స్వదేశీ వస్తువులనే కొందాం… ఆత్మ నిర్భర్ భారత్ సాధిద్దాం
జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయన్న సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం
అమరావతి, సెప్టెంబర్ 21: నెక్స్ట్ జెన్ జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారంటూ చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ సంస్కరణలు తో జీఎస్టీ బచత్ ఉత్సవ్ వేడుకలు ప్రారంభించడం సంతోషించ దగిన పరిణామమని సీఎం అభిప్రాయపడ్డారు. జీఎస్టీ పన్ను శ్లాబులను 5, 18 శాతానికి మాత్రమే పరిమితం చేయడంతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు. 99 శాతం నిత్యావసర వస్తువులు 5 శాతం పరిధిలోకి వస్తాయని దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువతకు ఈ సంస్కరణల వల్ల లబ్ది చేకూరుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో ఖర్చులు తగ్గుతాయని… అలాగే వ్యాపారాలు పెరగడంతో పాటు.. పెట్టుబడులను ఆకర్షించేలా సంస్కరణలను రూపకల్పన చేశారన్నారు. ప్రధాన మంత్రి చెప్పిన నాగరిక్ దేవో భవ అనే మంత్రం దేశ ప్రజలకు అందించే ఓ బహుమతి అని సీఎం అభివర్ణించారు. గర్వ్ సే కహో, యే స్వదేశీ హై అంటూ ప్రధాని ఇచ్చిన నినాదం జాతీయ భావాలను అందరిలోనూ పెంపొందించేలా ఉందన్నారు. ఈ నినాదం జాతీయ ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. వృద్ధిలో సమాన భాగస్వాములుగా ఉండాలని, స్థానిక ఉత్పత్తులను పెంచాలని ప్రధాని రాష్ట్రాలకు చేసిన పిలుపు సహకార సమాఖ్య వాదానికి ఒక బలమైన సందేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ స్ఫూర్తితో పని చేయాలన్న ప్రధాని మోదీ సూచనలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ సూచనలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధనకు అంకితమవుతానని సీఎం స్పష్టం చేశారు. సాహసోపేతమైన నిర్ణయంతో జీఎస్టీ సంస్కరణలు తెచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో దసరా పండుగను రెండింతలు ఉత్సాహంతో ప్రజలు జరుపుకుంటారన్నారు. తక్కువ ధరలు, సరళతరమైన పన్నులతో ప్రజలు నేరుగా లబ్ది పొందనున్నట్టు సిఎం వెల్లడించారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని చంద్రబాబు సూచించారు. ఆత్మ నిర్భరత, జాతీయతా భావం పెంచేలా ప్రతి ఒక్కరి అడుగులు వేయాలని ముఖ్యమంత్రి తన ఎక్స్ లో కోరారు.

