పోలవరం నియోజకవర్గం టిడిపి కన్వీనర్ బొరగం శ్రీనివాసులు
బుట్టాయగూడెం:
రాజధాని ఫైల్స్ చలనచిత్రంపై న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు అన్నారు. స్థానిక నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో శుక్రవారం బొరగం మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. ఒక సినిమాని చూసి ముఖ్యమంత్రి భయపడటం ఇదే మొదటిసారి అని ఎద్దేవా చేశారు. రైతుల బతుకు చిత్రం సినిమాను అడ్డుకునే నీచ స్థాయికి జగన్ రెడ్డి వెళ్ళటం రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు. సామాజిక బాధ్యతతో ఒక సినిమా తీస్తే జగన్ రెడ్డి కి వచ్చిన నష్టం ఏమిటని, రాష్ట్రానికి రాజధాని కావాలని రైతులు భూములు త్యాగం చేస్తే జగన్ రెడ్డి వాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అజరామరమైన రాజధానిగా అమరావతిని చంద్రబాబునాయుడు నిర్మాణం చేపడితే జగన్ మూడు రాజధానుల పేరుతో దానిని నిర్వీర్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని కొనసాగించాలని రైతులు నిరసన చేస్తే వారి గొంతు నొక్కాలని చూసిన నీచపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. రాజధాని అంటే ఎంతో వైభవంగా ఉండాల్సిన దాన్ని జగన్ రెడ్డి కక్షతో నిర్మాణం ఆపి అభివృద్ది నిరోధకుడుగా మారాడని అన్నారు. జగన్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని వైసిపి నాయకులు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. 5 సంవత్సరాల పాలనా కాలంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ఇప్పుడు మరల విచిత్రమైన మాటలు మాట్లాడటం చూస్తుంటే జగన్ రెడ్డి కి ఓటమి తప్పదని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. జగన్ రెడ్డి ఇంటికి పోయే రోజులు దగ్గర లోనే ఉన్నాయని అన్నారు.