ఎస్కే యూనివర్సిటీలో శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాల్లో వక్తల ప్రశంస

అనంతపురము బ్యూరో:
సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి ఉత్సవాలు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మత సామరస్యానికి అహర్నిశలు పాటుపడిన మహా వ్యక్తి అని, ఆముక్తమాల్యద గ్రంథకర్త, మహాకవి, సంఘసంస్కర్త అని వక్తలు కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్త పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన వైభవం ఎంతో గొప్పదని కొనియాడారు. మతసామరస్యం కోసం ఆయన చేసిన కృషి, ప్రజల బాగోగులు తెలుసుకొనే విషయంలో రాయలవారు ప్రదర్శించిన నేర్పు మొదలైన విషయాలను ఎన్నో ఆయన వివరించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని కొలకలూరి ఇనాక్ తన “మాతృమూర్తి” అని సంబోధించడం కార్యక్రమానికి వన్నె అద్దింది. ఆయన ప్రసంగంలో నాటి రాయల వైభవం ఆత్మసాక్షాత్కారించింది. ముఖ్య అతిథి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య హుస్సేన్ రెడ్డి మాట్లాడుతూ, రాయలవారి ప్రాభవాన్ని విశేషంగా కొనియాడారు. గౌరవ అతిథి ఆచార్యులు ఎం.వి లక్ష్మయ్య, సభాధ్యక్షులు ఆచార్య ఏ.కృష్ణ కుమారి రాయలవారి పాలన వైభవాన్ని సభికుల హృదయాలకు హత్తుకునేలా మాట్లాడారు.

ఈ సందర్భంగా వివిధ సాంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ
కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధానాచార్యులు, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ చాగంటి రామిరెడ్డి, బోధన, బోధనేతర పరిశోధక విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.