బుట్టాయగూడెం:మండలంలోని అలివేరు సమీపంలోని గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలో స్నానానికి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడు. బుట్టాయగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన కడారి దుర్గా సాయికుమార్ (27) మరో ఏడుగురు స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి సాయంత్రం ఐదు గంటల సమయంలో జల్లేరు జలాశయం వద్దకు చేరుకున్నారు. మిత్రులతో కలిసి జల్లేరు జలాశయంలో స్నానానికి దిగిన మృతుడు సాయికుమార్ లోతైన ప్రదేశంలో దిగడంతో నీటి అడుగుకు చేరుకుని మృతి చెందాడని భావిస్తున్నారు. సాయికుమార్ నీటిలో గల్లంతవడంతో మిత్రులు చాలాసేపు నీళ్లలో గాలించారు కానీ వారికి ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో సరిపల్లిలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. జలాశయంలో ఒకటి గల్లంతు సమాచారం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి జంగారెడ్డిగూడెం ప్రమాద, విపత్తుల నివారణ శాఖ అధికారులతో కలిసి జలాశయంలో గాలించగా సోమవారం ఉదయం 10:30 గంటలకు సాయికుమార్ మృతదేహం దొరికింది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి కడారి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బుట్టాయిగూడెం హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.