హిందూపురంటౌన్
బిజెపి ఆ పార్టీతో అంటకాగిన టిడిపి, జనసేన, వైసిపిలను చిత్తుగా ఓడించాలని ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ వలీ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇనాయతుల్లా నివాసంలో కాంగ్రెస్ ఎంపి, ఎమ్మెల్యే అ భ్యర్థులు సమద్ షాహీన్, ఇనాయతుల్లాతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, లక్షల కోట్లు అప్పులు చేసి దివాలా తీసేలా అవినీతి, అక్రమాలు, అరాచకాలతో పాలన సాగించిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఏ రకమైన అజెండా లేకుండా, తెలుగుదేశం పల్లకి మోయడానికి ఆవిర్భవించిన జనసేనకు బుద్ధి చెప్పాలన్నారు. వైసిపి, టిడిపి కూటమిల్లో ఎవరికి ఓటేసినా అది బిజెపికి చేరుతుందని, కేసుల భయంతో రెండు పార్టీలు కమలం పార్టీకి ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. బిజెపి నేతలు రిజర్వేషన్ ను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తి వేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారని వాపోయారు. దీనికి టిడిపి, జనసేన మద్దతు పలుకుతున్నాయని, ఇక వైసిపి సైతం ఇదే దారిలో ఉందన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, ఇతర ఇండియా బ్లాక్ పార్టీలు బలపర్చిన ఇనాయ తుల్లా, సమద్ షాహీన్ లను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఖలీల్, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులు పట్టణంలో పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

