దాడిని ఖండించిన రాజకీయ పార్టీల నేతలు
లేపాక్షి :
మండల కేంద్రమైన లేపాక్షిలో మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి దినపత్రిక స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణ పై జరిగిన దాడికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ,విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంది విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శివప్ప మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న విలేకరులపై దాడులు శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి సభలోనే ఒక విలేఖరి పై దాడి వైకాపా నాయకుల పెత్తందారి వ్యవస్థకు నిదర్శనం అన్నారు. వెంటనే దాడికి కారకులైన వైకాపా గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీ బ్లాక్ అధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ, వైకాపా గుండాలు ఒక విలేఖరి పై దాడి చేసి రెండు రోజులు గడిచినా వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పాలనలో న్యాయం ,ధర్మం లోపించిందని అందుకు విలేకరిపై దాడి అద్దం పడుతుందన్నారు. దాడికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ , ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి వైకాపా నాయకుల అహంకారానికి పరాకాష్ట అన్నారు. బాధ్యతాయుతమైన విలేకరిపై దాడి చేసినా పట్టించుకోని ప్రభుత్వం సాధారణ ప్రజలపై దాడులు చేస్తే పట్టించుకుంటుందా అని ప్రశ్నించారు. దాడిని ఖండించాల్సిన బడా నాయకులే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండించకపోగా సమర్థించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, శ్రీరామ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,బయన్నపల్లి రవి, షేక్షావలి, టీఎన్ఎస్ఎఫ్ అభి, కాంగ్రెస్ అధ్యక్షులు సద్రుద్దీన్ ఖాన్ , బిజెపి మండల అధ్యక్షుడు నరసింహమూర్తి, నాయకులు బద్రి ,సిపిఎం నాయకులు ప్రవీణ్ కుమార్ ,నరసింహులు, ఏఐఎస్ఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ బాబావలి, విలేకరులు గోవర్ధన్ బాబు, ప్రభాకర్ రెడ్డి ,సందీప్ కుమార్ ,శివకుమార్, నాగభూషణ, నాగేంద్ర ,అశోక్ లతోపాటు పలువురు అఖిలపక్షం నాయకులు ఉన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు.