Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుజగనన్న పాల‌న‌లోనే సామాజిక సాధికారత

జగనన్న పాల‌న‌లోనే సామాజిక సాధికారత

సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

ప్రజాభూమి విజయవాడ బ్యూరో:
దేశంలో సామాజిక సాధికారతను నినాదంగా కాకుండా, ఒక విధానంగా మార్చేసిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 239 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. జ్యుడిషియల్ కాలనీ, తోట వారి వీధిలో విస్తృతంగా పర్యటించి.. 172 గడపలను సందర్శించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో మమేకమై.. ప్రజాభిప్రాయాలను స్వీకరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. స్థానికులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దృష్టికి వచ్చే సమస్య ఎటువంటిదైనా నూరు శాతం పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా సూచించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది అని ఆయన అన్నారు.
మైనార్టీల సంక్షేమం గూర్చి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశం, పచ్చ మీడియాకు ఏ మాత్రం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. సీఎం వైఎస్ జగన్ వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పుకొచ్చారు. మైనార్టీల అభ్యున్నతికై ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ తో ఈ రోజున రాష్ట్రంలో ముస్లింలందరూ విద్య, వైద్య రంగాల్లో రాణించి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని చెప్పారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైనార్టీ యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఉర్దూ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింలను పట్టించుకున్న పాపానపోలేదని.. గతంతో పోలిస్తే మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చుచేసింది కేవలం రూ. 2,665 కోట్లు మాత్రమేనని.. ఈ ప్రభుత్వం వచ్చాక డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్షరాలా రూ. 23,176 కోట్ల మేర లబ్ది చేకూర్చినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదని.. ఈ ప్రభుత్వంలో ఏకంగా డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి గౌరవించుకోవడం జరిగిందన్నారు. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం జరిగిందన్నారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే ఈ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని అందిస్తోందన్నారు. ఉర్దూ భాషకు గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ వల్ల ఏపీ నుంచి తొలిసారిగా హజ్ యాత్ర ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. అలాగే వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా మైనార్టీ కుటుంబాలలో వివాహానికి ప్రభుత్వం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతున్నట్లు తెలిపారు. అటువంటి ముఖ్యమంత్రికి మైనార్టీలంతా అండగా నిలవాలని ప్రతిపక్షాలు, పచ్చ మీడియా విష ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, అంజిరెడ్డి, నాగిరెడ్డి, వలి, వసంత్, శర్మ, కృష్ణమోహన్, తోపుల వరలక్ష్మి, శోభన్, మహేశ్వరి, స్వరూప, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article