మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వెంటనే పరిష్కృతం చేయాలి
ఇక ఆన్లైన్లోనే అన్ని దస్త్రాల నిర్వహణ… నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు
స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది జాబ్‌ఛార్ట్ సిద్ధం చేయండి
8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
సమావేశానికి గైర్హాజరైన అధికారులపై సీఎం ఆగ్రహం…వివరణ తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశం
రెండ్రోజుల్లోపు ఫైళ్లు క్లియర్ చేసినవారికి అభినందనలు… గంటల్లో పూర్తి చేసిన వారికి సీఎం ప్రత్యేక ప్రశంసలు
ప్రజాభూమి ప్రతినిధి,అమరావతి:-* ప్రభుత్వంలో పాలన వేగంగా సాగాలంటే దస్త్రాల పరిష్కరించడంలో జాప్యం ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు దస్త్రాలను త్వరితగతిన క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయకుండా జాప్యం చేస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులను ప్రశంసించిన సీఎం.. గంటల్లోనే ఫైళ్లను క్లియర్ చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు రోజుల సమయం తీసుకుంటున్న మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ల సదస్సుకు కొందరు అధికారులు హాజరుకాకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల గైర్హాజరుపై వివరణ తీసుకోవాలని సీఎస్ సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. ఐఏఎస్ అధికారుల 360 డిగ్రీల నివేదికను కూడా అందరి అభిప్రాయాలు తీసుకుని తయారు చేస్తామని తెలిపారు. కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడే పనితీరును సవరించుకోగలమని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇక ఆన్లైన్ ద్వారానే ఫైళ్లను నిర్వహించాలని, ఇందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. మాన్యువల్ ఫైళ్లు నడిపితే ఇకపై తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ.. ఈ అంశంపై మంత్రులు కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామాలకు వెళ్లండి…సమస్యలు పరిష్కరించండి
కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పాలనలో టెక్నాలజీ, పాజిటివ్ పర్సెప్షన్ అంశాలపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. “పీజీఆర్ఎస్ దరఖాస్తులను ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఇకపై ఈ పర్యటనల వివరాలను కూడా ఇవ్వాలి. మున్సిపాలిటీల్లోనూ ఇదే ప్రక్రియ జరగాలి. ప్రతి సోమవారం ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయి అంశాలను సమీక్షిస్తున్నా” అని ముఖ్యమంత్రి అన్నారు.
అన్ని శాఖల్లో టెక్నాలజీ వినియోగం
“ప్రభుత్వ శాఖలన్నీ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో పనిచేయాలి. అన్ని రంగాల్లోనూ డీప్‌టెక్‌ను అమలు చేయాలి. దాని ద్వారా అదనపు అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంటుంది. టెక్నాలజీతో రెవెన్యూ పెంచుకోవచ్చు. సంపద సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు. డేటా లేక్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలి. డేటా లేక్‌లో ఉన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రతి ప్రభుత్వ శాఖ తమ విభాగాల్లో ఏఐ స్టాక్ టెక్నాలజీని వినియోగించాలి. జీఎస్టీలో ఏఐ స్టాక్ వినియోగం ద్వారా ఫలితాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో కూడా లీగల్ ఏఐ స్టాక్‌ను వినియోగించాలి.”అని సీఎం చంద్రబాబు సూచించారు.
సమస్యల్లేని సమాజం కోసం పనిచేయాలి
“సమస్యలు లేని సమాజం కోసం అందరూ పనిచేయాలి. ప్రతి జిల్లాకు వచ్చినప్పుడు వివిధ పౌరసేవలపై వ్యక్తమవుతున్న ప్రజాభిప్రాయాన్ని సభల్లోనే చదివి వినిపిస్తున్నాను. ప్రభుత్వం అందించే సేవలతో పాటు సంక్షేమ పథకాలపై కూడా ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావాలి. లోటుపాట్లను సవరించుకోవడం ద్వారా మరింత సమర్థంగా సేవలు, సంక్షేమ పథకాలను అందించే అవకాశం ఉంటుంది. ప్రజల కోసం స్కీంలను అందుబాటులోకి తీసుకురావడం, పాలసీలను రూపొందించడంతో పాటు వాటిని సులభంగా ప్రజలకు అందించేలా చేసినప్పుడే వాటికి సార్థకత ఉంటుంది. ప్రజల్లో పరిపాలన పట్ల సానుకూల ధోరణి వ్యక్తమయ్యేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. సరిగా పనిచేయని వారిని పక్కన పెట్టి, పనిచేసే వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించాలి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లో సిబ్బంది రైషనలైజేషన్
“స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగికి ఒక్కో బాధ్యత మాత్రమే అప్పగించాలనే విధానం కష్టసాధ్యమైంది. కొంతమందిపై ఎక్కువ పని భారం ఉంటే.. మరికొందరికి చాలా తక్కువ పని ఉంటోంది. దీన్ని సరిచేసి రేషనలైజ్ చేయాలి. పనిభారం పెంచకుండా వివిధ బాధ్యతలను అప్పగించేలా చూడాలి. ప్రతి పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలి” అని సీఎం ఆదేశించారు.

