హిందూపురంటౌన్ :టిడిపి, జనసేన, బిజెపి కూటమి హిందూపురం సమగ్ర అభివృద్ధి కోసం తాను రూపొందించిన సప్తపది కార్యక్రమాలకు ఒప్పుకుంటే ఎన్నికల బరిలో నుంచి తప్పు కుంటానని…ఒప్పు కోక పోతే కూటమిని ఎదురించి హిందూపురం పార్లమెంటు స్థానంతో పాటు అసెంబ్లీ స్థానానికి కూడా బరిలో ఉంటానని కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీశవెల్లడించారు. సోమవారం పట్టణంలోని గుడ్డం రంగనాథ స్వామి ఆలయం వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. హిందూపురం సమగ్ర అభివృద్ధికై సప్తపది కార్యక్రమం చేపట్టమన్నారు. అందులో మొదటి అడుగు గణేశ సరోవరం అభివృద్ధి అన్నారు. పట్టణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ మండపాల్లో పూజించిన గణపతి ప్రతిమలను నిమజ్జనం చేసే పవిత్ర స్థలం గుడ్డం చెరువు. పాలకుల అలసత్వం వల్ల ఆ చెరువు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందన్నారు. పవిత్రంగా పూజలందుకున్న గణపతి ప్రతిమలు పూర్తిగా నిమజ్జనం కాకుండా అశ్రద్ధ చేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది శాస్త్రీయం కాదని దైవానికి జరుగుతున్న అపరాధమన్నారు. తగిన రీతిలో చెరువును శుభ్రపరిచి ఆధ్యాత్మిక శోభతో గ ణేశ సరోవరంగా తీర్చిదిద్దాలని, తద్వారా దైవానుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. హిందూపురం వాసులు తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి సప్తపది అని ఏడు అంశాలు లక్ష్యంగా పెట్టుకున్నానని, అందులో తొలి అడుగుగా గణేశ సరోవర నిర్మాణమని తెలిపారు. ఈ ఏడు అంశాలు కూటమి చేస్తామని ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానన్నారు. లేనిపక్షంలో ప్రజల ఆశీర్వాదాలతో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని తెలిపారు.