సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రభావం చూపు తాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. విజయవాడ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ 10 యేళ్లు మోడీ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ పనితీరుతో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొంటుందన్నారు.
ఆకలి సూచిలో అన్ని ఎకనామికల్ సర్వేలు 120 దేశాల్లో ఇండియా 111 స్థానంలో ఉన్నట్లు చెబుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వంలో ప్రపంచంలోనే అత్యంత అపర కుబేరుడిగా అదానీ పెరిగాడని అన్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ బాగా పతనమైందన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పోరేట్ శక్తులను పెంచి పోషిస్తుందన్నారు. దేశంలో మహిళలు, పిల్లలు అభద్రతాభావంలో ఉంటున్నారని, మోడీ పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ శక్తులతో దేశ ఉనికికే ప్రమాదమని చెప్పారు. సామాజిక న్యాయం కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు మోడీ హటావో – దేశ్ కో బచావో నినాదంతో సిపిఐ ప్రచారం నిర్వహిస్తోం దన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించి దేశాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కూటమి గెలుపొందుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో సిపిఐకి 1 అసెంబ్లీ, 2 ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు. కేసీఆర్ కు కేంద్ర బిజెపితో అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపించారు. అలాగే చంద్రబాబు అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి, బిజెపి కుట్రలు ఉన్నాయన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక మనకున్న ఎలక్షన్ సిస్టమ్ ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దొంగల రాజ్యం నడుస్తోంది : రామకృష్ణ
దొంగల రాజ్యం ఈ రాష్ట్రంలో నడుస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతుం దన్నారు. 26 జిల్లాల్లో యధేచ్ఛగా వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరుగుతున్నదన్నారు. రకరకాల పేర్లతో మద్యం సొంత బ్రాండ్లు అమ్మిస్తున్నారని అన్నారు. హైకోర్టు స్పష్టంగా అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పినా వినకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళారన్నారు.
450 కోట్ల రూపాయలతో రిషికొండపై ఇల్లు కట్టడానికి అది మీ అబ్బా సొమ్మా అని జగన్ ను ప్రశ్నిస్తున్నా మన్నారు. ఇందులో 150 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఉపాధ్యాయులను బెదిరించేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. ఓటర్ల చేర్పింపులో చాలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో టీచర్లను పాల్గొననీయకుండా కుట్ర చేస్తున్నారన్నారు. ఆన్ని రాజకీయ పక్షాలు జగన్ సర్కార్ విధానాలపై ప్రశ్నించాలని. గవర్నర్ కు దీనిపై ఫిర్యాదు చేస్తామని
రామకృష్ణ అన్నారు.