వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇపుడు భారత రాష్ట్ర సమితి పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో లోక్‌సభ ఎన్నికల తర్వాత దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదనీ, తమ పార్టీ ప్రభుత్వాన్ని మేమెందుకు కూల్చుకుంటామని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల సారథ్యంలో ముందుకు వెళుతూ రాష్ట్ర ప్రజానీకానికి సుస్థిర పాలన అందిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అవాకులు చెవాకులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆయనకు సపర్యలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.