ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి
భూమి పూజలు చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని సీతారామకాలనీలో రూ. 23.21 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవీ రాజారమేష్ తో కలిసి సోమవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆర్.ఆర్.పేట వాసులు అత్యధిక మెజార్టీ అందించారని వారి ఆశలను ఎక్కడా వమ్ముచేయకుండా ఈ ప్రభుత్వం పని చేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత నాలుగున్నరేళ్లలో డివిజన్లో రూ. 7 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధానంగా అమరావతి కాలనీ రోడ్లు, పోలీస్ స్టేషన్ రోడ్డు, సబ్ స్టేషన్ రోడ్డు, పద్మావతి ఎన్క్లేవ్ రోడ్డు, భాగ్యలక్ష్మి ఎన్ క్లేవ్ రోడ్డు, గ్రేస్ స్కూల్ రోడ్డు, మస్జీద్ రోడ్డు, యాదవుల బజారు రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఎదురు 9 రోడ్లకు యూజీడీ, వాటర్ లైన్ పనులు ఇప్పటికే పూర్తి చేసుకోగా రూ. కోటి నిధులతో రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. కేర్ అండ్ షేర్ స్కూల్లో రూ. 2 కోట్ల నాడు-నేడు నిధులతో చేపట్టిన 14 అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గడపకు అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాళ్ల ఆదినారాయణ, పఠాన్ నజీర్ ఖాన్, శ్రీను, ప్రేమ్, బాల, మౌలాలి, ఆలీ, బాజీ, చిట్టెమ్మ, రజియా, ఆశా, ఉత్తమ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.