ముదిగుబ్బ
రాష్ట్రంలో పేదలకు జగనన్న పట్టాల పేరున ఇచ్చిన నివాసస్థలాల రిజిస్ట్రేషన్లు ముదిగుబ్బలోను అధికారులు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ సర్వర్లు ఒత్తిడికారణంగా సచివాలయాలవద్ద లబ్ధిదారులైన మహిళలు, సచివాలయ సిబ్బంది పడిగాపులు కాస్తున్నారు. 2021, 2022, 2023 లో జగనన్న కాలనీలు ఏర్పరిచి వెంచర్లువేసి అర్హులైన లబ్ధిదారుల జాబితాల ప్రకారం అప్పటి తహసిల్దార్లు ఆయా సచివాలయాల పరిధిలో పట్టాలను పంపిణీ చేశారు. అయితే వాటిని నేటివరకు ఆన్లైన్ చేయని కారణంగా ఆపట్టాలను ప్రభుత్వం తహసిల్దార్, ఎంపీడీవోల పర్యవేక్షణలో గతరెండు రోజులుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నది. ఇందుకోసం లబ్ధిదారులు నేరుగావచ్చి వేలిముద్ర వేయాల్సి వుంది. ఆన్లైన్ సర్వర్ల బిజీకారణంగా ఇటు లబ్ధిదారులైన మహిళలు, సచివాలయ సిబ్బంది విసిగి వేజారిపోతున్నారు. మండల వ్యాప్తంగా 907 మంది లబ్ధిదారులు ఉండగా బుధవారం నాటికి 153 మంది రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని తాసిల్దార్ సరస్వతి దేవి పేర్కొన్నారు. వారంలోగా లబ్ధిదారులు ఎక్కడున్నా రోజువారి వారి వాలంటీర్లు ఇచ్చిన తేదీ ప్రకారం వారివారి ఆధారాలతో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా సచివాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎంపీడీవో జీఎన్ఎస్ రెడ్డి పర్యవేక్షించారు.