Saturday, November 8, 2025

Creating liberating content

Uncategorizedప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్లక్ష్యమే భర్త ప్రాణాలు తీసింది

ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్లక్ష్యమే భర్త ప్రాణాలు తీసింది

  • టెక్నికల్ అసిస్టెంట్ మృతిపై భార్య ఆరోపణ
  • బాధిత కుటుంబానికి సహాయం కోసం పోరాటం

ప్రజాభూమిప్రత్యేకప్రతినిధి (అమరనాథ్) – తిరుపతి

తిరుపతి జిల్లాలో సాంకేతిక సహాయకుడిగా విధులు నిర్వహించిన వి కోటేశ్వరరావు మృతి కేసు చుట్టూ తీవ్ర చర్చ మొదలైంది. ఆయన భార్య విందూరు మల్లేశ్వరి కన్నీటి పర్యంతమై తన భర్త ప్రాణాలు తీసినది జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ, న్యాయం కోసం తాను పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. బాలయపల్లి మండలం నిడిగల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, గూడూరు మండల పరిధిలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేసేవారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దొరవారిసత్రం మండలంలో జరిగిన సోషల్ ఆడిట్‌లో కొలతల తేడాల పేరుతో ఆయనను సస్పెండ్ చేశారు. అప్పటి నుండి కోటేశ్వరరావు నిర్దోషి అని చెబుతూ న్యాయం కోసం తిరుపతి జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పిడి) కార్యాలయాన్ని వదల్లేదు. మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం, తన భర్త ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్దే కూర్చుని బాధను వ్యక్తం చేసేవారని, కానీ అధికారులు లోపలికి కూడా అనుమతించలేదని వేదనతో చెబుతున్నారు. ఆయన మాట ఎవరూ వినలేదు. తన నిర్దోషిత్వం నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి జూలై 9న పీడీని కలవడానికి ప్రయత్నించినా లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించారని ఆమె ఆవేదనతో వివరించారు. తన భర్త మరణంతో కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుదేలైందని, ఇద్దరు పిల్లలు పోషణ, చదువులు కష్టమైందని మల్లేశ్వరి తెలిపారు. ఆయనకు ఐదు నెలలుగా జీతం రాలేదు. పిల్లల చదువు, జీవనాధారం కష్టంగా మారింది. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయనకు రావలసిన బకాయిలు, ఈపీఎఫ్‌, ఇతర ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సాధారణ ఉద్యోగి న్యాయం కోసం కార్యాలయ ద్వారం దాటలేక ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు ఉద్యోగులు అధికారి నిర్లక్ష్యమే కారణమని వాదిస్తుండగా, మరోవైపు అధికారులు ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘటనలో వాస్తవం ఏదన్నది అధికారులు, ప్రజా ప్రతినిధులు సమగ్ర విచారణ జరిపితేనే బయటపడనుంది.

ప్రాజెక్ట్ డైరెక్టర్ వివరణ

ఈ ఆరోపణలపై స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, నా మీద వచ్చిన ఆరోపణలన్నీ అసత్యం. నేను ఎవరిపైనా వివక్ష చూపలేదు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సమాన గౌరవమే ఇస్తానని స్పష్టం చేశారు. ఇక జేఏసీ జిల్లా అధ్యక్షుడు చలపతి ఫోన్ ద్వారా మాట్లాడుతూ.., ప్రాజెక్ట్ డైరెక్టర్ మంచి అధికారి. ఆయనపై చేసిన ఆరోపణలు నిరాధారాలు. అయినప్పటికీ మృతుని కుటుంబానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article