-వరుసగా పార్టీని వీడుతున్న నాయకులు
-తాజాగా 50కుటుంబాల వారు టిడిపిలో చేరిక

-ఎమ్మెల్యే సోదరుల తీరుతోనే ఈ చేరికలన్న పరిటాల సునీత
రాప్తాడు;అనంతపురం రూరల్ మండల పరిధిలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా వైసిపి నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం ఉప్పరపల్లి గ్రామంలో పర్యటించగా.. ఆమె సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, ఏ పని చేసినా అందులో అడ్డు తగలడం వంటి పరిణామాలతోనే పార్టీ మారుతున్నట్లు నాయకులు తెలిపారు. పార్టీ కోసం కష్టపడితే తమకే అన్యాయం చేశారంటూ వారు వాపోయారు. తెలుగుదేశం పార్టీ హయంలో ఏ రోజు తాము ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. అలాంటి పార్టీలో ఉండడం కంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మేలన్న అభిప్రాయంతో పార్టీ మారినట్లు చెప్పారు. మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ దందాలతో అనంతపురం రూరల్ మండల పరిధిలో ఎమ్మెల్యే సోదరులు చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావని విమర్శించారు. అందుకే ఆ పార్టీ నాయకులంతా ఎమ్మెల్యే తీరుతో విసిగిపోయి టిడిపిలోకి వస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఎవరైనా సరే పార్టీలోకి వస్తే వారికి అండగా ఉండే బాధ్యత మాది అంటూ సునీత వారికి భరోసా ఇచ్చారు.