్రజలను, సమస్తజీవరాసులను కాపాడాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే దేశంలో రెండవ కరువు జిల్లా మొదటి కరువు జిల్లాగా మారగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


