ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు
ప్రజాభూమి, విజయవాడ బ్యూరో
సమాజంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో అనుసంధానం చేసి తత్వజ్ఞానాన్ని
అందించేందుకు ఎంతో కృషిచేసిన కన్నడ కవి, సంగీతకళాకారుడు, స్వరకర్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. గురువారం కనకదాస జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు.కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కన్నడ కురుబ కుటుంబంలో జన్మించిన కనకదాస విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష పరిశీలన చేసి, అర్థం చేసుకొని నల చరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యానచరితే, మోహన తరంగిణి తదితర రచనలు చేసి సమాజానికి దశదిశ చూపారని.. ఆయన మనకు అందించిన జ్ఞానాన్ని వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య, సహాయ బీసీ సంక్షేమ అధికారి హరిబాబు, సూపరింటెండెంట్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.