భూ రికార్డులలో తహసిల్దారు సంతకం తొలగించడాన్ని నిరసిస్తూ
బుట్టాయగూడెం:భూ హక్కుల రికార్డులలో తహసిల్దార్ సంతకం తొలగించడాన్ని నిరసిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మండలంలోని వెలుతురివారిగూడెం గ్రామ గిరిజనుల భూమి ఆన్లైన్ రికార్డుల నుండి తహసిల్దార్ సంతకాలు తొలగించడంతో రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలభారత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ మాట్లాడుతూ భూ రికార్డులలో డిజిటల్ సంతకం వెంటనే ఇవ్వాలని, 2007 సం.లో 1/70 భూమి తీసుకొని అసైన్మెంట్ చేసి 74 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఆ హక్కు పట్టాలను ఆన్లైన్ రికార్డు చేసుకుని, వాటి ద్వారా లబ్ధిదారులు బ్యాంకు లోన్లు కూడా పొంది ఉన్నారని వివరించారు. గత వారం రోజుల నుండి ఆన్లైన్ రికార్డులలో తహసిల్దారు డిజిటల్ సంతకం కనిపించకుండా పోయిందని, రెవిన్యూ వారి నిర్లక్ష్యం వల్ల గిరిజన లబ్ధిదారుల హక్కులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు . రెవిన్యూ రికార్డులలో డిజిటల్ సంతకం తక్షణమే ఇవ్వక పోతే తహసిల్దార్ కార్యాలయం వదిలి వెళ్ళేది లేదని గిరిజనులందరూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. క్యాంపులో ఉన్న తహసిల్దారు సిహెచ్. వెంకటేశ్వర్లు సమాచారం తెలుసుకొని అక్కడికి వచ్చి గిరిజన రైతులతో మాట్లాడుతూ రెండు రోజుల్లో ఆన్లైన్ రికార్డులలో తహసిల్దార్ సంతకం ఇస్తానని హామీ ఇచ్చారు. గిరిజన రైతులు తమ డిమాండ్ తెలియజేస్తూ వినతి పత్రాన్ని తహసిల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లుకు అందించారు. అనంతరం గిరిజన రైతులు ధర్నాని విరమించారు. ఈ కార్యక్రమానికి ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెట్టి సుబ్బన్న, ఐఎఫ్ టియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రామ్మోహన్, పివై#ఎల్ డివిజన్ సహాయ కార్యదర్శి టి.బాబురావు, పోతిరెడ్డి, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, పి డి ఎస్ యు నాయకులు ఈ. భూషణం , బి వినోద్, ఏఐకేఎంఎస్ నాయకులు బాసా రంపాలరాజు, డి.అర్జునుడు, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, న్యాయవాది భాషా శ్యాంబాబు, తదితరులు నాయకత్వం వహించారు.