బుట్టాయగూడెం.
మహిళల జీవనోపాధి కార్యక్రమాల అభివృద్ధికి వైయస్సార్ ఆసరా ఎంతగానో వినియోగపడుతుందని పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం వైయస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల మంజూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా వైయస్సార్ ఆసరా నిధులు మహిళలకు అందించారని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి వైయస్సార్ ఆసరా ఎంతగానో సహకరించిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళల అభివృద్ధికి ఎంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయలేదని, ఈ నిధులను సద్వినియోగం చేసుకునే మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. పోలవరం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం సంకేతంగా మారిందని, రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలందరూ మద్దతు పలికి రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగింపుకు సహకరించాలని కోరారు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కితాబునిచ్చారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగా వైఎస్ వైసిపి ప్రభుత్వం నిలిచిందన్నారు. ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ మాట్లాడుతూ మహిళలు తమ వృత్తి వ్యాపారాలలో వైయస్సార్ ఆసరా నిధులను సద్వినియోగం చేసుకొని ఆర్థిక, స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. మండలంలోని 888 సంఘాలలోని 8878 సభ్యులకు రూ.4,48,10,000 లను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం శాంతి రమణ, వైస్ ఎంపీపీలు గుగ్గులోతు మోహన్ రావు, కుక్కల జయలక్ష్మి, జడ్పిటిసి మొడియం రామతులసి, ఏఎంసీ చైర్ పర్సన్ ఆరేటి శాంతకుమారి, సొసైటీ అధ్యక్షుడు ఆరేటి సత్యనారాయణ, వైసీపీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ రావు, వైసీపీ సీనియర్ నేత సయ్యద్ బాజీ, తహసిల్దార్ సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీవో, ఏపీఎం పద్మావతి, ఏరియా కోఆర్డినేటర్ సుబ్బారావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వై ఆర్ పి సిబ్బంది వివో లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మండల సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.