నూతన ప్రభుత్వాలకు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విన్నపం!
వేలేరుపాడు :పోలవరం నిర్వాసితులకు నూతన ప్రభుత్వాలు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విన్నవించారు,
ప్రాజెక్టు నిర్మాణం కోసం తరాల నుంచి వారసత్వంగా పొందిన తమ భూములు, ఇల్లు సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులను ప్రభుత్వాలు పట్టించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విజ్ఞప్తి చేశారు. వేలేరుపాడు సిపిఐ కార్యాలయంలో శనివారం జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టా వీరయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక ఏళ్లుగా న్యాయం జరగక నిర్వాసితులు ఎంతో నష్టపోయారన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం చేయమని వేడుకున్న పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. గత ప్రభుత్వం అనేక హామీలు నిర్వాసితులకు ఇచ్చి వాటిని నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ముంపు గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక సంవత్సరాల క్రితం చేపట్టిన సర్వేలను ఆధారంగా చూపించి నిర్వాసితులకు నష్టం చేయరాదన్నారు. తరలించేనాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి ప్యాకేజీ అందించాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అనర్హులుగా పేర్కొన్న స్థానికులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాసం కల్పించి న్యాయం చేయాలన్నారు. కట్ ఆఫ్ తేదీలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ వర్తింప చేయాలన్నారు. నిర్వాసితుల మిగులు భూములకు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. అనేక సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. గోదావరి వరదల వలన ముంపు గ్రామ ప్రజలకు ఎటువంటి నష్టం చేకూరాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సురక్షిత ప్రాంతాలలో ముంపు గ్రామ ప్రజలకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ కారం ధారయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబు,మండల కార్యదర్శి బాడిస రాము, రామవరం సర్పంచ్ పిట్ట ప్రసాద్, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి రమణ రాజు, , తదితరులు పాల్గొన్నారు.