గొల్లప్రోలు :మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి స్ఫూర్తి నింపిన నాయకురాలు భూమిలేని పీడిత పేదల కోసం కడదాకా పిడికిలి బిగించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంకు జన విజ్ఞాన వేదిక గొల్లప్రోలు మండల శాఖ ఘనంగా నివాళులర్పించారు. గొల్లప్రోలు ఎస్సీ కాలనీ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ నందు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు ఏలేటి నాని బాబు పాల్గొని రేపటి తరానికి మల్లు స్వరాజ్యం ఆదర్శమని చాకలి ఐలమ్మ వారసురాలిగా మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి ఎంతో కృషిచేసిన మహిళ పేదల అభ్యున్నతికి పాటుపడడానికి తన సొంత పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచిన స్నేహశీలియని అటువంటి ఉద్యమ కెరటం మల్లు స్వరాజ్యంను మనం స్మరించుకోవడమే కాకుండా ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లినప్పుడే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళులని అన్నారు.ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ సభ్యులు సింగలూరు చిలకమ్మ, టి నయోమి రాగం, నూకరత్నం,గంగ చంద్రకాంతం పాల్గొన్నారు.