డీఎస్పీ (సిఐడి విభాగం) సిహెచ్.పెంటారావు
బుట్టాయగూడెం.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కోసం రూపొందించబడిన చట్టాలను పకడ్బందీగా అమలు చేసి ఆదివాసీల హక్కులను పరిరక్షించాలని సిఐడి విభాగం, డిఎస్పి సిహెచ్.పెంటారావు అన్నారు. రాష్ట్ర అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి విభాగం) ఎన్. సంజయ్, మంగళగిరి ఉత్తర్వుల మేరకు రాజమండ్రి సిఐడి విభాగం ఆధ్వర్యంలో కోట రామచంద్రపురం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ (1989 చట్టం)పై, గిరిజనుల కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ఐటీడీఏ ఏపీవో పివి.శ్రీనివాస్ నాయుడు, సిఐడి విభాగం డీఎస్పీలు బి రామకృష్ణ, సిహెచ్ పెంటారావు, పోలవరం డీఎస్పీ రత్నరాజు, కోట రామచంద్రపురం సర్పంచ్ ఉయికే బొజ్జి హాజరయ్యారు. వీరితోపాటు ఈ సదస్సులో జంగారెడ్డిగూడెం ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు, ఆదివాసి ఉపాధ్యాయ సంఘ ప్రతినిధి జలగం రాంబాబు, ఆదివాసి జేఏసీ అధ్యక్షుడు మొడియం శ్రీనివాసరావు, తదితరులు ప్రసంగించారు. ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాల తో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కూడా రక్షించుకోవాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో సమాజంలో కుల వ్యవస్థను సమతుల్యం చేయడానికి షెడ్యూల్ తెగలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, రిజర్వేషన్లను కల్పించారని, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం ఆదివాసీల నివాసిత ప్రాంతాలను ఐదో షెడ్యూల్లో చేర్చారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందిన తెగలను మాత్రమే షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తిస్తారని అన్నారు. దేశ జనాభాలో(10.28 కోట్లు) 8.61%, రాష్ట్ర జనాభాలో(27.39 లక్షలు) 5.53% గిరిజన జనాభా ఉన్నారని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా దేశాభివృద్ధిలో గిరిజనుల పాత్ర పరిమితమేనని, ఇప్పటికీ ఎక్కువ శాతం గిరిజనులకు ప్రభుత్వపరమైన ఆర్థిక సేవలు, రవాణా, సమాచార, తదితర సేవలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు గిరిజనుల హక్కులు, చట్టాలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఉన్న హక్కులు, ఆర్థికపరమైన పరిరక్షణ, రాజకీయ పరిరక్షణ, న్యాయపరమైన హక్కులు తప్పనిసరిగా గిరిజనులకు దక్కాలని అన్నారు. 1989 షెడ్యూల్ కులాల, తెగల అత్యాచార నిరోధక చట్టం పగడ్బందీగా అమలు జరగాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఆవశ్యకత, ఐటీడీఏ ద్వారా గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి, అమలవుతున్న రాజ్యాంగ హక్కులు, గిరిజన బాధితులకు అందవలసిన నష్టపరిహారం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సిఐడి విభాగం ద్వారా గిరిజన తెగల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించే కరపత్రాలను, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సదస్సులో మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, సిఐడి ఇన్స్పెక్టర్ పివివి. నరసింహారావు, బుట్టాయిగూడెం ఎస్సై కె.వెంకన్న, జీలుగుమిల్లి ఎస్సై టి.క్రాంతి కుమార్, సిఐడి ఎస్ ఐ లు కె. ఫణి కుమార్, వై.శ్రీనివాసరావు, గాయత్రి, సిబ్బంది, నియోజకవర్గంలోని పలు గిరిజన సంఘాల సభ్యులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు.

